అస్తమించిన ఎర్ర సూరీడు

సినీ వినీలాకాశంలో అస్తమించిన ఎర్ర సూరీడు

madalarangaraoసమాజంలోని అంతరాలను ప్రశ్నిస్తున్న రోజులవి. సినీ ఇండస్ట్రీలో ప్రేమ కథలు, కుటుంబ కథలు రాజ్యమేలుతున్న కాలంలో విప్లవభావాలతో ‘ఎర్ర’ సినిమాలను తెరకెక్కించేందుకు ఓ వీరుడు వచ్చాడు. ఎరుపు రంగునే తన ఆయుధంగా మలుచుకుని.. వామపక్ష భావజాలంతో సమాజ అభ్యుదయమే ధ్యేయంగా సినిమాలు నిర్మిస్తూ… నటిస్తూ.. రెడ్‌ స్టార్‌గా ఎదిగారు. ఆయనే మాదాల రంగారావు. నేడు ఈ ఎర్ర సూర్యుడు అస్తమించాడు.

ప్రకాశం జిల్లా మైనం పాడులో 1948 మే 25న జన్మించిన ఈయన తన భావాలకు అనుగుణంగా సినిమాలను నిర్మించారు. ‘చైర్మన్ చలమయ్య’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు మాదాల రంగారావు. ఆ తరువాత నవతరం ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి, తొలిసారిగా ‘యువతరం కదిలింది’ చిత్రాన్ని తీసి మొదటిసారిగా బంగారునంది పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సంస్థలో.. ఎర్ర మల్లెలు, మహాప్రస్థానం, ప్రజాశక్తి, విప్లవ శంఖం, స్వరా​జ్యం, తొలిపొద్దు, ప్రజాశక్తి, ఎర్రసూర్యుడు లాంటి విప్లవ సినిమాలనే నిర్మించారు. తన సినీ జీవితాన్ని తాను నమ్మిన సిద్ధాంతానికే అంకితం చేశారు. వామపక్ష భావాజాలానికి అనుగుణంగానే సినిమాలను తెరకెక్కించారు. అప్పట్లో ఈ సినిమాలను ప్రేక్షకులు విపరీతంగా ఆదరించేవారు.

ప్రస్తుత తరానికి ఆర్‌. నారాయణమూర్తి గురించి మాత్రమే తెలుసు. కానీ 80,90ల్లోనే విప్లవ సినిమాలకు నాంది పలికిన యోధుడు రంగారావు. కమ్యూనిస్టు పార్టీతో సాన్నిహిత్యంగా మెలిగేవారు. ప్రజానాట్య మండలిలో క్రియాశీల సభ్యుడిగానూ వ్యవహరించారు. నేడు ఈ ఎర్ర నక్షత్రం కానరాకుండా పోయింది. రంగారావు మృతిపట్ల సినీ రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు.

మెగాస్టార్‌ చిరంజీవి మాదాల రంగారావు భౌతికకాయానికి నివాళులర్పిస్తూ ‘రంగారావు గారు కమిట్మెంట్‌ ఉన్న వ్యక్తి, కమర్షియల్ సినిమా అవకాశాలు వచ్చినా.. తను నమ్మిన సిద్ధాంతాల కోసం విప్లవాత్మక చిత్రాలు మాత్రమే చేస్తూ ప్రజలను చైతన్య పరిచిన వ్యక్తి ఆయన. ఆర్‌. నారాయణమూర్తి లాంటి వారికి ఆయనే స్ఫూర్తి. నేను ఒంగోలులో ఉన్నప్పుడు మాదాల రంగారావు, టి.కృష్ణ, పోకూరి బాబురావులతో మంచి సాన్నిహిత్యం ఉంది. అప్పట్లో నన్ను ఎంకరేజ్‌ చేసిన వాళ్లలో మాదాల రంగారావు ఒకరు’అంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు చిరంజీవి.

Send a Comment

Your email address will not be published.