నా కాలపు కలలు చూపించే దృశ్యాలలో ఒక వాక్యాన్ని
నా ఊపిరి పరిమళాన్ని వెదజల్లే ఒక వాక్యాన్ని
ఇక్కడే ఇందులో ఉందనిపిస్తోంది….
ఈ మాటలలో ఎక్కడో అక్కడ నర్మగర్భంగా ఒదిగి ఉంది
నా చివరి కవితలోని మొదటి వాక్యాన్ని ఇప్పటికే రాసేసాను
నిరాకారంగా గుర్తుపెట్టుకోవడం కోసం
నానా తంటాలు పడి ఆ వాక్యాన్ని రాసేసాను
ఇప్పుడు ఆ వాక్యం
కాగితం నుంచి ఆకుల నరాలలోనుంచి చోటు మారి
బయటకు వచ్చింది
కాగితంలో పరుగులు తీసింది నరమా?
ఆకుమీద చోటు చూసుకున్నది వాక్యమా ?
ఒక్కో నరంలోను ఒక కొమ్మ
ఒక్కో కొమ్మలోను ఒక్కో ఆకు
కాగితం బయట ఊడలతో తలెత్తుకు నిల్చుంది మర్రి వృక్షం
గాలిలో సంచరిస్తోంది
నా ఊపిరి పరిమళాన్ని వెదజల్లే ఒక వాక్యం
ఆకులలో కనిపిస్తున్నాయి
కలలు చూపించే దృశ్యాల ఒక వాక్యం
అది
నా చివరి కవితలోని మొదటి వాక్యం
– అనుష అను