కరోనాపై.. కట్టుకథలు వినొద్దు!

corona_virusకరోనావైరస్‌ ఒకవైపు విజృంభిస్తుంటే దానిపై అపోహలను పెంచి, ప్రజల్ని పక్కదారి పట్టించేవారి సంఖ్యా పెరుగుతోంది. వైద్యవిజ్ఞానం సాయంతో దానికి వ్యాక్సిన్‌ కనుగొనడానికి ప్రయత్నాలు జోరందుకుంటున్నాయి. కానీ ఇదే సమయంలో ప్రజల్లో భావోద్వేగాలను పెంచి, స్వీయ ప్రచారాన్ని పెంచుకోవడానికి తాపత్రయ పడుతున్నారు చాలామంది. మాంసాహారం తింటేనే కరోనా వస్తుందనీ, శాకాహారం తినేవారికి కరోనా రాదని ఆహార వివక్షా ధోరణులనూ ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ప్రచారాల్లో వాస్తవం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

తాజా గణాంకాల ప్రకారం శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా 206 కరోనా పాజిటివ్‌ కేసులున్నాయి. 20 మందికి వ్యాధి నయంకాగా, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనాతో ఐదుగురు మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు పాజిటివ్‌ కేసులు బయటపడగా, తెలంగాణలో 18 కేసులున్నాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి.
అయినా, జనాల్లో అనేక సందేహాలు ఉన్నాయి.

ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాజన్‌శర్మ కరోనా వైరస్‌పై ప్రచారంలో ఉన్న సందేహాలను, అపోహలను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ వివరాల ప్రకారం…వ్యక్తులు ఒకరిని ఒకరు తాకడం వల్లే కరోనా వైరస్‌ వ్యాపిస్తుంది. కరోనా వైరస్‌ సోకడం చిన్నపిల్లల్లో చాలా తక్కువ. 60 ఏళ్లకు పైబడినవాళ్లపై ఈ వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గ్రామాల్లో కరోనా వైరస్‌ వ్యాపించడం కొంచెం తక్కువ. ఇది నగరాల్లో వ్యాపించే వైరస్‌. ప్రతి ఒక్కరి దగ్గూ వైరస్‌ మోసుకువచ్చేదేం కాదు. అయినా సరే దగ్గు, తుమ్ముల ద్వారా వచ్చే కణాలు ఇతరులకు చేరకుండా చేతిని అడ్డం పెట్టుకోవడం గానీ, ముక్కు, నోటికి రుమాలుని అడ్డంపెట్టుకోవడం గానీ చేయాలి.

coronavirus

కరోనావైరస్‌ సోకితే తక్షణం నయం చేసే చికిత్సేమీ లేదు. ఒకవేళ లక్షణాలు కనిపిస్తే, వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. కరోనావైరస్‌ సోకినవారిని ఆసుపత్రుల్లో విడిగా, చిన్న చిన్న బృందాల్లో ఉంచుతారు. మాంసాహారం, చికెన్‌, గుడ్లు తింటే, కరోనావైరస్‌ వస్తుందన్నది నిజం కాదు. భారత్‌లోని వంట పద్ధతుల వల్ల ఆహారంలో వైరస్‌ బతికుండే అవకాశాలు చాలా తక్కువ. బాగా ఉడికించుకుని చికెన్‌, గుడ్లు వంటివాటిని తింటే వచ్చే ఇబ్బందేమీ లేదు. ప్రభుత్వం చాలాచోట్ల కరోనా వైరస్‌ చికిత్స కేంద్రాలు తెరిచింది. తీవ్రమైన జలుబు, దగ్గు, జ్వరం, ఊపిరి పీల్చుకోవడంలో సమస్యలు వంటి లక్షణాలు కనిపిస్తే కరోనా చికిత్సా కేంద్రాలకు వెళ్లాలి. కరోనావైరస్‌ నుంచి రక్షణ కోసం థ్రీ-లేయర్డ్‌ మాస్క్‌లు దొరుకుతాయి. ఎన్‌-51 మాస్క్‌లు వాడొచ్చు. సాధారణ సర్జికల్‌ మాస్క్‌లు వేసుకున్నా ఫర్వాలేదు. ఈ ఇన్ఫెక్షన్‌ వదిలించుకోడానికి ప్రస్తుతం ఎలాంటి ప్రత్యేక చికిత్సలూ లేవు. ఇన్ఫెక్షన్‌ వచ్చిన రోగులకు డాక్టర్లు ప్రస్తుతం వారి లక్షణాల ఆధారంగా చికిత్సలు అందిస్తున్నారు. తగిన జాగ్రత్తలు పాటిస్తే కరోనా వైరస్‌కు దూరంగా ఉండొచ్చు. పరిశుభ్రత విషయంలో ఎలాంటి అశ్రద్ధ, నిర్లక్ష్యం ఏమాత్రం పనికిరావు.

Send a Comment

Your email address will not be published.