ఆవంత్స సోమసుందర్ అస్తమయం

ఆవంత్స సోమసుందర్ అస్తమయం

రచనే జీవితంగా గడిపిన సుప్రసిద్ధ కవి ఆవంత్స సోమసుందర్ కన్నుమూశారు. ఆయన చాలాకాలంగా వయోభారంతో వచ్చిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొంతకాలంగా అయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. 2016 ఆగస్టు 12 వ తేదీన తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ పరిధిలోని సర్పవరంలో తమ కుమారుడి ఇంట ఆవంత్స తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 92 ఏళ్ళు. ఆయన మరణానంతరం తన కళ్ళను ఓ ఐ బ్యాంకుకి దానం చేయగా భౌతిక కాయాన్ని కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాలకు దానం చేయవలసిందిగా చెప్పారు. ఆయన మరణవార్త సాహితీలోకాన్ని విషాదంలో ముంచెత్తింది.

1924 నవంబర్ 18 వ తేదీన సూర్యప్రకాశరావు, వెంకాయమ్మ దంపతులకు జన్మించిన ఆవంత్స సొంత ఊరు శంఖవరం. ఆయనను ఆవంత్స చిట్టి వెంకాయమ్మ, వెంకట్రావు దంపతుల ఆలనాపాలనలో పెరిగారు. కమ్యూనిస్టు సిద్ధాంతాల ప్రభావంతో పద్దెనిమిదో ఏట రాజకీయాలలోకి ప్రవేశించిన ఆవంత్స రాసిన కవితలు మొట్టమొదటగా వజ్రాయుధం శీర్షికతో ఒక పుస్తకంగా వెలువడింది. అప్పుడు ఆయన వయస్సు 25 ఏళ్ళు. ఈ కవితాసంపుటిలోని కొన్నింటిని అలనాటి మద్రాసు ప్రభుత్వం విద్రోహాన్ని రెచ్చగొట్టేవిగా ప్రస్తావించి ఆ పుస్తకాన్ని నిషేధించింది కూడా.

వెంకాయమ్మ ప్రోత్సాహంతో సాహిత్యంలోకి అడుగులు వేసిన ఆవంత్స చిన్నతనంలోనే పద్యాల పట్ల మక్కువ చూపారు. కావ్యాలు చదివారు.

కానీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి భావకవిత్వం పట్ల ఆకర్షితులైన ఆవంత్స కూడా ఆ కవితా బాటలో నడిచారు.

విలక్షణ రచయితగా పేరుప్రఖ్యాతులు గడించిన ఆవంత్స క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్టయ్యారు. అప్పుడు ఆయన వయస్సు పద్దెనిమిదేళ్లు.

నూట పాతికకు పైగా పుస్తకాలు రాసిన ఆవంత్స ఆయన పొందిన సత్కారాలు అనేకం. ఆయన తన పేరిట ఒక సాహిత్య ట్రస్టుని ఏర్పాటు చేసి దాని తరఫున గత పదహారేళ్లుగా సాహితీవేత్తలను గౌరవిస్తున్నారు.
—————-
యామిజాల
————–

Send a Comment

Your email address will not be published.