అజరామరము ఈ సాహితీ సమాహారము

అజరామరము ఈ సాహితీ సమాహారము

కాలమనే దారానికి వక్తలు సాహితీ కుసుమాలై ధరణి చుట్టు హారంగా మారి తెలుగు నినాదం ప్రణవ నాదంగా మారింది. భరణి వంటి కవులు భాజాభజంత్రీలతో స్వాగత వచనాలు పలికితే పలుకులమ్మ తల్లి పరవశించి పులకించిపోయింది. వేనోళ్ళ పలికిన అమ్మ భాష విని వేదాగ్రిణి విజయగర్వంతో తొణికిసలాడింది.

భానుడు ఎటు ఉదయంచాలోనని ఆలోచిస్తున్నాడు. భూమి తనచుట్టూ తిరుగుతోందా, తాను భూమి చుట్టూ తెరుగుతున్నానన్న మీమాంస కలిగింది. దిక్కులన్నీ తమ దిక్కు ఏదని దిక్కులు చూసుకుంటున్నాయి. ధృవాలు తలక్రిందులై తారుమారయ్యాయి. తెలుగు వాణి విని సాగర ఘోష, సముద్రపు అల, మబ్బులోని ఉరుము, మేఘాల గర్జన స్థాణువులా నిలిచిపోయాయి. మరో క్రొత్త ప్రపంచం తెలుగు వాణిగా శంఖారావం చేసి ధ్రువ తారలన్నిటినీ అబ్బురపరిచింది.

36 గంటలు, 200 మంది వక్తలు, 16 పుస్తక ఆవిష్కరణలు, 20,000 మంది ప్రేక్షకులు నిర్విరామంగా తెలుగు కళామతల్లికి నీరాజనం పట్టి సాహితీ సువనంలోని సుగంధ వాసనలను ఆస్వాదించి తరించిపోయారు. ఈ యజ్ఞంలో భాగస్వాములైన అక్షర విజ్ఞులు, పండిత పామరులు, సాంకేతిక నిపుణులు, కార్యక్రమ రూప శిల్పులు, స్వరకర్తలు, గాయనీ గాయకులు అందరినీ వేనోళ్ళ కొనియాడారు. కార్యక్రమం ఎలాంటి అవాంతరాలు లేకుండా నిరాఘాటంగా సాగాలని నిర్వికారుణ్ణి ప్రార్ధించారు. ‘నభూతో నభవిష్యతి’ అన్న విధంగా ఈ సాహితీ ప్రక్రియ నిరాటంకంగా జరిగిన తీరుకి మంగళహారతులు పట్టారు.

తెలుగు అక్షరం పెళ్లి పందిరిలో పరదాల చాటున పరవశంతో ముసి ముసి నవ్వుల ముద్ద మందారంలా ధవళ కాంతుల నడుమ మేని బంగారు ఛాయతో పదహారణాల పల్లె పడుచులా ఒళ్ళంతా సింగారించుకొని నవ యవ్వన నృత్య కళా కారిణిగా తాండవం చేసింది. నన్నయ, పోతన కవుల కాలం నుండి గత వెయ్యేళ్ళ తెలుగు భాష వైభవం నింగినంటింది. జానపద జావళీలు, జనపదాల మేళవింపులు, పద్యధారణలు, చర్చాగోష్టులు, గేయాలు, కీర్తనలు, మన వాగ్గేయకారులు, తెలుగుజాతి ముద్దుబిడ్డలు, కవి పుంగవులు – ఇలా తెలుగు భాషలోని వివిధ ప్రక్రియలు ఈ సాహితీ సదస్సులో చోటు చేసుకొని ప్రపంచమంతా తెలుగు భాషతో మారుమ్రోగిపోయింది.

సరస్వతీ దేవి సంబరపడిపోయింది. అమ్మ భారతి ‘ఆహా’ అన్నది. శారదాంబ ఆశీర్వదించింది.

ఇటీవలనే దివంగుతులైన గానగంధర్వులు శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంకితమిచ్చిన ఈ సాహితీ సదస్సు
15 వేదికలుగా విభజించబడి దక్షిణాఫ్రికాలోని జోహేనేస్ బర్గ్ కేంద్రంగా ప్రారంభింపబడి మరుసటి రోజు సాయంత్రానికి ముగియడం జరిగింది. ప్రముఖ గాయని సునీత గారు ప్రార్ధనా గీతం పాడగా ప్రపంచంలోని అయిదు ఖండాలనుండి పాల్గొన్న ముఖ్య దేశాలలో జ్యోతి ప్రజ్వలన జరిగింది.

ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు శ్రీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారి శుభాభినందనల సందేశాన్ని అందించి ప్రారంభోపన్యాసం చేసారు.

మాజీ ఉపసభాపతి శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారు, ప్రముఖ కవి, దర్శకుడు, తత్వవేత్త శ్రీ తనికెళ్ళ భరణి, ప్రముఖ సాహితీవేత్త మరియు తెలంగాణా ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు శ్రీ కె,వి,రమణాచారి, ప్రముఖ సినీ దర్శకులు శ్రీ ఎస్.వి.కృష్ణారెడ్డి, ప్రముఖ సాహితీ వేత్త మరియు గేయ రచయిత శ్రీ భువనచంద్ర, తెలంగాణా ప్రభుత్వ ప్రత్యేక అధికారి శ్రీ దేశపతి శ్రీనివాస్, కేంద్ర సాహితీ అకాడమీ కార్యదర్శి శ్రీ కృత్తివెంటి శ్రీనివాసరావు, దూరదర్సన్ సంచాలకులు శ్రీ ఓలేటి పార్వతీశం గార్లు ప్రసంగించారు.

15 దేశాల రచయితలు పాల్గొన్న ఈ రెండు రోజుల పాటు నిర్విరామ సాహితీ సదస్సు లో ప్రముఖ సాహితీ వేత్త భువన చంద్ర తో ముఖా ముఖీ, ఎస్.పీ. బాలూ కి చెరుకూరి రమాదేవి (డిట్రాయిట్) గారి ఆత్మీయ నివాళి, పొత్తూరి విజయ లక్ష్మి, రామా చంద్రమౌళి, డా. శిఖామణి, ముక్తేవి భారతి, ఆచార్య కాత్యాయని విద్మహే, వడ్డేపల్లి కృష్ణ, ఆచార్య ఎస్. వీ సత్యనారాయణ, రేవూరు అనంత పద్మనాభ రావు, అత్తలూరి విజయలక్ష్మి, పాపినేని శివశంకర్, ‘హాస్య బ్రహ్మ’ శంకర నారాయణ, రేణుక అయోల, రాజేశ్వరి శివుని, గంగిశెట్టి లక్ష్మీనారాయణ మొదలైన భారత దేశ రచయితలు పాల్గొని ఆసక్తికరమైన ప్రసంగాలు చేసారు.

ఈ సాహితీ సదస్సులో భాగంగా జీవిత సాఫల్య పురస్కారం శ్రీ తల్లావజ్జుల పతంజలి శాస్త్రి గారికి బహూకరించడమైనది. ప్రముఖ సంగీత దర్శకులు స్వర వీణాపాణి గారు ఈ సదస్సుకు అంకితమిస్తూ ప్రత్యేక గీతాన్ని వ్రాసి ఆలపించారు.

గత నాలుగు నెలలుగా అకుంఠిత దీక్షతో అహర్నిశలూ పనిచేస్తూ ప్రధాన కార్యనిర్వాహకవర్గ సభ్యులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు, శ్రీ శాయి రాచకొండ (శ్రీ వంగూరి ఫౌండేషన్ అఫ్ అమెరికా), శ్రీ రావు కొంచాడ (తెలుగుమల్లి, ఆస్ట్రేలియా), శ్రీ రత్న కుమార్ కవుటూరి, శ్రీమతి రాధిక మంగిపూడి (శ్రీ సాంస్కృతిక కలాసారథి, సింగపూర్), శ్రీ రాపోలు సీతారామరాజు (సౌత్ ఆఫ్రికా), శ్రీ జోన్నలగెడ్డ మూర్తి (UK), శ్రీ వంశీ రామరాజు (వంశీ ఇంటర్నేషనల్, హైదరాబాదు) ఈ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా రూపకల్పన చేసారు. సాంకేతికపరంగా సింగపూర్ నుండి శ్రీమతి కాత్యాయని రాధాకృష్ణ గణేశ దంపతులు, శ్రీ భాస్కర్ ఊళపల్లి, శ్రీ సుధాకర్ జోన్నాదుల గార్లు ఎంతో సహాయాన్నందించారు. వీరికి తోడుగా శ్రీ శ్రీకృష్ణ రావిపాటి (బ్రిస్బేన్), శ్రీ మధు చెరుకూరి, శ్రీ రఘు పెండ్యాల (అమెరికా) మరియు వివిధ దేశాల నుండి మరో 25 మంది ఎంతో కృషి చేసారు.

ఈ కార్యక్రమానికి సంబందించిన విడియోలు ఈ క్రింది లంకెలో చూడవచ్చు:
https://www.youtube.com/channel/UCT3B1RMkhHjAjfpTJxDJY9w

Send a Comment

Your email address will not be published.