గురువుగారికి జ్వరం : రెడ్డి గారు కంగారు

గురువుగారికి జ్వరం : రెడ్డి గారు కంగారు
వేమన, పోతన వంటి అద్భుత చిత్రాలు సమర్పించిన కె వి రెడ్డి గారు గొప్ప దర్శకులు. సాహిత్య పిపాసి. మా నాన్నగారికి పరిచయస్తులు. మేము మద్రాసులోని టీ నగర్ లో నివాసమున్న తిలక్ వీధికి మూడు వీధుల అవతల  కె వి రెడ్డి గారు ఉండేవారు. ఇంకా చెప్పాలంటే గాయకులు  ఘంటసాల వెంకటేశ్వర రావు గారింటికి అక్షరాలా కూతవేటు దూరంలో ఉండేది కె వి రెడ్డి గారిల్లు. మా నాన్నగారి (యామిజాల పద్మనాభ స్వామి)  పుణ్యమాని నేను కె వి రెడ్డి గారిని చూసిన వాడినే. మా నాన్నగారి వద్ద ఘోరఖ్ పూర్ సంస్థ ముద్రించిన వాల్మీకి రామాయణం (సంస్కృతం) పూర్తి సెట్టు ఉండేది. ఆ సెట్టు మొత్తం మా నాన్నగారికి కె వి రెడ్డి గారు కానుకగా ఇచ్చిందే. ఆ పూర్తి సంపుటాలను ఆధారం చేసుకునే మా నాన్నగారు ఆంధ్ర పత్రిక దిన పత్రికలో దాదాపు పద్నాలుగున్నర సంవత్సరాలు వాల్మీకి శ్లోకాలకు తెలుగు తాత్పర్యం రాసారు.
అదలా ఉండనిచ్చి కె వి రెడ్డిగారి విషయానికి వద్దాం. అప్పట్లో తెలుగు సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరైన ప్రముఖుల్లో కె వి రెడ్డిగారు తప్పనిసరిగా ఉండేవారు. ఆయన మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాలలో ఫిజిక్స్ హానర్స్ చేసారు. అప్పుడు ఆయన తెలుగులో అధిక మార్కులు పొంది స్వర్ణ పతకం పొందారు. ఆయన పేరును కాలేజీ తెలుగు శాఖ వారి బోర్డులో కె వెంకట రెడ్డి అని రాసారు.
ఆయన బాగా చదివే వారని తెలుగు ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారికి కె వి రెడ్డి అంటే బాగా ఇష్టం ఉండేది. ఒకమారు ప్రొఫెసర్ కు జ్వరం వచ్చింది. విషయం తెలిసి కె వి రెడ్డిగారు తెగ బాధ పడ్డారు. అప్పట్లో మద్రాసు జనరల్ ఆసుపత్రిలో రంగా చారి అని ఒక వైద్యుడు ఉండేవారు. ఆయనకు అప్పట్లోనే రోల్స్ రాయిస్ కారు ఉండేది. ఆయన బాగా పేరున్న డాక్టర్. ఆయన పేరు కె వి రెడ్డి గారి చెవిన పడింది. మరో మిత్రుడితో కలిసి రంగాచారి డాక్టర్ వద్దకు వెళ్ళారు కె వి రెడ్డి.
డాక్టరును కలిసిన కె వి రెడ్డి తమ గురువుగారు జ్వరంతో బాధ పడుతున్నారని, ఆయనను చూడటానికి రావాలని కోరారు. అప్పుడు రౌండ్సులో ఉన్న డాక్టర్ “మీరు వెళ్ళండి. నేను మరో గంట తర్వాత వచ్చి మీ గురువుగారిని చూస్తాను” అని చెప్పి పంపించారు.
చెప్పిన మాట ప్రకారమే డాక్టర్ రంగా చారి గారు  ప్రొఫసర్ లక్ష్మీనారాయణ గారిని చూడటానికి వచ్చారు. ఆయన ప్రొఫెసర్ ను పరీక్షించి కొన్ని మాత్రలు రాసి ఇచ్చారు.
“ఆ మాత్రలు తెప్పించి మీ గురువు గారికి టైం ప్రకారం వెయ్యండి తగ్గిపోతుంది” అన్నారు.
కె వి రెడ్డి గారు “ఎంత ఫీజు ఇవ్వాలి” అని డాక్టరును అడిగారు.
“మీరెంత ఇస్తారు?” అని అడిగారు డాక్టరు.
కె వి రెడ్డి, ఆయన మిత్రుడు కలిసి ఆరు రూపాయలు అంటూ తమ దగ్గరున్న డబ్బును లెక్క పెట్టి డాక్టరుకు ఇచ్చారు.
అప్పుడు డాక్టరు రంగాచారి ఆ ఆరు రూపాయలు కె వి రెడ్డి గారికి తిరిగిచ్చేసి, తన పర్సులోంచి ముప్పై రూపాయలు తీసి కె వి రెడ్డిగారికి ఇచ్చి ” వీటితో నేను రాసిచ్చిన మాత్రలు కొని మీ గురువుగారికి వాడండి. మీకు మీ గురువు గారిపై ఉన్న భక్తి శ్రద్దలు నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి ” అని కె వి రెడ్డిగారిని, ఆయన మిత్రుడిని అభినందించి వెళ్ళిపోయారు.
ఈ సంఘటనను కె వి రెడ్డి గారు అనేక సందర్భాలలో చెప్పుకుని డాక్టరుగారి దయా గుణాన్ని గుర్తు చేసుకునేవారు.
– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.