అనుకోని విధంగా పేస్ బుక్కుతో
నాకు ఏర్పడిన పరిచయమే అనూతో….
చాటింగులు
సెల్ సంభాషణలు
ఎస్ ఎం ఎస్ లు
దీర్ఘకాలం సాగాయి
అనూని చూడాలని నేనూ
కుదరదని అనూ
సవాళ్ళకు సవాళ్ళు వేసుకున్నాం
చివరికి
చాలాకాలానికి కలిశాము
అనూ, నిన్ను చూడనివ్వక అడ్డుగోడవుతోంది
నా కన్నీటి ధార, పట్టరాని ఆనందం
ఉన్నట్టుండి ఆ కన్నీటి ధార మధ్య
నువ్వు కనిపించావు
నువ్వు నా కన్నీళ్లను
తుడుస్తున్నావు
వేళ్ళకు అంటిన తడిని
దీర్ఘంగా లోతు మనసుతో చూసావు
అనుకోని మౌనం
మనల్ని గతంలోకి తీసుకుపోతోంది
అప్పటి వరకు నమోదైన దృశ్యాలు
మనసు చుట్టూ తిరుగుతున్నాయి
పరస్పరం చెప్పుకోవలసిన మాటలు
మరచిపోయి
ఒకరికొకరం చూసుకున్నాం
మనకోసమైన ప్రపంచం
ఈ క్షణాన మన మధ్య ఉంది
దీనిని జాగర్త చేస్తాను
ఎటూ తరలిపోకుండా
అప్పుడప్పుడూ
మన మధ్య గొడవల వల్ల
అనుభవించిన బాధలకు
ఈ క్షణ లోకం
ఓదార్పు ఔషదం కావచ్చు
ధైర్యంగా ఉందాం
మనకైన మంచి జీవితాలకోసం
నమస్కరిద్దాం
తీరా అప్పటి వరకు
నేను మూసిన కళ్ళతో
తెరచిన మనసుతో చూస్తే
ఇప్పటివరకు చూసినదంతా
ఒట్టి కలే ..?
మనం ఒకరినొకరం చూసుకోలేదు
నువ్వనుకున్నదే నిజమైంది
చివరిదాకా చూసుకోకుండానే మిగిలిపోయాం
నువ్వు నువ్వుగా, నేను నేనుగా
– యామిజాల జగదీశ్