తెలుగుమల్లి శ్రోతలకు, సారధి మోటమఱ్ఱి నమస్కారాలు. కార్తీక మాస శుభాకాంక్షలు. అక్టోబరు 14, 2017 శనివారం, ఆస్ట్రేలియా తెలుగు సాహితీ సమాఖ్య, నిర్వహించిన డా సత్యనారాయణ ఊటుకూరి గారి “చలనచిత్ర గీతకోశం” పుస్తక ఆవిష్కరణపై సమీక్ష అందచేయడానికి అవకాశం ఇచ్చిన జనరంజని బృందానికి ధన్యవాదాలు. కార్యక్రమ నిర్వాహకులు, శ్రీమతి శ్రీదేవి మరియు శ్రీ కరుణాకర్ శ్రీధర గార్లు, మరియు వాణి మరియు సారధి మోటమఱ్ఱి.
తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక మైలురాయి ఈ పుస్తక ఆవిష్కరణ, సిడ్నీ తెలుగువారి చరిత్రలో కూడా ఒక మహత్తర ఘటన, ఎందుకంటే, బహుశ ఇది తొలి లేదా మలి పుస్తక ఆవిష్కరణ. సుమారు 180మంది ఆహుతుల సమక్షంలో మూడు సంపుటాల, అయిదు భాగాల, ‘తెలుగు చలనచిత్ర గీతకోశం’ విజయవంతంగా ఆవిష్కరింపబడింది.
సభాసరస్వతికి స్వాగతం పలికిన తరువాత, చిరంజీవి సంయుక్త ఆదూరి ప్రార్ధనా గీతంతో కార్యక్రమం ప్రారంభమైనది. [తెలుగు చలనచిత్ర చరిత్రకు ఈ పాటల నిఘంటువు ఏవిధంగా ప్రామాణికతను అందిస్తుందో తెలిపే నా విపుల అవతారికను అందించి, పుస్తక ఆవిష్కరణకు శంఖారావాన్ని పూరించడం జరిగింది.]
డా సత్యనారాయణ ఊటుకూరి గారు, వారి సతీమణి రత్న గారు, వారి కుమారులు ప్రసాద్, రమేశ్ గార్లు, కుమార్తె లక్ష్మి గారు, కోడళ్ళు Angeline మరియు Geraldine గార్లు; మరియు పుస్తక విశేషతపై మాట్లాడిన సాహితీ ప్రియులు, సాంకేతిక సహాయన్నిచ్చినవారు వేదికను అలంకరించారు. డా వుటుకూరి గారి కుంటుంబం, మూడు సంపుటాల అయిదు సంచికలను, శ్రోతల హర్షధ్వనాలమధ్య ఆవిష్కరించారు. ఆవిష్కరణ అనంతరం, ఆస్ట్రేలియా తెలుగు సాహితీ సమాఖ్య వారి డా వూటుకూరి గారికి సమర్పించిన ‘అభినందన అక్షర సుమ సౌరభాలు’ పత్రాన్ని శ్రీమతి సుప్రియ వంకదార గారు చదివారు.
పద్మభూషణ్ శ్రీ యస్ పి బాలసుబ్రహ్మణ్యం గారి సందేశాన్ని శ్రీ కోడూరి రామమూర్తి గారు, డా పరిచూరి గోపాలకృష్ణ గారి సందేశాన్ని శ్రీమతి వాణి మోటమఱ్ఱి గారు, శ్రీ వేటూరి రవిప్రకాశ్ గారి సందేశాన్ని శ్రీమతి లక్ష్మి దంతుర్తి గారు, శ్రీ మాధవపెద్ది సురేశ్ గారి సందేశాన్ని శ్రీమతి విజయ చావలి గారు చదివారు. ఆచారం షణ్ముఖాచారి గారి మరియు NSW Government Multi-cultural Affairs Minister Hon Ray Williams గారి సందేశాలు చదివిన తరుపరి, చిన్నారులు చంద్రమౌళి మరియు లక్ష్మి శివలెంక ల పాటతో ఈ విభాగం రక్తి కట్టింది.
డా వూటుకూరి గారి పరిచయాన్ని, కృషిని అవలోకిస్తూ, ఈ చలనచిత్ర గీతకోశాల విశిష్టతపై ప్రసంగాల అంశము కొనసాగింది. ముందుగా డా వూటుకూరి గారి UNSW సహాధ్యాయి డా మధుసూధన చక్రవర్తి గారు ప్రసంగించారు. శ్రీ శ్రీనివాస్ ముదునూరి గారు, తొలితరం గీత రచయితలు సముద్రాల మరియు పింగళి గారి రచనలు గురించి ప్రస్తుతించారు. శ్రీమతి అరుణ నిమ్మగడ్డ గారు సినీ సంగీత దర్శకుల గురించి, కొందరు గాయకుల గురించి మాట్లాడారు. శ్రీమతి శ్రీదేవి శ్రీధర గారు రచయితల, సంగీత దర్శకుల మరియు గాయకుల విశిష్ట కృషిని తమదైన శైలిలో గణంకాలతో, చిత్రాలతో విశ్లేషించారు. శరత్ మాధవపెద్ది తనకు తెలిసిన కొన్ని ప్రయివేటు సంకలనాల విషయం చెబుతూ, డా వూటుకూరి గారి సంకలనము ఏవిధంగా విశిష్టమైనదో తెలియచేశారు. డా మూర్తి దుర్వాసుల గారు తమ సందేశంలో డా వూటుకూరి గారికి ఏ విధంగా ఈ బృహత్తర నిఘంటువు తయారుచేయాలని అనిపించినదో వివరించారు. డా ఆనందమోహన్ శనగవరపు గారు చిత్రసీమ ఆరంభంలో తమ సాహిత్ర్య పరిమళాలను అందించిన రచయితల గురించి ప్రసంగించారు. డా సుందరం రాచకొండ గారు డా వూటుకూరి గారి కృషిని కొనియాడి, ఒక app ను తయారుచేస్తే బాగుంటుందని తెలీయచేయడంతో ఈ విభాగం దిగ్విజయంగా ముగిసింది.
ఈ ప్రసంగాల మధ్యలో శరత్ మాధపెద్ది రచయితలు, సంగీత దర్శకులు మరియు గాయకుల విశేషాలపై కొన్ని క్లిష్ట ప్రశ్నలు సంధించారు. వాటికి తన పుస్తకాలలో ఏవిధంగా శోధన చేయాలో చెబుతూ, ఏ ఏ పేజీలలో ఆ ప్రశ్నలకు సంబంధించిన వివరాలు ఉన్నాయో తెలియచేస్తూ, ఒక విధంగా డా వూటుకూరి గారు తన పరిశోధన సమగ్రతను తెలియచేసుకొన్నారు.
చివరి అంశం డా వూటుకూరి గారికి సన్మాన కార్యక్రమం. శ్రీ నేతి రామకృష్ణ గారు ఈ పుస్తక ఆవిష్కరణ మరియు డా వూటుకూరి ఇటీవలే జరుపుకొన్న 80వ జన్మదినం సంధర్భంగా, వేద ఆశీర్వచనం అందించారు, శ్రీమతి శ్రీదేవి మరియు శ్రీ కరుణాకర్ శ్రీధర గార్లు నూతన వస్త్రాలతో వూటుకూరి దంపతులను సత్కరించారు.
డా వూటుకూరి గారి ఘన భగీరధ ప్రయత్నాలకు, చేసిన ఎనలేని కృషిచేసిని అభినందిస్తూ ఆస్ట్రేలియాతెలుగు సాహితీ సమాఖ్య, ప్రేక్షకుల చప్పట్ల మధ్య- ఒక విశిష్ట జ్ఞాపిక ప్రధానం చేసింది. డా వూటుకూరి గారు తమ స్పందన తెలియచేస్తూ, ఇంత భారీ ఎత్తున తన పుస్తక ఆవిష్కరణ జరగడం, ఇంతమంది దాని విలువను గూర్చి ప్రసంగించడం తనకు ఎంతో ఆనందాన్ని, ఆశ్చరియాన్ని కలుగచేసినదని చెప్పారు . చిన్ననాటి నుండి తెలుగు పాటలపై తనకు గల మక్కువ, మారుతున్న సాంకేతికతను అందబుచ్చుకొంటూ తను ఏ విధంగా పాటల సేకరణ చేశారో, అందులో ఎదురైన కొన్ని సవాళ్లు ముచ్చటించారు. ఆయన అనుభవాల పునశ్చ్రరణతో శ్రోతలు ఎంతో ముగ్ధులయ్యారు. శ్రీ ప్రసాద్ మరియు రమేశ్ వూటుకూరు గార్ల వందన సమర్పణతో కార్యక్రమం దిగ్విజయంగా, సిడ్నీ తెలుగు చరిత్రకు ఒక మైలురాయిని సృజిస్తూ, ముగిసినదని చెప్పడానికి నాకు చాలా ఆనందంగా ఉన్నది. ముందు ముందు ఇటువంటి సాహితీ కార్యక్రమాలు నిర్వహించడానికి ఇది ప్రోత్సాహక పాత్ర వహిస్తుందని తెలియచేస్తూ, జనరంజినికి మరొక్క సారి ధన్యవాదాలు తెలియచేస్తూ, మీ నుంచి సెలవు తీస్తుకొంటున్నది.
ఇదివరకు శ్రీ ఉటుకూరు సత్యనారాయణ గారి గురించిన వ్యాసం ఈ క్రింది లింకులో చదువగలరు.
http://www.telugumalli.com/news/ఎన్సైక్లోపీడియా-అఫ్-తెలు/
—సారధి మోటమర్రి.