చిరు జ్ఞాపకాలు

ఎంతవారైనా ఎదిగి పెద్దయిన తరువాత ‘ఆ చిన్ననాటి రోజులు మళ్ళీ రావు’ అని అంటూ ఉంటారు. ఈ మాట ఏ కాలానికైనా వర్తిస్తుంది. అయితే ఆ చిన్ననాటి రోజుల్లోనే పరకాయ ప్రవేశం చేస్తే… ఎంత మజాగా ఉంటుంది!

అవును మరి. చాలామంది తెలుగువాళ్ళు పల్లెల నుండి రావడమో లేక బామ్మలు, తాతయ్యలు పల్లెల్లో నివాసం ఉండబట్టి పల్లెటూళ్ళు సరదాగా వెళ్లి రావడమో చేసి ఉంటారు. పట్నంలో ఎన్ని సదుపాయాలున్నా పల్లె వాసనలు ఆస్వాదించి ఆనందించని వారుండరు. ఎందుకంటే పల్లెల్లోని జీవన విధానం అటువంటిది. సహజమైన, స్వభావ సిద్ధమైన, స్వచ్చత గల వస్తువులు అక్కడ దొరుకుతాయి. అక్కడ మనుషులు కూడా అలానే ఉంటారు. అమాయకత్వం, నమ్మకం, కల్మషంలేని మనస్తత్వాలు.

పల్లెటూళ్ళల్లో వీధి అరుగులు మీద ముఖ్యంగా ఎండాకాలం పిల్లలందరూ కలిసి ఎన్నో రకాల ఆటలు ఆడే వారు. అవి ఇప్పటి బోర్డు గేమ్స్ లాగానే ఉంటాయి. అష్టా-చెమ్మ, పులి-జూదం (మేక-పులి అని కూడా అంటారు), దాడి-దిక్కిడి, చదరంగం(ఇది చెస్ కాదండోయ్) ఇలా రకరకాల ఆటలు ఆడుకునేవారు. అయితే ఈ ఆటలు ఆడడానికి ఎంతో చతురత కావాలి. ఎత్తులకు పైఎత్తులు, ప్రత్యర్ధి కదిపే పావులు, స్వంత బలగాల అంచనాలు, సమయ స్పూర్తి – ఇలా ఎన్నో రకాలైన మేధాశక్తితో కూడుకున్న ఆటలు ఇవి. ఇందులో కొన్నింటి గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు.

అష్టా-చెమ్మ

ashtaachammajunior (1)Ashta-Chemma
ఈ ఆట దక్షిణ భారత దేశంలో వివిధ రకాలైన పేర్లతో చాలా ప్రచారం పొంది ప్రజాదరణ గల ఆటగా ప్రసిద్ధికెక్కింది. కర్ణాటకలో చౌక బార, కట్టె మనె, చక్క గా, కేరళలో పకిడికలిగా, తమిళనాడులో దాయం గా ఇంకా మధ్య ప్రదేశ్, గుజరాత్ మరియు రాజస్థాన్ లలో ఇతర పేర్లుతో పిలవబడుతుంది.

ఈ ఆటలో ఇద్దరు నుంచి నలుగురు ఆటగాళ్ళు, పటానికి నాలుగు వైపులా కూర్చొని ఆడతారు. ఏ ఆటగాడి నప్పులు ముందుగా గమ్యస్థానాన్ని చేరుకొంటే అతడే విజేత. ఆటగాడు తన నాలుగు నప్పుల్లో దేనిని జరుపుతాడు అనేది అతని ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. కానీ ఒకసారికి ఒక నప్పునే జరుపవలసి ఉంటుంది. ఈ ఆటలో నియమాలు ఇవే అయితే మజా ఏముంటుంది..? అసలు మజా అల్లా ఒక ఆటగాడి నప్పులను మరొకరు చంపుకోవడంలో ఉంటుంది. ఒక ఆటగాడి నప్పు “X” గుర్తు లేని గడిలో ఉన్నప్పుడు, రెండవ ఆటగాడి నప్పు అదే గడిలోకి వచ్చి చేరితే, రెండవ ఆటగాడి నప్పు, మొదటి ఆటగాడి నప్పును చంపినట్టు లెక్క. అప్పుడు మొదటి ఆటగాడి ఆ నప్పు, అతని ఇంటికి చేరుతుంది..!! ఆ నప్పును అతడు మరల మొదటినుంచే నడుపుకు రావలసి ఉంటుంది. “X” గుర్తు గడిలో ఉన్న నప్పును ఏ నప్పూ చంపలేదు. ఇలా ఒకరి నప్పులు ఒకరు చంపుకొంటూ, కసితో, ఉత్సాహంతో, రసవత్తరంగా సాగుతుంది ఈ ఆట.

పులి-జూదం (మేక-పులి):

Pulijudam_type-2Puli_Joodam_1 (1)

ఈ ఆట ఆడుటకు కావలసినవి…
1. పులి జూదం చిత్రం
2. నాలుగు గచ్చకాయలు
3. పద్దెనిమిది చింత బిచ్చలు.
పులి జూదం చిత్రం రెండు అభిముఖ లంబకోణ త్రిభుజాల సమ్మేళనం. దీనిలో రెండు దీర్ఘచతురస్రాలు అడ్డంగా అమరి ఉంటాయి. పులి జూదం చిత్రాన్ని కొందరు లావుపాటి అట్ట మీద గీసుకొని ఆడుతారు. ఎక్కువమంది, పరిచిన బండలపై పులి జూదం చిత్రాన్ని గీసి, ఆడుతారు. గచ్చకాయలకు, చింత బిచ్చలు (చింతపిచ్చలు) బదులుగా వాటి పరిమాణంలోని రాళ్ళతో కూడా ఆడుతారు. గచ్చకాయలు, చింత బిచ్చల సంఖ్య కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉండటాన్ని గమనించ వచ్చు. గచ్చకాయలను పులులుగా, చింత బిచ్చలను మేకలుగా వ్యవహరిస్తారు.
ఆటగాళ్ళ సంఖ్య
ఈ ఆట ఇద్దరు మాత్రమే ఆడే వీలు ఉంటుంది. ఆ ఇద్దరికి పక్కవాళ్ళు మద్దతుదారులుగా సలహాలు ఇవ్వవచ్చు.
ఆట నియమాలు
1. పులి జూదం ఇద్దరు మాత్రమే ఆడాలి.
2. ఆటగాళ్ళలో ఒకరు గచ్చకాయల (పులుల) తో, మరొకరు చింతబిచ్చల (మేకల) తో ఆడాలి.
3. త్రిభుజాకారంలోని మధ్య గీతపై నాలుగు పులులు ముందుగానే పెట్ట బడి ఉంటాయి.
4. ముందుగా మేకలతో ఆడే వ్యక్తి పులలకి అన్ని వైపుల సమీపంలోని బిందువలను వదిలిపెట్టి, తరువాతి బిందువు స్థానంలో ఒక మేకను ఉంచుతాడు.
5. పులలతో ఆడే వ్యక్తి తరువాత ఒక పులిని మేక సమీపానికి దగ్గరలోని బిందువు దగ్గరకు జరుపుతాడు.
6. మేకలతో ఆడే వ్యక్తి మరో మేకను పులలకు దూరంగా ఇంకో చోట ఉంచుతాడు.
ఈ విధంగా 18 (18:4;15:3;1:3) మేకలు అయిపోయెవరకు మేకలతో ఆడేవాడు పెడుతూ పోతే, పులతో ఆడేవాడు జరుపుతూ పోతాడు. తదుపరి ఆట రసకందాయకంలో పడుతుంది. పులికి సమీపంలో ఏదేని మేక ఉండి దాని తరువాత బిందువు ఖాలిగా ఉంటే మేకను, పులి చంపుతుంది. ఆవిధంగా మేకలను ఎక్కువగా పులులు చంపుతూ పోతే పులులతో ఆడేవాడు గెలిచినట్లు. పులులు ఎక్కడకు కదలటానికి వీలులేకుండా మేకలతో బందిస్తే మేకలతో ఆడేవాడు గెలిచినట్లు

ఆట ప్రాచీనత
ఈ ఆటలు కాకతీయుల కాలం నాటి నుండి ఉన్నట్లు తెలుస్తుందొ.[4]. తరువాత రెడ్డి రాజుల పాలనలో మరింత విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చాయి. ప్రజలకు వినోద వ్యాపకాలుగా మారాయి. చదరంగానికి ఏ విధంగానూ తీసిపోని ఈ ఆట పిల్లల ఆలోచనా నైపుణ్యాన్ని పెంచుతుందనుటలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

Send a Comment

Your email address will not be published.