చిక్కుల్లో దృశ్యం ..?

చిక్కుల్లో దృశ్యం ..?

ఇటీవల ఒక తెలుగు సినిమా నిర్మాతకు టిప్స్ ఇండస్ట్రీస్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే కదా. ఇప్పుడు మరో సినిమాకు సమస్యలు మొదలయ్యాయి. బ్లాక్ బస్టర్ మూవీ అయిన దృశ్యం చిత్రం మలయాళం నిర్మాతలకు బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ లీగల్ నోటీస్ పంపారు. మలయాళం చిత్రం కథ ఒరిజినల్ స్క్రిప్ట్ కాదని, అదొక జపాన్ నవల (ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్) మూలమని, ఆ జపాన్ నవల హక్కులు పొందిన తాను హిందీలో సినిమాగా తియ్యాలనుకున్నానని, కనుక దృశ్యం మలయాళం నిర్మాతకు నోటీసులు పంపుతున్నానని, పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసారు ఏక్తా కపూర్. ఈ క్రమంలో దృశ్యం తెలుగు నిర్మాత కూడా లీగల్ గా సమస్యలు ఎదుర్కొనే అవకాశం లేకపోలేదు.

తెలుగులో రీమేక్ అయి విజయవంతంగా ఆడుతున్న దృశ్యం నిర్మాత సురేష్ బాబు ఈ విషయమై స్పందిస్తూ ఈ విషయం కొన్ని రోజులుగా నలుగుతోందని, ఇప్పుడు బయటకు వచ్చిందని అన్నారు. మలయాళంలో తీసిన దృశ్యం నిర్మాత, రచయితకు ఏక్తా కపూర్ లాయర్ నుంచి నోటీసులు అందినట్టు నా దృష్టికి వచ్చిందన్నారు. ఈ నోటీసుకి దృశ్యం మలయాళం నిర్మాత జవాబు ఇచ్చారని సురేష్ బాబు చెప్పారు. కానీ ఒక విషయం … ఏక్తా కపూర్ హిందీలో సినిమాగా తియ్యడానికి మాత్రమే హక్కులు కొనుగోలు చేసారని, అయితే మా సినిమాలు మలయాళం, తెలుగు భాషల్లో తీసినవని అన్నారు. ఇప్పటికింకా ఈ సమస్య చర్చల్లోనే ఉందని, ఏక్తా కపూర్ లాయర్ నుంచి తిరుగు జవాబు వచ్చిన దానిని బట్టి తదుపరి చర్య ఉంటుందని ఆయన తెలిపారు.

ఏక్తా కపూర్ అంతర్జాతీయంగా చిత్రాలను రీమేక్ చేస్తారన్న విషయం అందరికి తెలిసిందేనని, ఆ సినిమాకు వచ్చే క్రెడిట్ ని ఏక్తా సొంతం చేసుకుంటారన్న విషయమూ అందరికీ తెలిసిందేనని, ఈ వ్యవహార శైలి దీర్ఘ కాలంగా కొనసాగుతున్నదేనని ఆయన చెప్పారు. కానీ ఏక్తా కపూర్ దీని నుంచి ఏం ఆశిస్తున్నారో తనకు తెలియడం లేదని చెప్పారు.

బహుశా కారణం ఇదే అయి ఉండవచ్చని, ఆమె సినిమా హిందీలో వచ్చేసరికి చూసిన వారందరూ మలయాళం, తెలుగు దృశ్యం సినిమాలకు రీమేక్ గా అనుకుంటారేమోనని ఆమె ఫీల్ అయి ఉండవచ్చని, అయినా మలయాళం నిర్మాతలు ఈ వ్యవహారంలో గట్టిగానే సమర్ధించుకునే వీలు ఉందన్నారు. మరి ఏక్తా కపూర్ లాయర్లు ఏ విధంగా ప్రతిస్పందిస్తారో చూడాలని సురేష్ బాబు చెప్పారు.

Send a Comment

Your email address will not be published.