ఇలాగే ఓ నిర్ణయానికి వచ్చారు

ఇలాగే ఓ  నిర్ణయానికి వచ్చారు

ఓ మిత్రుడు చెప్పిన అనుభవం ఇది. అతనికి ఇద్దరు సన్నిహితులు. ఒకరు మగ. మరొకరు ఆడ. అతను ఆ అమ్మాయితో బాగా సన్నిహితుడై కాల క్రమంలో ప్రేమలో పడతాడు. ఇద్దరి మధ్య ప్రేమ బాగానే పేజీలకు పేజీలు సాగింది. ఒకరినొకరు చూసుకోకుండా ఉండలేకపోయే వారు. ఒక్క రోజు మాట్లాడుకోక పోయినా పిచ్చెక్కినట్టు అయ్యేది. ఆ ఇద్దరూ చూడటానికి బాగానే ఉండేవారు. ముచ్చటైన జంటగా అనిపించేది చూసిన వారికి. అంతా బాగానే ఉంది కానీ ఇద్దరూ పెళ్లి మాట వచ్చేసరికి వెనక్కి తగ్గే వారు. కారణం తెలిసేది కాదు.

ఒకరోజు ఆ ఇద్దరూ పెళ్లి గురించి ఆలోచిస్తూ వెళ్తున్నారు. ఇద్దరి మధ్య మౌనం నెలకొంది. అలాగే నడుస్తున్నారు నెమ్మదిగా. ఆ సమయంలోనే ఓ లారీ వేగంగా వస్తోంది. అప్పుడు ఎదురు ప్లాట్ ఫాం కి వెళ్ళడానికి రోడ్డు దాటాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. తటపటాయిస్తున్నారు. అప్పుడు లారీ డ్రైవర్ వారిని చూసి సడన్ బ్రేక్ వేసి “ఓ నిర్ణయాన్ని తీసుకోవడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు. రోడ్డు దాటడానికే ఇంతగా ఆలోచిస్తే మీరేం చెయ్యగలరు” అని కటువుగా అంటాడు.

అయితే ఆ డ్రైవర్ చెప్పిన మాటలు వారిద్దరికీ ఓ దారి చూపింది. ఇద్దరూ అప్పటికప్పుడు ఓ నిర్ణయానికి వచ్చారు. ఒకరి వంక ఒకరు చూసుకుని ఓ నవ్వు నవ్వారు. ఇంకేమిటి ఆలస్యం….ఇద్దరూ త్వరలోనే ఓ నిర్ణయానికి వచ్చి ఓ ఇంటివారయ్యారు పెళ్లి చేసుకుని.

నిజానికి లారీ డ్రైవర్ ఆ ఇద్దరినీ హెచ్చరించింది రోడ్డు దాటే విషయంలో. కానీ వాడి మాటలతో వారిలో తళుక్కుమని ఓ వెలుగు వెలిగించి పెళ్లి చేసుకునేలా చేయడం ఆశ్చర్యం.

ఏదైతేనేం కథ సుఖాంతమైంది.

—యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.