అపాయాన్నుంచి కాపాడిన ఉపాయం

Shantell

సిడ్నీ: ఉత్తర ఆస్ట్రేలియాలోని ‘రివర్‌ నేషనల్‌ పార్క్’లో సరదాగా చేపలు పడదామని వెళ్లిన ఓ జంట ఉపాయంతో అపాయం నుంచి బయటపడింది. ఊహించని అనుభవం ఎదురైంది. అయితే, వారికి వచ్చిన ఒక్క ఐడియా వారిని ప్రమాదం నుంచి కాపాడింది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల షాంటెల్లీ జాన్సన్‌ అనే యువతి తన ప్రియుడు కోలెన్‌ నల్గిట్‌తో కలిసి సరదాగా చేపలు పట్టడానికి కారులో వెళ్లింది. ఆ సమయంలో వారితో ఓ కుక్క పిల్ల కూడా ఉంది. ‘రివర్‌ నేషనల్‌ పార్క్’లోని ఓ చోట వారి కారు ఒక్కసారిగా బురద నేలలో దిగిపోయింది. ఆ ప్రాంతంలో ఎవరూ ఉండరు. అంతకు ముందే వారు ఆ ప్రాంతంలో మూడు మొసళ్లు తిరిగినట్లు గుర్తించారు.

కారులో నుంచి బయటకు వచ్చినా ప్రమాదమే అని ఆ జంట భావించింది. కారు ముందుకు కదలట్లేదు.. అక్కడ సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ కూడా అందవు. ఎవరైనా అటువైపు వచ్చి తమను కాపాడతారనే ఆశతో గంటలకొద్దీ ఎదురు చూశారు. కానీ, ఫలితం లేదు. దీంతో మరింత భయపడిపోయారు. చీకటి పడుతోంది… crocodileఅయినా ఎవ్వరూ వారిని రక్షించడానికి రాలేదు. దీంతో రాత్రంతా కారులోనే గడిపారు. వారు అక్కడకు వచ్చే ముందు కారులో చిరుతిళ్లు, నీళ్ల సీసాలు తెచ్చుకున్నారు. వాటిని తింటూ, తాగుతూ గడిపారు. తెల్లవారగానే మెల్లిగా కారు దిగి, కాస్త ముందుకు వచ్చి బురదలేని చోట కొన్ని గంటలు గడిపారు. చుట్టూ బురద, నీరు ఉండడంతో అక్కడి నుంచి మరో చోటుకి కదలలేకపోయారు. తాము ఆ ప్రదేశం నుంచి ఇప్పట్లో బయటపడగలమా? అని భయపడిపోయారు. అయితే, వారు బయటకు వెళ్తున్న సమయంలో ఏ ప్రాంతానికి వెళ్తున్నామన్న విషయాన్ని తమ కుటుంబ సభ్యులకు చెప్పి వచ్చారు. వారు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే, అతి పెద్దదైన ‘రివర్‌ నేషనల్‌ పార్క్’లో వారు ఏ చోట ఉన్నారన్న విషయాన్ని గుర్తించడం అంత సులువైన పని కాదు. వారి జాడను కనిపెట్టేలోపు మొసళ్లు తిరిగే ఆ ప్రాంతంలో ఆ జంటకు ప్రమాదం సంభవించే అవకాశం కూడా ఉంది. అయితే, ఆ జంటకు వచ్చిన ఓ ఐడియా వారిని ప్రమాదం నుంచి కాపాడింది. తాము ఉన్న చోట పెద్ద అక్షరాలతో ఆంగ్లంలో ‘హెల్ప్‌’ అని రాశారు. ఆ పక్కనే తమ వెంట ఉన్న వస్తువులతో మంట వెలిగించారు. వారిని వెతుకుతూ వెళ్లిన హెలికాప్టర్‌లోని సిబ్బంది పై నుంచి ఆ అక్షరాలను గుర్తించారు. దాని పక్కనే మంట ఉండడాన్ని గమనించారు. దీంతో వారి జాడను సిబ్బంది త్వరగా గుర్తించగలిగారు. వారు ఈ పని చేయకపోతే పరిస్థితులు మరోలా ఉండేవని పోలీసులు చెప్పారు. తాము మొసళ్ల భయంతో వణికిపోయామని ఆ జంట చెప్పారు. ఈ సందర్భంగా హెలికాప్టర్‌ నుంచి తీసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Send a Comment

Your email address will not be published.