మహాత్మా గాంధీ గారి 150వ జన్మ దిన వార్షికోత్సవాలని పురస్కరించుకొని జనరంజని రేడియో గ్రూప్ ఇండియన్ కాన్సులేట్ కార్యాలయము లొ అక్టోబర్ 26వ తారీఖు న సంగీత సాంస్కృతిక కార్యక్రమం నిర్వహింది.
ఈ కార్యక్రమము ముందుగా ఆస్ట్రేలియా గాయనీమణి పాడిన గాంధీ గారి ప్రియమైన భజన గీతం “వైష్ణవ జనతొ” తో ప్రారంభం కావటం విశేషం. ఇది భారత ప్రభుత్వం గాంధీ గారి 150వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని వివిధ విదేశీ కళాకారులచే పాడించే ప్రాజక్టు లో భాగంగా రికార్డ్ చేయబడింది.
తరువాత కార్యక్రమనికి విచ్చేసిన పెద్దల ప్రసంగాలలో మొదటగా గౌరవనీయులు అయిన ఇండియన్ కాన్సుల్ జనరల్ శ్రీ బి.వానల్వాన గారి ప్రసంగం అందర్నీ అలరించింది. ఆయన మహాత్ముని గురించి చెప్పిన విషయాలు ఎంతో ఆసక్తికరం గా అనిపించాయి. ఇటువంటి మంచి కార్యక్రమం ఎర్పాటు చేసిన జనరంజని సభ్యులను అభినందించారు. ఆయన తమ అమూల్యమైన సమయాన్ని ఈ కార్యక్రమం కోసం కేటాయించటం జనరంజని ఎంతో గర్వం గా భావించింది.
అనంతరం శ్రీ హరినాథ్ గారి ప్రసంగం, ఆయన గాంధి గారి గురించి చెప్పిన విషయాలు, వైష్ణవ జనతొ భజన పై గాంధి గారి మక్కువ, ఇతర విషయాలు ఎంతొ ఆసక్తికరంగ వున్నాయి.
తదుపరి చి.సమ్యుక్త ఆదూరి వందేమాతర గీతం తో ప్రారంభమైన ఈ సంగీత సాంస్కృతిక కార్యక్రమం ఆద్యంతం అందరని అలరించింది.
జనరంజని యువ బ్రాడ్కాష్టర్స్ ప్రణతి ఆదూరి తెలుగు ప్రసంగం, చి. భరత్ శ్రీధర్ ల ఆంగ్ల ప్రసంగాలు ఆసక్తి కరంగా సాగాయి.
అనంతరం ఈ కార్యక్రమం లో ముఖ్యాంశం అయిన చి. బాలు మల్లెల గానం , అతను ఆలపించిన భజనలు అందరినీ మంత్ర ముగ్ధులని చేసాయి. ఈ సందర్భంగా పాడిన భజనలలో డా. మంగళంపల్లి బాల మురళీ కృష్ణ గారు గాంధీ గారి 125 వ జన్మదిన వేడుకలకు
స్వరపరచిన మోహన గాంధీ అనే అరుదైన రాగంలోని భజన చెప్పుకోదగినది.అతని అమోఘమైన గానం ఈ కార్యక్రమనికే వన్నె తెచ్చింది అనటంలొ ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎంతో అద్భుతంగా పాడిన చి.బాలు మల్లెల గానానికి సంగీత సహకారం అందించిన కుమారి దివ్య విఘ్నేష్, శ్రీవెంకట్ తల్లాప్రగడ మరియు శంకర్ విఘ్నేష్ లని అందరు అభినందించారు. భాషలు వేరైనా భావం ఒక్కటే అన్నట్టు గా శ్రీమతి దేవిక విఘ్నేష్ గారి గానం చాలా బాగుంది.
ఎప్పుడూ యువ తరాన్ని, యువ శక్తి ని ముందు నిలబెట్టే జనరంజని గ్రూప్ ఈ సారి బాలలే భవిష్యత్తరానికి వెన్నెముక అన్న బాలల తాత బాపుజి గారి సిధ్ధాంతాన్ని పాటించి, బాలలకు పెద్ద పీట వేసి, ఈ కార్యక్రమానికి వచ్చిన పిల్లలనే ముఖ్య అతిధులు గా ప్రకటించిది.
గణిత శాస్త్రం లోగణనీయమైన ఖ్యాతి ని ఆర్జించి ఎన్నో సేవలు అందించిన డాక్టర్ మేరీ కోప్లాండ్ గారు ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధి కావటం మరొక విశేషం. ఆవిడ తన ప్రసంగం లో పంచుకున్న విషయాలు, జనరంజని రేడియో గ్రూప్ తో తనకి వున్న అనుబంధం, పిల్లలకి గణిత శాస్త్రం పై ఆసక్తి కలిగేలా ఆవిడ చెప్పిన మాటలు అద్భుతం.
అనంతరం డాక్టర్ మేరీ కోప్లాండ్ గారి చేతుల మీదుగా బాలల కు ప్రశంసాపత్రాల బహూకరణ, జనరంజని సీనియర్ సభ్యుల చే కార్యక్రమంలోపాల్గొన్న వారికి మెమెంటొ పురస్కారం కన్నుల విందు చేసాయి.
చి.సుబినయ్ గాంధి గారి వేషధారణలో రావటం అందరిని ఆశ్చర్యానందాలలో ముంచెత్తింది. విశాలి దశిక, సౌజన్యా నిమ్మగడ్డ
లు ఈ కార్యక్రమనికి యాంకర్లు గా వ్యవహరించి బాధ్యతాయుతం గా ముందుకు నడిపించిన తీరు ప్రశంసనీయం.
చివరగా జనరంజని సీనియర్ సభ్యుడు శ్రీ నటరాజ్ కురిమేటి గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకి, పాల్గొన్న వారికి, వెనకనుండి నడిపించిన వారికి, సహాయ సహకారాలు అందించిన వారి అందరికి కృతజ్ఞతలు తెలిపారు.
అందరిని అలరింప చేసి, ఆనంద పరిచి, మన అందరి తాత బాపూజీ ని మరొక్కసారి స్మరించుకునే అవకాశాన్ని కల్పించిన జనరంజనిని అందరు మనస్ఫూర్తి గా అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నోనిర్వహించాలి అని అభిప్రాయ పడ్డారు.