అపూర్వ నటనకు 60 ఏళ్లు

అపూర్వ నటనకు 60 ఏళ్లు

1960లో ఎ.వి.ఎం. అధినేత మెయ్యప్ప చెట్టియార్‌ తమిళంలో ‘కళత్తూర్‌ కన్నమ్మ’ సినిమా నిర్మించారు. భీమ్‌ సింగ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సావిత్రి, జెమిని గణేశన్‌ నాయికా నాయకులు. అందులో ఒక బాలుడి పాత్ర కోసం అన్వేషిస్తున్న మెయ్యప్పకు మద్రాసు జనరల్‌ ఆసుపత్రిలో ఒక పిల్లాడు తటస్థపడ్డాడు. అయితే అది మెయ్యప్పకు కాదు… వాళ్లావిడకు. ఐదేళ్ల వయసులో పరమక్కుడికి చెందిన ఆ బాలుడికి సైనస్‌ సమస్య తలెత్తగా మద్రాసు జనరల్‌ ఆసుపత్రికిలో చేర్చి వైద్యం ఇప్పిస్తున్నప్పుడు ఆ అబ్బాయి కలివిడిగా ఆసుపత్రి మొత్తం చుట్టి వస్తూ, అందరినీ పలకరిస్తూ, ముద్దుముద్దు మాటలు వల్లిస్తూ ఉండేవాడు. ఈ పిల్లాడికి వైద్యం అందించే డాక్టర్‌ వద్దకు మెయ్యప్ప చెట్టి భార్య కూడా వైద్య సలహా నిమిత్తం వస్తుండేది. ఈ బాలుడు ఆమెకు కూడా తారసపడి కబుర్లు చెప్పడంతో, ఆమె తన భర్తకు ఈ అబ్బాయిని గురించి చెప్పింది. ఆ కుర్రాణ్ణి స్టూడియోకి తీసుకెళ్లి స్కీన్ర్‌ టెస్టులు చేసి సంతృప్తి వ్యక్తం చేశారు స్టూడియో సిబ్బంది. ఇంకేముంది ఆ బాలుడు ‘కళత్తూర్‌ కన్నమ్మ’ సినిమాలో నటించాడు. ఆ బుడతడే మాస్టర్‌ కమల్‌ హాసన్‌. ఆగస్టు 12, 1960న తమిళంలో విడుదలైంది.

ఈ సినిమాను తెలుగులో ‘మావూరి అమ్మాయి’ పేరుతో ఎం.ఆర్‌.ఎం సంస్థ పేరిట మెయ్యప్ప కుమారులు కుమరన్, శరవణన్‌ అనువదించి 1960 అక్టోబరులో ఆంధ్రదేశంలో విడుదల చేశారు. తొలి ప్రయత్నంలోనే ఉత్తమ బాలనటుడుగా రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నాడు కమల్‌హాసన్‌. ఇదే సినిమాను ఎ.వి.ఎం వారే 1962లో హిందీలో ‘మై చుప్‌ రహూంగీ’ పేరుతో పునర్నిర్మించగా అందులో మీనాకుమారి, సునీల్‌ దత్‌ జంటగా నటించారు. కమల్‌ పాత్రను హిందీలో బబ్లూ పోషించాడు. తరువాత 1969లో ఇదే సినిమాను తెలుగులో ‘మూగనోము’ (1969) పేరుతో అక్కినేని-జమున జంటగా నిర్మించారు. కమల్‌ హసన్‌ పోషించిన బాలుని పాత్రను మాస్టర్‌ బ్రహ్మాజీ ధరించాడు. కమల్‌ హాసన్‌ అసలు పేరు పార్థసారథి శ్రీనివాసన్‌. నవంబర్‌ 7, 1954న తమిళనాడులోని రామనాథపురానికి చేరువలో వున్న పరమక్కుడి పట్టణంలో జన్మించాడు. తండ్రి డి.శ్రీనివాసన్‌ న్యాయవాద వృత్తిలో వుండేవారు. కమల్‌ తల్లి రాజలక్ష్మి మంచి డ్యాన్సర్‌. కమల్‌ ప్రాధమిక విద్యాభ్యాసం పరమక్కుడిలోనే జరిగింది. తరువాత వారి కుటుంబం మద్రాసులో స్థిరపడింది. ఇక కమల్ హాసన్ మిగిలిన నట జీవితం నేటి వరకూ అందరికీ తెలిసినదే.

Send a Comment

Your email address will not be published.