అంతర్జాతీయ దిశగా తెలుగు భాష

అంతర్జాతీయ దిశగా తెలుగు భాష

3000 సంవత్సరాల పైగా ఉన్న తెలుగు భాష చరిత్రలో ఇదొక చారిత్రాత్మక ఘట్టం.  ప్రపంచంలో మొట్టమొదటిసారిగా భారతదేశం వెలుపల తెలుగు భాషను గుర్తించిన దేశంగా ఆస్ట్రేలియా చరిత్ర పుటల్లో నిలచిపోతుంది.  బహుళ సంస్కృతీ సాంప్రదాయాలకు పట్టంగట్టే ఈ దేశంలో 300 పైగా భాషలు మాట్లాడే వారున్నారు.  ఇందులో 47 భాషలకు సామజిక భాషలుగా గుర్తించి ప్రస్తుతం NAATI సంస్థ Credentialed Community Language (CCL) పరీక్షలు నిర్వహిస్తున్నారు. 48వ భాషగా తెలుగును ఇప్పుడు చేర్చారు. వాటిలో మూడు భారతీయ భాషలు హిందీ, పంజాబీ మరియు తమిళ భాషలున్నాయి.  తెలుగు నాల్గవ భాష. ప్రపంచ దేశాలలో ఈ విధమైన గుర్తింపు ఎక్కడా ఉన్న దాఖలాలు లేవు.  ఆస్ట్రేలియాలోనే ఈ విధమైన  తెలుగు భాషకు గుర్తింపు ఇవ్వడం ద్వారా తన బహుళ సంస్కృతీ సంప్రదాయాన్ని చాటుకుంది.  దీనిద్వారా ఎన్నో లాభాలు ఉన్నా ముఖ్యమైనది ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునేవారికి 5 పాయింట్లు రావడం. సంఖ్యా పరంగా… ఆస్ట్రేలియాలో భారతీయ సంతతివారిని ప్రస్తుతిస్తే తెలుగువారు షుమారు 80,000 – 1,00,000 మంది ఉన్నట్లు అనధికార అంచనా. పంజాబీ, గుజరాతీల తరువాత ఎక్కువ సంఖ్యలో వున్నవారు తెలుగువారే.

ప్రపంచ భాషగా తెలుగు… ప్రపంచ భాషగా తెలుగు వికసించాలని తెలుగుమల్లి ఇదివరకే అకాక్షింది.  ముఖ్యంగా అస్ట్రేలియాలో నివసిస్తున్న తెలుగు ప్రజలు తమ భాషనీ సంస్కృతీ మూలాలనీ పరిరక్షించుకుంటూ ప్రపంచభాషగా తెలుగుని సంరక్షిస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ముందుకు వెళుతూ సాహితీ సదస్సులు, రంగస్థల నాటకాలు నిర్వహించడం, స్థానిక భాషాభిమానులు వ్రాసిన పుస్తక ప్రచురణలు చేయడం,  ఆస్ట్రేలియాలో నిర్వహిస్తున్న తెలుగుబడులను ప్రోత్సహించడం వంటి ఎన్నెన్నో కార్యక్రమాలలో తెలుగుమల్లి తన అనుబంధ సంస్థ భువనవిజయంతో కూడి క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. శ్రీ పార్వతీ కళ్యాణం https://www.youtube.com/watch?v=2QymZW5U2ds శ్రీకృష్ణ రాయబారము https://www.youtube.com/watch?v=MBy7GAVLufI&t=18s ఇది ఒక రకమైన అంతర్జాతీయతనే చెప్పాలి. ఈ అంతర్జాతీయతకి కారణం తెలుగు భాష తెలుగు దేశంలో వుండగానే నేర్చేసుకుని, ఆ భాష ఒక్కటే నిజంగా బాగా వచ్చి, ఉద్యోగ రీత్యానో వ్యాపారం కోసమో అవసరమైనంత ఇంగ్లీషు నేర్చుకుని, ఇంగ్లీషు మాతృభాష అయిన దేశాలకి తెలుగు వాళ్లు వెళ్లడం. ఇలా వెళ్లిన వాళ్లు అమెరికా లోనూ ఇంగ్లండ్, కెనడా, ఆస్ట్రేలియాల లోనూ వున్నా వాళ్లు సాంస్కృతికంగా తెలుగువాళ్లే. పరభాషా సంస్కృతితో సహ జీవనం చేస్తూ మన భాష ఉనికిని కాపాడుకుంటూ ఎంతో కృషి చేస్తున్నారు.

ఆస్ట్రేలియాలో ప్రతీ రాష్ట్రంలోనూ తెలుగు సంఘాలున్నాయి. ప్రతీ పండగకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కొన్ని సంఘాలు తెలుగులో రేడియో కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాయి. తెలుగు బడులు కూడా నిర్వహిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలలో స్థానికులు తెలుగు భాషపై మక్కువతో తెలుగు సంఘాలు నిర్వహించే తెలుగు బడుల్లో మన భాషని అధ్యయనం చేస్తున్నారు. వీరంతా చేస్తున్న కృషికి గుర్తింపుగా తెలుగు భాషకు ఆస్ట్రేలియాలో సముచిత గౌరవం లభించింది.  తెలుగును ప్రపంచ భాష స్థాయికి తీసుకు వెళ్ళాలని ఆస్ట్రేలియాలోని తెలుగు భాషాభిమానులు చేస్తున్న ఎన్నో ఏళ్ళ కృషి ఇలా సత్ఫలితాలను ఇస్తోందనే చెప్పాలి. తదుపరి అడుగులు: తెలుగు నేర్చుకోవడం మూలంగా తెలుగులో వున్న పుస్తకాలు చదవడం మూలంగా ప్రపంచ విజ్ఞానాన్ని పెంచే ప్రయత్నాలు జరగాలి. అనువాద ప్రక్రియకు శ్రీకారం చుట్టాలి.  నువ్వు ఏ భాష వాడివైనా తెలుగులో రాసిన పుస్తకాలు చదవకపోతే ఇదిగో నీ విజ్ఞానానికి ఈ రకంగా లోపం వస్తుంది, అని మనం చెప్పగలిగిన రోజున, ఆ మాట ప్రపంచం లోని విజ్ఞానులు విన్న రోజున, ఆ మాట విని వాళ్లు తెలుగు నేర్చుకున్న రోజున, లేదా తెలుగు పుస్తకాల అనువాదాలు వాళ్లు చదివిన రోజున, చదివి అందువల్ల వాళ్లు గ్రహించిన విజ్ఞానాన్ని ప్రపంచ విజ్ఞానంలో భాగం చేసిన రోజున — అప్పుడు తెలుగు ప్రపంచ భాషగా నిలుస్తుంది. అందుకు ఎంతో కృషి అవసరం. ప్రపంచంలోని ప్రముఖ దేశాలలో, ముఖ్యంగా అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి దేశాలలో భారతదేశాన్ని గురించి చెప్పుకోదగ్గ పరిశ్రమ జరుగుతోంది. ఈ దేశాల విశ్వవిద్యాలయాలలో ఇప్పుడిప్పుడే తెలుగు గురించి జిజ్ఞాస మొదలవుతోంది.  తెలుగువారిగా ఈ పరిశోధనల్లో పాలుపంచుకొని మనవంతు కృషి చేయాల్సిన అవసరం ఉంది.

అన్ని తెలుగు సంఘాలు ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టి పెద్దఎత్తున తెలుగు భాషా, సంస్కృతులను ప్రోత్సహించాలి.  ఇక్కడి ప్రభుత్వం అందిస్తున్న సహకారాలు అంది పుచ్చుకొని భావి తరాలకు మన సాంప్రదాయాల వారసత్వం అందివ్వాలని తెలుగుమల్లి కోరుకుంటుంది.

Send a Comment

Your email address will not be published.