మన తెలుగు భాషా సాహిత్యంలో పద్యానికి ఉన్న స్థానం అమోఘమైనది. మన భాషలోని పద్య ప్రక్రియ మరే భాషలోనూ లేదు. ఈ పద్యాలతోనే అనేక అమూల్యమైన శతకాలు అందించిన కవులు అనేకులు ఉన్నారు. అందరి నాలుకులపై నర్తించే వేమన శతకం, సుమతీ శతకం ఇత్యాది పద్యాలు అనేకం. అవన్నీ చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పిస్తే అవి చైతన్యవంతం చేయడమే కాకుండా మనో వికాసానికి కూడా దోహదపడతాయి.
అయితే కొందరు కవులు అటువంటి శతకాలకు పేరడీలు రాసిన విషయం కూడా తెలుసుకుంటే బాగానే ఉంటుంది. ఆ పద్యాలు ఆసక్తికరంగానూ ఉంటాయి.
సుమతీ శతకంలాగానే కుమతీ శతకం అని ఒక శతకం ఉంది. కుమతీ శతకంలోని పద్యాలు, దానికి పీఠిక కూడా పేరడీప్రాయమే. కుమతీ శతకానికి సంబంధించి రెండు తాళ పత్ర గ్రంధాలు దొరికినట్టు తెలుగు సాహిత్యంలో పేరడీ అనే పుస్తకాన్ని రాసిన డాక్టర్ వెలుదండ నిత్యానందరావు తెలిపారు. ఒక తాళ పత్ర గ్రంధంలో పేర్కొన్న సంవత్సరానికి, తిదికీ క్రీస్తుశకం 927 అక్టోబర్ 23 అని సరిపోతుందని నిత్యానంద రావు తెలిపారు. ఈ కుమతీ శతకాన్ని ఆధారంగా చేసుకుని సుమతీ శతకకారుడు సుమతీశతకం రాసినట్టు చెప్తారు. ఇంతకూ ఈ కుమతీ శతకాన్ని ఎవరు రాసారు అనేది ఇంకా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. అది అలా పక్కన పెడితే, ఇతిశ్రీ అనే పేరుతో ఓ కుమతీ శతకం అందుబాటులో ఉంది. ఈ ఇతిశ్రీ ఎవరో కాదు…..ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు.
కుమతీశతకంలో నుంచి ఒకటి రెండు పద్యాలు ఇక్కడ ఉదాహరిస్తున్నాను….
1. బ్లేడును చూడని ముఖమును
బీడీ సిగరెట్ల కంపు వీడని ముఖమున్
కోడిములు చెప్పు ముఖమును
బూడిద కిరవైన పాడు బొందిర కుమతీ
2. అడిగిన ప్రశ్నలు చెప్పని
మిడిమేలపు టీచర్లతో మెలగుటకంటెన్
వడిగొని ట్యూషన్ వెట్టుక
బడి ప్యాసవచ్చు గాదె వశుదను కుమతీ
———————–
యామిజాల జగదీశ్