ఆనాటి .... ఆ అభినయ తరం ఎల్లి పోతోంది

ఆనాటి .... ఆ  అభినయ తరం ఎల్లి పోతోంది

ఆనాటి ఆ స్నేహమానంద గీతం …. అన్న అక్కినేని పాట లాగానే ఆ తరం వరసగా ఒక్కొక్కరు గా భువి నుంచి దివి కెల్లి పోతున్నారు. పోయినోల్లంతా మంచోళ్ళు ఉన్నవాళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు అంటూ మనకు వారి వారసులని ఇచ్చి వెళ్ళిపోతున్నారు.
తెలుగు సినీ కళామ తల్లి కి అన్న ఎన్ టి ఆర్ , అక్కినేని నాగేశ్వర రావు లు ఇద్దరూ రెండు కళ్ళు అయితే ఒక కన్ను మనల్ని వదిలి పెట్టి పద్దెనిమిది సంవత్సరాలు అయితే, ఇప్పుడు మరో కన్ను కూడా మనల్ని వదిలి వెళ్లి పోయింది.
తెలుగు సినీ చరిత్ర ప్రారంభం లో చిత్తూరు నాగయ్య వంటి వారు తొలి తరం అయితే, ఆ తర్వాత సినిమాల్లోకి ప్రవేశించిన రెండో తరం కథా నాయకుడు అక్కినేని.
సాధారణ పల్లెటూరి బైతు, నాలుగో తరగతి వరకే చదివిన ఈ నాటకాల కుర్రాడు సినిమా ఇండస్ట్రీలోనే చరిత్ర సృష్టిస్తా దాని సినీ కళామ తల్లి సిగలో మకుటాయమానం గా మారతాడని ఆనాడు అక్కినేనిని పరిచయం చేసిన ఘంటసాల బలరామయ్య, గూడవల్లి రామబ్రహ్మం, సి. పుల్లయ్య వంటి వారు ఎవ్వరూ ఊహించ లేదు. కేవలం నాటకాల్లో వేసిన చంద్రమతి వంటి స్త్రీ పాత్రల పోషణ తో ఆదరణ పొందిన నాటకాల అబ్బాయి గా సినిమా ప్రపంచం లోకి ప్రవేశించాడు అక్కినేని. అంతవరకూ ఆయన వేసింది ఆడ పాత్రలు. పదిహేడు ఏళ్ల వరకూ ఆడ పాత్రల వయ్యారాలకి, అభినయానికి, వాచకానికీ అలవాటు పడి అందరితో జేజే లు కొట్టించుకున్న మనిషి ఒక్కసారిగా అవన్నీ వదిలి సినిమా రంగం లో తనకు అస్సలు అలవాటు లేని మగ పాత్రలు వేయడానికి ప్రవేశించాడు.
ధర్మపత్ని సినిమాలో గుంపులో గోవింద లాగా కనిపించినా, తరువాత చిత్రం సీతారామ జననం లో మాత్రం శ్రీ రాముడు అక్కినేనే. ఎండ కన్నెరగని అంతఃపుర రాణి లాలిత్యం పండించిన నాగేశ్వర రావు ఇప్పుడు అసమాన వీరుడు దీరోదాత్తుడిగా మహా సామ్రాజ్య చక్రవర్తి గా నటించాలి. మరి గాడ్ ఫాదర్లు లేని కాలం, అందలం ఎక్కాలంటే కేవలం ప్రతిభ మాత్రమే ఆధారం. ఆ సమయం లో ఆడతనం నుంచి శరీరాన్ని, గొంతునీ, హావభావాల్నీ మార్చుకోటానికీ ఆయన భగీరధ ప్రయత్నమే చేసారని చెప్పుకోవాలి. ఆరోజు నాగేశ్వరరావు చూపిన పట్టుదల ఏనాటి యువతకైనా ఆదర్శమే.
బాలరాజు, కీలు గుర్రం సినిమాలతో జానపద కథానాయకుడు గా తెలుగు ప్రజల ఆదరాభిమానాలు పొందిన ఆయన లైలా మజ్ను తో సంఘీక చిత్రాలు కూడా చేయగలనని నిరూపించు కున్నాడు. ఆ తర్వాత అక్కినేని నటించిన సినిమాలు, అవి సాధించిన విజయాల గురించి చెప్పడమంటే అది పెద్ద సాహసమై అవుతుంది.
ఆయన నటించిన సినిమాల్లో తోటి నటీనటుల పట్ల ప్రవర్తించిన తీరు, క్రమశిక్షణ తో నిర్మాతలు, దర్శకుల వద్ద ఉన్న విధానం చూస్తే ప్రపంచం లోని ఏ వ్యక్తి అయినా తన జీవితం లో పైకి రావడానికి ఉపకరించే విషయాలు. నలభై ఏళ్ల లోనే గుండె జబ్బుకి గురయి కూడా మరో నలభై ఐదు సంవత్సరాలకి పైగా ఆరోగ్యం గా జీవించారంటే ఆయన ఆరోగ్యం విషయం లో ఎంత జాగ్రత్తగా ఉన్నారో ఈనాటి యువత నేర్చు కోవాలి. కష్టపడి పైకి వచ్చి విజయం సాధించిన ఎంతో మంది వ్యక్తుల్ని అనేక రంగాల్లో మనం చూస్తున్నాం. అయితే, ఆ సక్సెస్ శిఖరాగ్రాన్ని అతి చిన్న వయసులోనే అధిరోహించి అక్కడ నుంచి జీవితాంతం కింద పడకుండా ఆ కొండ పైనే నిలబడాలంటే ఎంత కష్ట పడాలి, ఎంత వినయం గా ఉండాలో ఒక్క అక్కినేని జీవితం నుంచి మాత్రమే తెలుసుకోవాలి.

Send a Comment

Your email address will not be published.