ఉన్నతమైన వ్యక్తిత్వానికి విశ్వమంత విగ్రహం

S Patel
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహం..భారత్ లోని పటేల్ విగ్రహమే

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహం ఈరోజు నుంచీ పర్యాటకులకు కనువిందు చేయనుంది. ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ స్మారకార్థం గుజరాత్‌లోని నర్మదా నది ఒడ్డున ఏర్పాటుచేసిన ఈ ‘ఐక్యతా విగ్రహం– స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ’ ఆవిష్కరణకు జరిగింది. పటేల్‌ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేసారు. నర్మదా జిల్లాలోని సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ సమీపంలో ఉన్న సాధు బెట్‌లో ఈ విగ్రహాన్ని కట్టారు. ఐక్యతకు చిహ్నంగా ఏర్పాటుచేసిన ఈ విగ్రహం 182 మీటర్ల (600అడుగుల) ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయినదిగా గుర్తింపు పొందింది. ప్రఖ్యాత ‘స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ’ కంటే ఇది రెట్టింపు పొడవు. వీక్షకుల కోసం విగ్రహం లోపల 132 మీటర్ల ఎత్తులో గ్యాలరీని ఏర్పాటుచేశారు. ఇక్కడ నుంచి సర్దార్‌ డ్యామ్‌ సహా పలు పర్వత ప్రాంతాలను సందర్శించే సౌకర్యం కల్పించారు. స్థానిక నర్మదా జిల్లాలోని గిరిజనులు సర్దార్‌ విగ్రహ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రాజెక్టు పేరుతో సహజ వనరులను నాశనం చేస్తున్నారని వారు ఆరోపించారు.

Sardar Patelగుజరాత్‌లోని నర్మదా నదీ తీరంలోని సాధు బెట్ అనే చిన్న దీవిలో దీన్ని నిర్మించారు. ‘సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ ఇంటిగ్రేషన్ ట్రస్ట్’ ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రాజెక్టును చేపట్టింది. ఇంత ఎత్తయిన విగ్రహాన్ని నిర్మించడం వెనుక ఎన్నో ఇంజినీరింగ్ అద్భుతాలు, మెళకువలు దాగున్నాయి.

మొత్తం విగ్రహం ఎత్తు 182 మీటర్లయినా, అందులో పీఠం ఎత్తే 25 మీటర్లు. అమెరికాలోని స్టాట్ట్యూ ఆఫ్ లిబర్టీతో పోలిస్తే ఈ విగ్రహం రెండింతలు ఎత్తైనది.

ఈ మొత్తం పని కాంట్రాక్ట్ విలువ రూ.2,332కోట్లు అయినా, నిర్మాణం పూర్తి చేయడానికి రూ.3వేల కోట్లు ఖర్చయ్యాయి. 42 నెలల సమయం పట్టింది.

2012-13లో ఈ ప్రాజెక్టు మొదలైంది. 2012 ఆగస్టులో ప్రాజెక్టు నిర్వహణ కోసం ‘టర్నర్ కన్సల్టెంట్‌’ను ఎంపిక చేశారు. దుబాయ్‌లోని ప్రఖ్యాత బూర్జ్ ఖలీఫా ప్రాజెక్టు నిర్వహణ కూడా ఈ సంస్థే చేపట్టింది. కాంట్రాక్టర్‌ను నియమించడం, ప్రాజెక్టు రోజువారీ పనులను, నాణ్యతను పరీక్షించడం, భద్రతా ప్రమాణాలను పాటించేలా చూడటం లాంటి అన్ని నిర్వహణ బాధ్యతలు ఆ కన్సల్టెన్సీపైనే ఉంటాయి. 2014లో ఎల్&టీ సంస్థకు ఇంజినీరింగ్, సేకరణ, నిర్మాణ(ఈపీసీ) బాధ్యతలు అప్పగించారు. ఈపీసీ కాంట్రాక్టులో ఒకే సంస్థ డిజైనింగ్‌తో పాటు మిగతా అన్ని బాధ్యతలూ చూసుకోవాలి. ఎల్&టీ విగ్రహ డిజైనింగ్‌ను తన సొంత సిబ్బందితో పాటు బెగేట్ అనే సంస్థ సాయంతో పూర్తి చేసింది. మొత్తం నిర్మాణ రూపకల్పనను అరూప్ ఇండియా అనే సంస్థ సాయంతో పూర్తి చేసింది. విగ్రహ డిజైన్‌ను పరీక్షించే బాధ్యతను ఏజీస్ ఇండియా, టాటా కన్సల్టెంట్స్ అండ్ ఇంజినీర్స్‌కు అప్పగించారు. దీన్ని ప్రూఫ్ కన్సల్టెన్సీ అని పిలుస్తారు. డిజైనింగ్ వెనుకున్న మౌలిక వ్యూహం, విగ్రహం దిమ్మె కోసం ఉపయోగించే దూలం పరిమాణం లాంటి అంశాలను ప్రూఫ్ కన్సల్టెంట్లు చూసి ఆమోదిస్తారు. అమెరికాకు చెందిన ‘మైఖేల్ గ్రేవ్స్’, ‘మిన్హార్డ్’ సంస్థలు ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక అంశాలను పరీక్షించాయి. వీటికి తోడు మరో 30 కన్సెల్టెన్సీ సంస్థలు ఈ ప్రాజెక్టు కోసం పనిచేశాయి.

ఈ విగ్రహ నిర్మాణ పనులు ప్రధానంగా రెండు భాగాలుగా సాగాయి. ఒకటి… పునాదులు వేయడం, రెండోది విగ్రహాన్ని ప్రతిష్ఠించడం. మొదట పునాదులు ఏర్పాటు చేసి, మెజానిన్ ఫ్లోర్‌ (రెండు అంతస్తుల మధ్య ఎత్తు తక్కువగా ఉండే మరో అంతస్తు)ను నిర్మించారు. ఆ తరువాత మధ్య భాగం నిర్మించి దాని అంచున నిలబడి చూసేందుకు గ్యాలరీని ఏర్పాటు చేశారు. ఆ గ్యాలరీలో 200 మంది నిలబడి చూసే వీలుంది. బలమైన గాలులను సైతం తట్టుకునేలా జాగ్రత్తలు తీసుకుంటూ దీన్ని నిర్మించారు.

Send a Comment

Your email address will not be published.