గణనాథునికి ఘనస్వాగతం

ganesప్రపంచమంతా గణాలతో కూడుకుని ఉంది. అలాంటి గణాలు అన్నీకలిస్తేనే ఈ ప్రపంచం.. అట్టి ప్రపంచాన్ని అహంకారానికి చిహ్నమైన మూషికాన్ని అధిరోహించి పాలించే ప్రభువు ఈ మహాగణపతి. మహా గణపతి, హరిద్రా గణపతి, స్వర్ణ గణపతి, ఉచ్చిష్ట గణపతి, సంతాన గణపతి,నవనీత గణపతి అని ఆరు రూపాల్లో పూజిస్తారు. అలాగే ప్రపంచం వ్యాప్తంగా ప్రాంతాలను బట్టి భిన్న రూపాలతో విఘ్నాధిపతిని ఆరాధిస్తారు. విశ్వరూప ప్రజాపతి సిద్ధి, బుద్ధి అనే తన ఇద్దరు కుమార్తెలను గణపతికిచ్చి వివాహం చేశారు. వారికి క్షేముడు, లాభుడు అనే కుమారులు జన్మించారు. అందుకే గణేశుడి ఆరాధన వల్ల క్షేమం, లాభం కలుగుతుందని ప్రతీతి. ఏ పని ప్రారంభించినా తొలి పూజ వినాయకుడిదే. అటువంటి విఘ్నేశ్వరుని ప్రత్యేకంగా ఆరాధించే పండుగను కులమతాలకు అతీతంగా ఎంతో వేడుకగా జరుపుకుంటారు. కేవలం భారత్‌లోనే కాదు ప్రపంచంలోని అనేక ప్రాంతంలో వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవడం విశేషం.

వినాయకుడికి సాధ్యం కానిది లేదు. వినాయకుడంటే అన్నీ. సమస్తం ఆయన ఆధీనంలోనే వుంటాయి. కోరితే ఆయన ఇవ్వలేనిదంటూ ఏదీ లేదని చెబుతారు. మహావిష్ణువు దశావతార రూపుడయితే, విఘ్నేశ్వరుడు అంతకన్నా ఎక్కువ రూపాలను కలిగిన దేవుడు. ఒక్కో రూపం ఒక్కో మహిమ చూపుతాడట వక్రతుండుడు. కోటి సూర్యులకు సమమైన గణపతికి వీలు లేని కార్యం లేదు. ఈ చరా చర సృష్టిలో.. వినాయకుడికి సాధ్యం కానిది లేదంటారు గణేశశక్తిని ఆరాధించేవారు. రూపాలు వేరైనా.. గణనాధుడు ఒక్కడే… వినాయకుడు ఒకడే కాదు. ఆయనకు 32 రూపాలున్నాయని చెపుతున్నాయి శాస్త్రాలు. ఆ ముప్ఫైరెండింటిలో పదహారు రూపాలలో ఉండే వినాయకులను ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఒక్కో రూపంలో ఉండే వినాయకుడిని పూజిస్తే ఒక్కో కోరిక తీరుతుంది. ఒక్కోరకం శుభం కలుగుతుందని చెబుతారు. ముద్గల పురాణంలో వినాయకుడికి సంబంధించిన పదహారు రూపాలను గురించి ప్రత్యేకంగా వివరణ కనిపిస్తుంది. బాలవిఘ్నేశుడు, తరుణ విఘ్నేశుడు, భక్త, వీర, శక్తి, ద్విజ, పింగలం, ఉచ్చష్ట, విఘ్నరాజం, క్షిప్ర, హేరంబం, లక్ష్మీవిఘ్నేశ, మహావిఘ్నం, భువనేశం, నృత్త, ఊర్ధ్వ గణపతి అనే పదహారు రకాల గణపతుల రూపాలను గురించి వివరిస్తోంది ముద్గల పురాణం.

తొలిదైవమైన ఆదిగణపతి
దేవుళ్లంతా చక్కని ముఖాలతో.. అందంగా, మంచి మంచి వాహనాలెక్కి ఊరేగుతారు.. మరి వినాయకుడేమిటి? ఏనుగు ముఖం.. ఎలుక వాహనం.. ఎక్కడైనా పొంతన ఉందా? ఏనుగు ఎలుక మీద ఎక్కి కూర్చొని వెళ్లటం విచిత్రం కాదా? ఏ విధంగా చూసినా ఈ పొంతనకు పరమార్ధం అంతుచిక్కదంటారు సైంటిస్టులు. ఈ ఆకారానికి, ఆ వాహనం సంభవమేనా? ఇదేమి వింత… అని ఆలోచిస్తే మతిపోతుంది. ఒక్కో దేవుడి గురించి ఆలోచిస్తే… ఆ దేవతల రూప రహస్యాలు- శాస్త్ర సాంకేతికతకు ఎంత దగ్గరగా ఉన్నాయో అర్థమవుతుంది.. వినాయకుడు కూడా అంతేనంటారు
తొలిదైవమైన ఆదిగణపతి గురించి చెప్పుకుంటే.. ఆయన ఎంతటి హేతుబద్ధమైన దైవమో తెలుస్తుంది. బొజ్జగణపయ్య.. బొజ్జ దేనికి గుర్తు. ఆ తొండం, తల ఏ భావానికి ప్రతీకలు? ఆయన చేతిలోని ఆయుధాలకు అర్ధమేమిటీ.. పరమార్ధమేమిటీ? ఆయన దేహమే ఓ సామాజికి దేవాలయం అంటారు దాని అంతరార్ధమేమిటి? ఆయన ఇష్టపడే ప్రతిదీ ప్రాకృతమైనదే? వినాయకుడి ప్రస్తావన తీసుకురావడం అంటేనే ఈ అండపిండ బ్రంహ్మాండానికి సంబంధించిన అన్ని విషయాలనూ ఒక్కసారిగా మాట్లాడుకున్నట్టే అంటారు. అదెంత వరకూ వాస్తవం?

వినాయక చవితిని భాద్రపద మాసంలో జరుపుకుంటారు. అంటే వ్యవసాయ తొలి సీజన్‌ ఖరీఫ్‌ మంచి ఊపు అందుకునే సమయం కూడా ఇదే. మన దేశం వ్యవసాయ ప్రధాన దేశం. మనం చేసే ప్రతీ పనీ. జరిపే ప్రతి పండగ అన్నీ… వ్యవసాయానికి అనుసంధానించి వుంటాయి. వినాయక చవితి కూడా అంతే. సాధారణంగా నాట్లు వేయటంలో రైతన్నలు తీరిక లేకుండా గడిపే సమయమిది. అందుకే ఆయనకు తొలి పూజలు చేసి పవిత్రమైన వ్యవసాయ పనులను మొదలుపెడతారు కర్షక జీవులు. ఆయన శరీరం ఏనుగు శరీరం.. అంటే భారీ పదార్థం. భౌతిక శాస్త్రపరిభాషలో చెప్పాలంటే మెటీరియల్‌. అసలు పదార్థం నుంచే సృష్టి జరుగుతుంది. మట్టి నుంచే పంట పండుతుంది. అంటే ఆయన స్థూలంగా భూమికి ప్రతీక. ఆయన ఏనుగు ముఖం బుద్ధికి చిహ్నము. ఆయనకు ఉండే ఏక దంతం.. రైతు పొలంలో పట్టే నాగలికి గుర్తు. ఇక పెద్ద పెద్ద చెవులు తూర్పార బట్టే చేటలకు సంకేతం. ఆయన పెద్ద బొజ్జ పండిన వడ్లను పోసేందుకు ఉపయోగించే గాదెకు గుర్తు. ఎలుకల్ని వాహనంగా చేసుకోవటం అంటే పంటల్ని పాడు చేసే ఎలుకలను అణచివేయటానికి గుర్తు. బొజ్జగణపయ్య పొట్టను పాములతో బిగించి కట్టుకోవటం కూడా అందుకే ప్రతీక. వినాయకుడి వ్రతాన్ని చేసేప్పుడు 21 రకాల పత్రాలను వినియోగిస్తారు. జాజి, మారేడు, మాచీపత్రి, విష్ణుక్రాంత మొదలైన ఆకులన్నీ సాధారణంగా పంటపొలాల పక్కన కనిపించే ఔషధ మొక్కలే. అందుకే అన్ని విధాలుగా వినాయకుడు వ్యవసాయ ప్రధాన దేవుడయ్యాడని చెబుతారు. వినాయకుడిని పూజించటం అంటే పొలాన్ని, సేద్యాన్ని, భూమిని పూజించినట్లే.. అవుతుందని ఎంతో భక్తితో భావిస్తారు. ఇదీ సంగతి. ఇన్నేసి విషయాలు వినాయక రూపంలో ఇమిడి వున్నాయని అంటారు వినాయక భక్తులు

32 రూపాల వినాయకుడు
బాలగణపతిని పూజిస్తే బుద్ధివికాసంతోపాటు.. ప్రతివిషయాన్ని శ్రద్ధతో పరిశీలించే శక్తి అబ్బుతుంది. తరుణ గణపతిని పూజిస్తే చేపట్టిన కార్యాన్ని ఎట్టిపరిస్థితుల్లోను సాధించి తీరాలనే పట్టుదల కలుగుతుంది. భక్త విఘ్నేశుడిని పూజిస్తే భక్తిభావం పెరుగుతుంది. వీర విఘ్నేశుడ్ని పూజించినవారికి మంచి ధైర్యం వస్తుంది. శక్తి విఘ్నేశ్వరుడిని పూజిస్తే ఆత్మస్త్థెర్యం కలుగుతుంది. ద్విజ లేక ధ్వజగణపతిని పూజిస్తే సొంతంగా ఆలోచించగల శక్తి పెరుగుతుంది. సిద్ధివినాయకుడిని పూజిస్తే అన్నిటా విజయమే. సిద్ధి, బుద్ధి అనే భార్యలను కలిగివుండి తన తొండంతో నువ్వులద్దిన ఉండ్రాళ్ళను తింటూ దర్శనమిస్తాడీ సిద్ధివినాయకుడు.

ఉచ్చిష్ట గణపతిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. అయితే ఈ గణపతి దగ్గర కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలని అంటారు. ఈయనకు చేసే పూజలో ఏమాత్రం శ్రద్ధలేకపోయినా కోరికలు తీరడమనే మాట అటుంచి ఇబ్బందులు తలెత్తుతాయని హెచ్చరిస్తారు. విఘ్న వినాయకుడికి పది చేతులు. విఘ్నాలు తొలగేందుకు ఈ గణపతి పూజకు మించింది లేదంటారు. క్షిప్రగణపతిని పూజిస్తే కోరికలు తీరుతాయి. హేరంబ గణపతిని పూజిస్తే ప్రయాణాలలో ప్రమాదాలు కలగవు. లక్ష్మీగణపతి పూజ వల్ల ధనప్రాప్తి కలుగుతుంది.

మహా విఘ్నవినాయకుడిని పూజిస్తే ఏలినాటిశని ఉన్న సమయాల్లో కూడా తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. భువనేశ వినాయకుడిని పూజిస్తే శాశ్వత జయం కలుగుతుంది. అందుకే ఈయనను విజయ వినాయకుడు అనికూడా అంటారు. నృత్త వినాయకుడిని పూజిస్తే తృప్తి, మనశ్శాంతి కలుగుతాయి. ఈయన తాండవం చేస్తుంటాడు కనుక తాండవ గణపతి అని కూడా అంటారు. ఊర్ధ్వ గణపతిని పూజిస్తే తెలిసి చేసిన పాపాలు కూడా పోతాయి. అలాగే ఆకుపచ్చని శరీరఛాయతో మెరిసిపోతున్న లక్ష్మీదేవిని తన ఎడమతొడమీద కూర్చోపెట్టుకొని ఆమె వెనుకగా తన చెయ్యిని పోనిచ్చి ఆమెను పొదివిపట్టుకున్నట్లుగా ఉంటాడు వూర్ధ్వగణపతి. ఈ పదహారురకాల గణపతులను ప్రధానంగా పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయని ముద్గల పురాణం చెబుతోంది.

భాద్రపద శుద్ధ చవితి
భాద్రపద శుద్ధ చవితి రోజున విఘ్నేశ్వరుడు పుట్టిన రోజని కొందరు, గణాధిపత్యం పొందిన రోజని ఇంకొందరు భావిస్తారు. మహేశ్వరాది దేవతా గణాలకు గణపతి ప్రభువు. అంటే సకలదేవతలకు ఆయనే ప్రభువన్న మాట. బ్రహ్మ తొలుత సృష్టి కార్యాన్ని ప్రారంభించే ముందు గణపతిని పూజించినట్టు రుగ్వేదం చెబుతోంది. బ్రహ్మవైవర్తన పురాణంలో ‘గణ’ శబ్ధానికి విజ్ఞానమని, ‘ణ’ అంటే తేజస్సు అని పేర్కొన్నారు. ఇక పంచమ వేదంగా చెప్పుకునే మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు తన లేఖకుడిగా గణపతిని నియమించాడు. గణనాథుడు జయకావ్యాన్ని అద్భుతంగా రాయడంతో దానిని తమ దగ్గరే ఉంచుకోవాలని దేవతలు తస్కరించారంటారు. తొలి పూజలందుకునే వినాయకుడి వాహనం మూషికం. దేవతలందరూ వేగంగా పరుగెత్తే జంతువులు, పక్షులను తమ వాహనంగా ఎంపిక చేసుకుంటే, దీనికి భిన్నంగా గణపతి మూషికాన్ని ఎంచుకున్నారు.

శివపార్వతుల ముద్దుల తనయుడు వినాయకుడు. ఆ స్వామిని తలచుకుంటే చాలు తలపెట్టిన కార్యక్రమం ఏదైనా ఎలాంటి విఘ్నం లేకుండా విజయం సాధిస్తుంది. ఏటా భాద్రపద చవితి నాడు ప్రతి ఇంట్లో పాలవెల్లి కట్టి గణేషుని పూజించి, వీధుల్లో పందిళ్లు వేసి సంబరంగా వినాయక నవరాత్రులను జరుపుకోవడం ఆనాదిగా వస్తున్న ఆచారం. ఏ కార్యంలోనైనా ప్రథమ పూజలందుకునే వినాయకుడంటే అందరికి ఎంత భక్తిభావమో, తన భక్తుల పట్ల గణపతికి కూడా వల్లమాలిన వాత్సల్యం. ఆ స్వామి రూపం, ఆ స్వామి నామాలు మనకు ఎన్నో విషయాలను ప్రబోధిస్తాయి. హిందువులకు తొలి పండుగ వినాయకచవితే. ప్రతీవారు తమ ఇంట్లో స్వామిని పూజిస్తారు. వినాయక వ్రతం, పూజా విధానం ఎలా చేయాలో పండితులు చెబుతున్నారు

విఘ్నేశ్వరుని ఇంటిలో పూజించేవారు ముందు రోజే మట్టి విగ్రహాలను తీసుకురావాలి. అమృత ఘడియలు, శుభ కాలంలో వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకొస్తే మంచి జరుగుతుందని పండితులు పేర్కొంటున్నారు. సెప్టెంబరు 2 తెల్లవారుజామున 4.56 గంటల తర్వాత చతుర్దశి ప్రారంభమై అదే రోజు రాత్రి 1.53 వరకు ఉంటుంది. కాబట్టి సెప్టెంబరు 2 సోమవారం ఉదయం నుంచే గణపతిని పూజించుకోవచ్చని అంటున్నారు. అయితే వినాయకుడి జననం మధ్యాహ్నం సమయంలో జరిగిందని బలంగా నమ్ముతారు కాబట్టి ఉదయం 11.05 నుంచి 1.36 గంటల మధ్య పూజకు అనుకూలమై కాలమని పౌరోహిత్యులు తెలియజేస్తున్నారు. ఉదయం 8.55 నుంచి రాత్రి 9.05 మధ్య చంద్రుని చూడరాదని అంటున్నారు.

Send a Comment

Your email address will not be published.