మళ్ళీ ఆమెను చూసాను
చాలా కాలం తర్వాత ఈరోజు
చూడకూదనుకున్న రీతిలో చూసాను
విద్యుత్ లేని నగరంలా
ఆమె కళ్ళు చీకటిగా ఉన్నాయి
ఉదయం జడలో తురుముకున్న పువ్వు
సాయంత్రానికి వాడిపోతే ఎలా ఉంటుందో
అలా ఉంది ఆమెలో ఉత్సాహం వడలిపోయి
ఒడ్డుకి కొట్టుకు వచ్చిన చేపపిల్లలా
గిజగిజా కొట్టుకుంటోంది
ఆమె తొట్రుపాటు
చిరిగి పోయి
మురికిపట్టి మాసిపోయిన చీరలా ఉంది
ఆమె రూపం
ఇక చేపడానికి
ఏమీ లేదన్న మాటల్లా ఉంది ఆమె
ముఖం
ఆమెలో అస్తమించిపోయిన
మాట
భౌతికకాయాన్ని పాతిపెట్టిన సమాధిలా
ఒక్కసారి కాళ్ళ ముందు కదలాడి
ఆలోచనలోకి నెట్టేసింది నన్ను
ఆమె స్థితి
ఏదీ చెప్పకుండానే
అర్ధమైపోయింది
ఈ జాలి లేని లోకంలో
నేను దేవుడినై ఉంటే
ఇలాగా కనిపించేది ఆమె
ఎన్నెన్ని కలలు కన్నామో
ఎన్నెన్ని ఊసులు చెప్పుకున్నామో
ఎన్నెన్ని కలయికలు సాగాయో
అన్నీనూ
ఓ తొందరపాటుతో చెదరిపోయి
జీవచ్చవంలా మారిపోయాం
ఇద్దరం
ఆమె దూరమైన రోజే
నేనూ మరణించాను
మానసికంగా
– యామిజాల జగదీశ్