కన్నులపండువుగా సీతారామ కళ్యాణం

20180325_125145

ఎన్నిమార్లు చూసినా తనివి తీరనిది. ఎన్నిసార్లు విన్నా వీనుల విందైనది. మాటలకందని మధురానుభూతి అది. మంచి మమతల అనుబంధమది. దివ్యమంగళ సౌభాగ్యమది. భారతీయ సంస్కృతికి మూలాధారమది. ఎంత వల్లె వేసినా అలసటరానిది.

శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||

20180325_143248

ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నకాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం ‘శ్రీరామనవమి’గా విశేషంగా జరుపుకుంటాం.

పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసం. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది.

20180325_122247

సామాన్య మానవునికి కళ్యాణం చేయడం అంటే జీవితంలో అదొక అనంతమైన అనుభూతి. అయితే ఆది దేవుని కళ్యాణం తు.చ. తప్పకుండా ఒక క్రమ పద్ధతిలో అందునా పర సంస్కృతితో సహజీవనం చేస్తూ మన సంస్కృతిని కాపాడుకోవాలన్న ఒక అచంచలమైన దీక్షతో, నిర్ధిష్టమైన పట్టుదలతో షుమారు 3 గంటలు భక్తులందరినీ ఏకోన్ముఖులనుజేసి తాదాత్మ్యముతో సీతారామ కళ్యాణం జరిపించడం ఎంతో ప్రసంశనీయం. జెట్ (JET – Jeeyar Educational Trust) ఆధ్వర్యంలో గత ఆదివారం శ్రీరామ నవమి సందర్భంగా పశ్చిమ మెల్బోర్న్ లోని అర్దీర్ ప్రాంతంలో శ్రీ సీతారామ కళ్యాణం అత్యంత వైభోగంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆద్యంతము వరకూ ప్రతీ ఘట్టము అందరికీ అర్ధం అయ్యేటట్లు వివరించి భావి తరాల వారికి మన సత్సంప్రదాయల గొప్పతనాన్ని వివరించడం హర్షణీయం.

20180325_12214720180325_12211320180325_122039

కళ్యాణం పురస్కరించుకొని పసుపు దంచే కార్యక్రమం నుండి కంకణాలు కట్టడం, జీలకర్ర బెల్లం నెత్తిమీద పెట్టడం, మంగళసూత్ర ధారణ, వధూవరులతో పూలబంతి ఆడించడం వంటి ముఖ్యమైన ఘట్టాలు ఒక రంగస్థల ప్రదర్శనలా జరిపించి చూడముచ్చటగా నిర్వహించారు. కళ్యాణం జరిపిన పిదప పల్లకీలో సీతారాముల వారిని ఊరేగింపు చేయడం అందునా యువకులు, పిల్లలు ఈ ఊరేగింపులో ఎక్కువగా పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయడం ఎంతో హర్షణీయం.

శ్రీ రాగామృత సంగీత కళాశాల సంచాలకులు శ్రీమతి మాధురి వాస వారి శిష్య బృందంతో కల్యాణానికి సమానుకూలమైన అనువైన చక్కని పాటలు పాడి ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసారు.

20180325_13575120180325_122320

విక్టోరియా జెట్ అధ్యక్షులు శ్రీ సత్య రామడుగు గారు మాట్లాడుతూ ప్రతీ ఏటా శ్రీరామ నవమి, దీపావళి మరియు సంక్రాంతి పండగలు మెల్బోర్న్ నగరంలో ఒక్కొక్క ఏడాది ఒక్కో స్థలములో సంబరంగా నిర్వహిస్తామనీ చెప్పారు. జెట్ అధ్వర్యంలో “ప్రజ్ఞా” పాఠశాల ప్రతీ ఆదివారం డాండినాంగ్, టార్నీట్ ప్రాంతాలలో నిర్వహిస్తూ ఇందులో మన సంస్కృతీ గురించి చెప్తూ ఉంటారు. ఇవి పిల్లల వ్యక్తిత్వ వికాశం కోసం ఎంతో తోడ్పడతున్నాయని తెలిపారు. ప్రస్తుతం తెలుగు భాష పిల్లలకు నేర్పిస్తున్నారు. ఇక ముందు తెలుగు భాష ఆసక్తికరంగా నేర్పించడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు అయన చెప్పారు.

20180325_140124

జెట్ ఆస్ట్రేలియా తరఫున రెండేళ్ళ క్రితం నేపాల్ లో జరిగిన భూకంప బాధితులకు 35, 000 డాలర్లు డబ్బు చేకూర్చినట్లు శ్రీ సత్య గారు చెప్పారు. చాలా స్థానిక సంస్థల వారికోసం కూడా డబ్బు చేకూర్చి సేవా కార్యక్రమాలు చేస్తూ వుంటారు. జెట్ భారత దేశంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం ముఖ్యంగా కొన్ని ఊళ్ళు దత్తత తీసుకొని వారికీ కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించడం చేస్తూ ఉంటారు. 2019 ఫిబ్రవరి నెలలో స్టేట్యు అఫ్ ఈక్వాలిటీ హైదరాబాద్ లో 108 దేవాలయాల సమూహంతో సమగ్రంగా నిర్మించి ప్రతిష్టాపన చేయాలన్న తలంపుతో చిన జీయర్ స్వామి వారు అహోరాత్రులు కష్టపడుతున్నారని శ్రీ సత్యగారు తెలిపారు.

20180325_14362320180325_143531

ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తగా శ్రీ ఫణి రంగరాజు గారు వ్యవహరించి నిర్విఘ్నంగా జరగడానికి దోహదపడ్డారు.
ఎంతో శ్రమకోర్చి తమ సమయాన్ని వెచ్చించి అందరికీ ప్రసాదం అందించడంలో శ్రీ కిరణ్ పాల్వాయి సహాయం చేసారు. వీరితోపాటు శ్రీ ప్రవీణ్ రెడ్డి దేశం, శ్రీ పుల్లారెడ్డి బద్దం, అమరేందర్ రెడ్డి అత్తాపురం సహాయం అందించి కార్యక్రమం దిగ్విజయంగా సాగడానికి దోహదపడ్డారు.

శ్రీరామ కళ్యాణం – ప్రకాష్ మరియు రాజేష్ జరిపించారు.

వేదిక అలంకరణ శ్రీమతి ప్రీతి వెన్నెల బృందం చేసారు. శ్రీ మురళి బుడిగె గారు ఈ కార్యక్రమానికి శబ్ద సంగ్రహకర్తగా వ్యవహరించారు.

Send a Comment

Your email address will not be published.