ప్రియమైన….
నీ అందాల అలల తాకిడికి కొట్టుకుపోతున్నప్రేమ పిపాసినయి నేను నీకు రాస్తున్న మాటలివి…
కాస్తంత ఓపికగా చదువు…..టైము లేదనకు….చదువుతున్న కొద్దీ నీలో నీకు తెలియని ప్రేమ …ఏదో తెలియని ఆనందం నీలో పుట్టుకొస్తాయి.
నేను క్షేమమే….నువ్వు కూడా బాగానే ఉన్నావుగా…ఒక్కసారి ఆగు…నేనేం చెప్తున్నానో అర్ధం చేసుకో….మన మధ్య ఉన్నదేమిటో నీకు బోధపడుతుంది….
నా పెదవులకు ఉత్సాహం ప్రోత్సాహం కావలసినప్పుడల్లా నేను ఏం చేస్తానో తెలుసా…నీ పేరు చెప్పుకుంటాను…
పెదవి దాటకుండా నీ పేరు చెప్తాను మనసులో…
నీ పేరు పెదవుల నుంచి దూరమైపొవడాన్ని ఏమాత్రం భరించలేని మనసు నాది.
నా మనసుకి ఓదార్పు కావలసినప్పుడల్లా మెల్లగా నిన్నుస్మరించుకుంటాను…
నీ రూపాన్ని నా ముందుకు తెచ్చుకుంటాను…
ఇక్కడ మెల్లగా అని ఎందుకు చెప్తున్నానో తెలుసా….
నీలాగా నీ జ్ఞాపకాలు కానివ్వు నీ మాటలు కానివ్వు అన్నీనూ ఎంతో మృదువైనవి…
మా పెరట్లో ఉన్న పూల మొక్కల సంతోషాలను వాటికి పూచే పువ్వులను బట్టి తెలుసుకునేటట్లు నా సంతోషాలను నీ నవ్వులను తలచి తెలుసుకుంటాను.
నీ నవ్వుకున్న శక్తి అలాంటిది. నీ నవ్వులాగే పువ్వులు కూడా అందమైనవి….నీలాగే అవి చాలా నెమ్మదైనవి. వాటికి ఎవరినీ నొప్పించడం తెలీదు.
నా హృదయంలో ఉన్న నీ ప్రేమతో నేను దొంగా పోలీసు ఆట ఆడుకునే సమయాల్లో ఎవరు దొంగో ఎవరు పోలీసో తెలీదు. ఎందుకైనా మంచిదని నన్ను నేను నీకు అప్పగించేస్తాను.
నా హృదయ ఫలకంపై నేను రాసుకున్న మాటలేమిటో తెలుసా…
“నాడిని పట్టుకోకుండా వైద్యం చెయ్యడం, పిచ్చి పట్టకుండా ప్రేమించడం అసాధ్యం” అని…
ఏమంటావు…
అయినా ఒక్కసారి ఉత్తరాన్ని పూర్తి చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడు
నీ వెనుకే నేనున్నాను…ఉంటాను….అదంతే…
నీ
యామిజాల జగదీశ్