‘కెప్టెన్‌ రాజు’ మృతి

Captain Rajuప్రముఖ మలయాళ నటుడు, దర్శకుడు రాజు డానియెల్‌ అలియాస్‌ ‘కెప్టెన్‌ రాజు’(68) కన్నుమూశారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందారు. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్‌, ఇంగ్లీష్‌ వంటి పలు భాషల్లో నటించిన ఆయన స్వయంగా రెండు మలయాళ చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. తొలుత ఆర్మీ అధికారిగా పనిచేసిన కెప్టెన్‌ రాజు అనంతరం ఆ ఉద్యోగాన్ని వదిలి నాటక రంగంలోకి ప్రవేశించారు. ఆర్మీ నేపథ్యం ఉండటంతో కెప్టెన్ రాజుగా పేరొందారు. 1981లో రక్తం సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన ఆయన మలయళంతోపాటు తెలుగు, తమిళ చిత్రాల్లోనూ నటించారు. హిందీ, ఇంగ్లిష్ సినిమాలు కలిపి ఆయన 500కిపైగా చిత్రాల్లో నటించారు.

1980ల్లో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన రాజు ప్రతినాయకుడి పాత్రలకు ప్రసిద్ధి పొందారు. తెలుగులో ‘బలిదానం’, ‘శత్రువు’, ‘రౌడి అల్లుడు’, ‘కొండపల్లి రాజా’, ‘జైలర్‌ గారి అబ్బాయి’, ‘గాండీవం’, ‘మొండి మొగుడు పెంకి పెళ్లాం’, ‘మాతో పెట్టుకోకు’ వంటి చిత్రాల్లో నటించారు. మలయాళంలో 1997లో తొలిసారి ‘ఒరు స్నేహగథా’తో దర్శకుడిగా మారారు. అనంతరం 2012లో ‘పవనాయి 99. 99’ చిత్రానికి దర్శకత్వ వహించడమే కాక ఆ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. కొద్ది నెలల క్రితం అమెరికా వెళ్తుండగా.. ఆయనకు విమానంలో గుండె పోటు వచ్చింది. దీంతో ఒమన్‌లో విమానాన్ని అత్యవసరంగా ల్యాడింగ్ చేసి చికిత్స అందించారు. తర్వాత కుటుంబ సభ్యుల వినతి మేరకు చికిత్స కోసం ఆయన్ను మస్కట్ నుంచి కొచ్చి తీసుకొచ్చారు. ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు

Send a Comment

Your email address will not be published.