వయసు చూస్తే 16 ఏళ్ళు దాటలేదు. గణన (Computer) యంత్రానికి గణాంకాలు నేర్పాడు. సైబర్ సెక్యురిటీలో గగన తలాన్ని దాటాడు. సమాజ సమస్యలు తనవేననుకున్నాడు. సమసమాజం పట్ల సానుభూతితో స్పందించాడు. సాంకేతికను జోడించి పరిష్కారాలు కనుగొనాలని తహతహలాడుతున్నాడు. కృత్రిమ వివేకం (Artificial Intelligence) తెలుగువారి ఆవకాయ ముద్దలా అస్వాదించాడు. తన మేదోమధనంతో రోబోలను సృష్టించాడు. బుడతడైనా ఆస్ట్రేలియాలో కంప్యూటర్ దిగ్గజంగా ఎదిగాడు. Kite Technologies మరియు Kaushal Ottem Innovations అన్న రెండు సంస్థలను నెలకొల్పాడు. ఇవి కాకుండా మరో 44 కంపెనీలకు సంచాలకుడుగా నియమింపబడ్డాడు. యుక్తవయసు పూర్తి కాకముందే పలువురికి స్పూర్తిదాయకంగా నిలుస్తున్నాడు.
పేరు కౌశల్ రెడ్డి ఒట్టెం. ఈ సంవత్సరమే 10వ తరగతి పూర్తి చేసాడు. మెల్బోర్న్ లోని ప్రముఖ సాంకేతిక విశ్వవిద్యాలయం RMIT వారు Accelerated Bachelors in Advanced Computer Science in Cloud Technology లో ప్రవేశమిచ్చి 20 ఏళ్ళు రాకముందే పట్టబద్రుడు కావడానికి అవకాశమిచ్చారు.
తొమ్మిదేళ్ళ వయసులో యాదృచ్చికంగా కంప్యూటర్ వైపు తొలి అడుగులు వేయడం జరిగింది. తండ్రి ఇచ్చిన ఐపాడ్ లో తెలిసీ తెలియని ఆటలుంటే సరదాగా ఆడుకునే వయసు. అయితే అట అడుతూనే ఆటపైన దృష్టి అది కంప్యూటర్ లో ఎలా నడుస్తుందన్న కుతూహలం కలిగి రహస్య చేదనలో మనస్సు లగ్నం చేసాడు. తల్లి భారత దేశంలో ఉన్నపుడు కంప్యూటర్ రంగంలో అధ్యాపకురాలుగా పనిచేయడం వలన ఆస్ట్రేలియా వచ్చిన క్రొత్తలో ఆ పుస్తకాలు తన దృష్టిలో పడి సరదాగా అప్పుడప్పుడూ తనకి తానుగా చదవడం మొదలుపెట్టాడు కౌశల్. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్నట్లు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లో C మరియు C++ కోడింగ్ భాషలనే ముందు నేర్చుకున్నాడు. ఆ నేర్చుకోవడంలోనే క్రికెట్ గేమ్ ని వ్రాయడం జరిగింది. ప్రస్తుతం ఈ గేమ్ ని 70 మిల్లియన్ సార్లు డౌన్లోడ్ చేసినట్లు చెప్పాడు కౌశల్. కంప్యూటర్ రంగంలో సుమారు 700 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లున్నాయని వాటిలో 90 వరకూ తాను నేర్చుకున్నట్లు చెప్పాడు కౌశల్. ఈ తొంబైలో 47 భాషలు క్షుణ్ణంగా తనకు తెలుసట.
తాను స్థాపించిన రెండు కంపెనీలలో ప్రపంచంలోని ఎన్నో దేశాలకు చెందిన 3,000 మంది పూర్తీ స్థాయి ఉద్యోగులుగా, కాంట్రాక్టర్లుగా పనిచేస్తున్నారు. ఇందులో R&D విభాగం కూడా ఉంది. కొన్ని ప్రాజెక్టులకు కాపిటల్ ఇన్వెస్టర్స్ ధనసహాయం చేస్తుంటారని వారి అవసరానికి సరిపోయిన కొన్ని ప్రత్యేక ప్రాజెక్టులు అందజేయడం కూడా జరుగుతుంది.
వచ్చే సంవత్సరం అమెరికాలో జరగబోయే IoT కాన్ఫరెన్సుకి ప్రపంచంలోని అత్యుత్తమమైన 200 మంది డెవెలపర్స్ ని ఆహ్వానించినట్లు వారిలో తన పేరు కూడా ఉండడం తనకి ఎంతో ఆనందదాయకంగా ఉందని కౌశల్ చెప్పాడు.
క్రొత్త ప్రాజెక్టుల్లో లాభాపేక్ష లేకుండా చాలామంది ఆల్జిమఎర్స్ తో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులకు GPS ట్రాకింగ్ ద్వారా ఎమెర్జెన్సి కాంటాక్ట్ కి అప్రమత్తపరచడానికి అవకాశం ఉంటుంది. ఇదేకోవలో అంతర్జాతీయ విద్యార్ధుల సలహా సమావేశాల కోసం మరో అప్లికేషను రూపొందించినట్లు కౌశల్ చెప్పాడు.
భవిష్యత్ కార్యక్రమంగా ‘టెక్నాలజీ ఫార్మింగ్’ తో భారతదేశంలోనూ మరియు ఆస్ట్రేలియా లోనూ రైతులకు కొంత ముందస్తు సమాచారం అందించి సహాయపడాలని అనుకుంటున్నట్లు కౌశల్ చెప్పాడు. ఈ ప్రాజెక్టు 2020 మొదటి భాగంలో పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ప్రస్తుత కాలంలో అంతర్జాల బద్రత (Internet Security) చాలా ముఖ్యమైన అంశంగా పరిగణింపబడుతుంది గనుక ఈ రంగంలో ఎక్కువ పరిశోధన జరిపి బ్యాంకింగ్ రంగానికి తన సేవలందించాలని అనుకుంటున్నట్లు కౌశల్ చెప్పాడు.
• సిటీ అఫ్ విందం వారు యూత్ అంబాసడర్ గా నియమించారు
• టెలీ కమ్యూనికేషన్స్ సంచాలకులుగా నియమించడం జరిగింది
కౌశల్ మరింత ఎదిగి తన పరిశోధనలు మానవ వికాశానికి, మానవాళి పురోభివృద్ధికి ఉపయోగపడి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని తెలుగుమల్లి ఆశిస్తోంది.