అవధాన సాహితీ విన్యాసం

అవధాన సాహితీ విన్యాసం

ప్రపంచంలో సుమారు 6,500 మాట్లాడే భాషలున్నాయి. 2011 గణాంకాల ప్రకారం భారతదేశంలో 121 మాతృ భాషలున్నట్లు అంచనా. వాటిలో భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో పొందుపరచిన 22 భాషలకు అధికార భాష హోదా ఉంది. ఇందులో మన తెలుగు భాష కూడా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు భాషను మాట్లాడేవారు, అర్ధం చేసుకునేవారు, కొన్ని వందల సంవత్సరాల క్రితం తెలుగు మాతృ భాషగా గలిగిన కుటుంబాల వారసత్వం ఉన్నవారు ప్రస్తుతం 18 కోట్లమంది ఉన్నట్లు అనధికార అంచనా.

తెలుగు భాషకే ప్రత్యేకమైన ప్రక్రియ, మరేభాష లోనూ లేనటువంటి ఒక ఉత్కృష్టమైన భాషా సంపద ‘అవధానం’. ఒకప్పుడు ఏదో పట్టణంలోనో, నగరంలోనో, పల్లెలోనో అవధానం జరుగుతోంది అంటే చూడడానికి, వినడానికి పండితులూ, పామరులూ, పిన్నలు, పెద్దలు అందరూ పరుగులు తీసేవారు. అవధానంలో కొన్ని ప్రక్రియలు అందరికీ అర్ధం కాకపోవచ్చు కానీ పద్యంలో ఉన్న పదజాలం, ధారణ, సౌరభం పశువుల కాపరినైనా అలా కట్టిపడేస్తుంది. అవధాని, పృచ్చకులు వల్లించే పద్యాలు, పూరించే సమస్యలు, పురాణంశాలు, పిట్ట కథలు, ప్రేక్షకుల నుర్రూతలూగించే అప్రస్తుత ప్రసంగాలు – ఇలా ఎన్నో ప్రక్రియలతో కూడుకున్న ఒక అనన్య సామాన్యమైన సాహితీ సమాహారం అవధానం.

మెల్బోర్న్ నగరంలో విజయ దశమి సందర్భంగా ఈ నెల 26వ తేదీన ఈ కార్యక్రమం తెలుగుమల్లి అధ్వర్యంలో జరిగింది. అయితే మెల్బోర్న్ లో ఇది మొదటిది కాదు. కానీ ఈ అవధానానికి ఎంతో ప్రత్యేకత మరియు ప్రాముఖ్యత ఉంది. ఈ నగరంలోనే నివసిస్తూ చిన్నప్పటి నుండీ ఆంగ్ల భాషా మాధ్యమంలో చదువుకొని అటు IT రంగంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ, ఇద్దరు చంటి పిల్లలతో ఇటు కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూ తన మొదటి అవధానం చేయడం. అలాగే ఆస్ట్రేలియా నివాసులు చేసిన మొట్టమొదటి అవధానం కూడానూ.

ఈ అవధాన ప్రక్రియ ఆస్ట్రేలియా దేశానికి మరియు కళలకు పుట్టినిల్లయిన మెల్బోర్న్ నగరానికి వన్నె తెచ్చింది. మరో ప్రత్యేకతేమిటంటే ఈ కార్యక్రమానికి త్రిభాషా మహాసహస్రావధానం చేసిన బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు సంచాలకులుగా వ్యవహరించారు.

ఇంతకీ అవధాని గారు ఎవరన్నది చెప్పనేలేదు కదా! శ్రీ కళ్యాణ్ చక్రవర్తి తటవర్తి. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు వారి స్వగ్రామం. తల్లిదండ్రులు: శ్రీమతి శ్రీవాణీవిజయలక్ష్మి, శ్రీవేంకటేశ్వరరావుశ్రీ గార్లు. అమెరికాలో సుమారు నాలుగేళ్ళు నివసించి గతేడాది ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరానికి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. LKG నుండి ఇంజనీరింగు వరకూ ఆంగ్లంలోనే చదివి డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం వేచి ఉన్న సమయంలో శారదాంబ కరుణా కటాక్షాలతో తెలుగు భాషపై దృష్టి మళ్ళి వ్యాకరణం మరియు ఛందస్సు నేర్చుకొన్నారు శ్రీ కళ్యాణ్ గారు. ప్రస్తుతం IT రంగంలో పని చేస్తున్నారు.

మొదటిసారి నిర్వహించినా ఎవరూ ఊహించనంత రీతిలో పద్యాలు చెప్పి ధారణ చేయడం మహదానందాన్ని కలిగించింది. అద్భుతమైన రీతిలో నిషిద్ధాక్షరి, సమస్యా పూరణం, న్యస్తాక్షరి మరియు ఇతర అంశాలు నిర్వహించారు. ఈ దిగువనిచ్చిన లంకెలో పూర్తి విడియోని చూడవచ్చు.

https://www.youtube.com/watch?v=aCRrB6syqoM

శ్రీ కళ్యాణ్ గారు వ్రాసిన కొన్ని శతకాలు మరియు రచనలు:

ముద్రితశతకములు
1. మాధవీయం శతకం (2012)
2. సరదా శతకం (2017)
3. న్యూజిలాండ్ తెలుగు శతకం (2019)
4. పలివెల లింగా శతకం (2020)
5. ఆడపిల్ల శతకం (2020)

అముద్రితములు
1. సోమేశ్వరా శతకం
2. శృంగగిరి శారదాంబికా శతకం
3. శ్రీరామభక్తాగ్రణి శతకం
4. రామదండు శతకం..
ఇత్యాదివి మరొక పది శతకములు అముద్రితములు
— పది పైచిలుకు పద్యనాటకాలు ( అమెరికా, న్యుజిలాండులలో ),సాహితీప్రసంగాలు

మెల్బోర్న్ వచ్చిన తదుపరి ఇక్కడి భాషాభిమానులు కొందరు ఛందోబద్ధమైన పద్యాలు వ్రాయడం నేర్చుకోవాలన్న కోర్కెను తెలిపిన వెంటనే ప్రతీ శనివారం రెండు గంటల పాటు తరగతులను ఏర్పాటు చేసి ప్రస్తుతం ఆటవెలది మరియు తేటగీతి పద్యాలను వ్రాయడం నేర్పించారు. వారితో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత సైనుకులకు స్పూర్తిగా నిలవాలన్న తలంపుతో ఆటవెలదిలో ‘వీరసైనిక’ శతకం వ్రాయడానికి ప్రోత్సహించి కృతకృత్యులయ్యారు. ఆస్ట్రేలియా నివాసులు వ్రాసిన మొట్టమొదటి శతకం. తాను ఎదుగుతూ తనతోపాటు పదిమందినీ పద్య పఠనంలో భాగస్వామ్యులుగా చేయాలన్న గొప్ప తలంపుతో వారు ముందుకు సాగడం ఎంతో ముదావహం.

మొన్న జరిగిన కార్యక్రమంలో ప్రుచ్చకులుగా బ్రిస్బేన్ నగరం నుండి శ్రీ చింతలపాటి మురళీకృష్ణ గారు (ఆశువు) మరియు శ్రీకృష్ణ రావిపాటి గారు (అప్రస్తుత ప్రసంగం) పాల్గొన్నారు. మెల్బోర్న్ నగరం నుండి శ్రీ కోటేశ్వర రావు సనగపల్లి (దత్తపది), శ్రీ ప్రసాద్ పిల్లుట్ల (పురాణంశము), శ్రీ డా. చారి ముడుంబి (వర్ణానాంశం), శ్రీ డా.వేణుగోపాల్ రాజుపాలెం (సమస్యా పూరణం), శ్రీ రావు కొంచాడ (న్యస్తాక్షరి) పాల్గొన్నారు. నిషిద్ధాక్షరి డా. సత్యనారాయణ గారు భారతదేశం నుండి నిర్వహించారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ప్రుచ్చకుల్లో ఆరుగురు IT రంగంలో ఆరితేరి తెలుగు భాషా సేవలో తరిస్తున్నవారే.

వాగ్దేవి అశీస్సులతో శ్రీ కళ్యాణ్ గారు మరిన్ని అవధానాలు చేసి శతావధానాలు, సహస్రావధానాలు నిర్వహించి పురోగమించాలని తెలుగుమల్లి కోరుకొంటుంది.

Send a Comment

Your email address will not be published.