ఓ కవి ప్రేమలేఖ

ఓ కవి ప్రేమలేఖ

రాబర్ట్ ఫ్రాస్ట్ విశేష ఆదరణ పొందిన కవి. 1875 లో పుట్టిన ఫ్రాస్ట్ 1965 లో కన్నుమూశారు. ఫ్రాస్ట్ కు వ్యవసాయంలోను, ఉపాధ్యాయ వృత్తిలోను మంచి అనుభవమే ఉంది. మంచి ఉపన్యాసకుడిగా పేరుప్రఖ్యాతులు సంపాదించారు. న్యూ ఇంగ్లాండ్ గురించి ఆయన తన అనుభవాలు వివరించారు. చిన్న చిన్న పద్యాలతో గొప్ప గొప్ప భావాలు పలికించి చదువరులను ఆకట్టుకున్నారు. మంచుతుఫానునీ, ఓ చిన్నపువ్వునీ ఆయన ఎంతో అందంగా వర్ణించారు. ఆయన రచన నిశితమైన శక్తితో సాగేది. అయన అటు తన భావ పరంపరతో మేఘాల సమూహంలోనూ విహరించారు. ఇటు గరుకు నేల మీదా అడుగులు వేసి కవితలు అందించారు. చిన్న చిన్న మాటలలో పెద్ద పెద్ద భావాలను చెప్పడంలో దిట్ట అని అనిపించుకున్నారు ఫ్రాస్ట్. ఆయన కవిత్వం చదవడంతోనే హృదయాన్ని హత్తుకునేది.

ఈ అమెరికన్ రచయిత తనతో చదువుకున్న ఎలినుర్ మిరియం అనే అమ్మాయికి ఒక ప్రేమ లేఖ రాశారు. నార్త్ బోస్టన్ నుంచి 1894 ఫిబ్రవరి నాలుగో తేదీన ఆయన ర్రాసిన ప్రేమలేఖే ఇది….

నా హృదయేశ్వరీ …

నువ్వు నా సీతాకోకచిలుకవు.
కంటికీ భావానికీ కవితవై సంచరించే వర్ణ చిత్రానివి నువ్వు.
మా పంటపొలాలను నువ్వు ఎన్నిసార్లు చూసున్తావు……జ్ఞాపకం ఉందా?
నువ్వు మెలగడం, మాట్లాడటం నిన్ను ఏదో అడిగెయ్యాలని నన్ను రెచ్చగొడుతూనే ఉంటుంది…
కానీ
ఏదో ఒకటి నా ఆరాటాన్ని అణచి వదలనివ్వదు. మాట పెదవి దాటదు.
పచ్చటి తీగలూ పువ్వుల పేర్లూ, వాటి అందాలనూ చెప్తున్నప్పుడు
చెట్ల కొమ్మలనుంచి పాటలు పాడుతూ ఎగిరే పక్షుల సమూహాన్ని చూపుతున్నప్పుడూ
నువ్వు నన్ను నీ చూపులతో మింగి ఆనందం పొందిన తర్వాతే మన స్నేహం ప్రేమగా మారినట్టు
తెలుసుకున్నాను.
ఆ ధైర్యంతోనే ఈ ఉత్తరమూ రాస్తున్నాను…
కాలాలు పరువాలతో కొత్త కొత్త రూపాలతో అందాన్ని సంతరించుకున్నప్పుడు మన మనసులూ ప్రేమతో స్నేహంతో ఉత్తేజం పొందుతున్నాయి ప్రేమికులై సాగుతున్నాం….

నా వరకు జీవితం చిక్కులు లేనిదే. సుందరమైనది. కనుక మన ప్రేమ కలల ప్రపంచంలో సాగిపోతూ జ్ఞాపకాల ప్రపంచంలో చూస్తున్నాను.

ప్రకృతి చెప్పేది ఒకటి…వివేకం నేర్పేది ఒకటి…అని కాకుండా ప్రకృతిలో ఉంటూ దానినే చదువుతూ దానితో కలిసి మాట్లాడుతున్నాం. అందుకే ఆనందం పొందుతున్నాం. ఆ ఆనందం ఏదో ఒక భాగం కాకుండా సంపూర్ణంగా చూస్తున్నాను.

రహదారులకు అటూ ఇటూ ఏపుగా పెరిగిన పీచ్ వృక్షాలూ, ఈ చేయల గాలులూ వీస్తున్నప్పుడు చిన్నారులు కలసి మెలసి కూర్చుని ఆడుతూ కనిపించే దృశ్యాలు ఎంత ఇంపుగా ఉంటాయో చెప్పలేను. అక్కడికి నా కళ్ళు త్వరత్వరగా చేరుకుంటాయి. కానీ నువ్వక్కడ ఉండవు….

రంగురంగుల పక్షులు…పువ్వులూ, రకరకాల ఆకులూ …వీటన్నిటినీ చూసేటప్పుడు నీ చూపులు ఆకట్టుకునే వస్త్ర లావణ్యంతో నా వైపు నడచి వస్తున్నట్టు అనిపిస్తుంది.

విత్తనంలో ప్రాణం తాలూకు నిప్పు ఎలా ఆరకుండా ఉందో అలాగే నా హృదయంలో నీ స్నేహం, నీ ప్రేమ, నీ పాశం, నీ ఆప్యాయత ఉన్నాయి. మంచి మట్టి, వాన దొరికితే చాలు మొలకెత్తే విత్తనంలా నా ప్రేమ భావం నిన్ను చూడగానే ఆకాశంకేసి ఎగిరే పక్షిలా పొంగుకొస్తుంది.

నాలుగు పరువాలూ ఒక పువ్వు వికసించడానికి అవసరం.

మన ప్రేమకూ పరువాలూ సహకరిస్తున్నాయి.

అవును ఆ ప్రేమ పెళ్లి దిశలో సాగుతోంది…

నా మరో మాట….

జీవితం కవితామయం. అవును, ఆ కవితవు నువ్వే… మాటల్నినిజం చేయడమే నా లక్ష్యం. నువ్వు నా జీవితంతో మమేకమవడమే నా సాహితీ జగత్తుకి మూలాధారం అవుతుంది.

ఎప్పటికీ నీ
ఆర్ ఫ్రాస్ట్

– నీరజ

Send a Comment

Your email address will not be published.