మిట్టపల్లి సురేందర్
రాతి బొమ్మల్లో కొలువైన శివుడా
రక్తబంధం విలువ నీకు తెలియదురా
నుదుటి రాతలు వ్రాసే ఓ బ్రహ్మ దేవా
తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా
తెలిసుంటే చెట్టంత నా కొడుకును
తిరిగి తెచ్చివ్వగలవా నీ మహిమలు ||రాతి..
పూవులో పూవునై నీ పూజ చేసాను
నీరునై నీ అడుగు పాదాలు కడిగాను
ఒక్క పొద్దును ఉంటు ముడుపు చెల్లించాను
దిక్కు నీవని మొక్కి ధీమాగా ఉన్నాను
తొలుసూరు కొడుకని ఈశ్వరా
నీ పేరు పెట్టుకుంటే శంకరా
అందుకే వేసావ ఈ శిక్షను
అమర వీరుణ్ణి చేసావా శ్రీకాంత్ ను ||రాతి..
“పోరు తెలంగాణా” చిత్రంలో వ్రాసిన పై పాటకు 2011 లో నంది అవార్డు అందుకున్నారు.
పుస్తకాల్లోని చదువు రాదు పొమ్మంటే జీవితాన్నే చదవడం మొదలెట్టాడు. సాహిత్యంలో ఎన్నో మెట్లెక్కాడు. సాహిత్యానికి తనకున్న సంగీత జ్ఞానం అనుసంధానం చేసాడు. చిన్నప్పటినుండి సినిమా సాహిత్యం పట్ల మక్కువతో పాటలు వినడం, పాడటం అలవడి తాను వ్రాసిన పాటలకు సంగీత బాణీలు కట్టడం అలవరుచుకున్నాడు. పదాల గారడీకి పల్లవులతో జోడించాడు. జానపదాలకు, జనపదాలకు నిలయమైన ఓరుగల్లు ఖిల్లాలో తన సాహితీ మువ్వలు ఘల్లుమనిపించాడు. పల్లె పదాల సవ్వడిలో పరవశించాడు. పల్లె జనాల నాలుకపై నాట్యమాడాడు. జనసంద్రం జాతరలో జావళీలు వినిపించాడు. జగమేలు ప్రభువుకి జేజేలు పలికాడు.
పల్లె వాసుల్లోని అరమరికలు లేని అమాయకత్వపు వాసనలు వెదజల్లే జానపదాలను గుండె లోతుల్లోంచి పెళ్లుబికించి జనపదాలుగా తన కలం నుంచి జాలువారి విప్లవ గీతాలుగా మలచిన చైతన్య మూర్తి. పల్లె గుండె చప్పుళ్ళు ఆనంద తాండవంలో తేలియాడుతూ పరవశంతో అమర వీరులకు వందనాలర్పించే చైతన్య గీతాలకు అక్షర రూపమిచ్చి ఊపిరి పోసిన ఉత్తేజ మూర్తి. అమ్మకి దూరమైన బిడ్డ ఆవేదనను గుండెకు హత్తుకునేలా వర్ణించి శ్రోతలను శోక సంద్రంలోకి తీసుకెళ్ళగల కవనధారి.
మిట్టపల్లి సురేందర్. ఒకప్పుడు గాలికి తిరిగి సినిమా పాటలు వింటూ స్నానాల గదిలో కూనిరాగాలతో పాడుకునే నేపధ్యం. బడిలో చదువు అబ్బలేదు కానీ సంస్కారం నేర్చుకున్నాడు. చదివింది 8వ తరగతి. అంతకంటే ముందుకెళ్ళాలంటే రాకెట్ లేకుండా చంద్రమండలానికి చేరుకోవాలన్న ఆశల పల్లకిలో తెలియాడడమే.
జీవితంలో యాదృచ్చికంగా జరిగిన సంఘటన తన జీవితాన్నే మార్చేసింది. పరిస్థితులు, పరిసరాలకు తన మనసు అక్షర రూపంలో స్పందించి ఒక అద్భుతమైన భావకవిత్వంగా రూపు దిద్దుకుంది. అయితే తొలి రోజుల్లో అది తన డైరీకే పరిమితమైపోయింది. తనకు తెలియకుండా పెదనాన్న కుమారుడు ప్రయత్నం వలన ఒక మంచి సంగీత బాణీతో తిరిగి తన చెవికి వినపడింది. అంతా ఒక కలలా జరిగిపోయింది. అదే నాందిగా తిరుగులేని గాయకుడుగా ఈ రోజు అంతర్జాతీయ స్థాయి కవి-గాయకుడుగా ఎదగడానికి దారి చూపింది.
మెల్బోర్న్ తెలంగాణా ఫోరం బతుకమ్మ సంబరాలకు ఇక్కడికి వచ్చిన శ్రీ సురేందర్ తెలుగుమల్లితో ప్రత్యేకంగా ముచ్చటిస్తూ 1980 – 90 దశకంలో వచ్చిన సినిమాల్లోని సంగీత సాహిత్యం తనకు ఎంతగానో ప్రభావితం చేసిందని చెప్పారు. ఒక కవిగా, గాయకుడుగా జనం గుండెల్లో చెరగని ముద్ర వేసిన సురేందర్ తన పాటలు, గేయాల రచన బతుకమ్మ పాటలకు, తెలంగాణా ఉద్యమ గీతాలకు కూడా వ్యాపింపజేసి తెలంగాణా జానపద రచయితల సరసన తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.
అతి పిన్న వయసులోనే చిత్రసీమలోనడుగిడి అద్భుతమైన గీతాలు వ్రాసిన హస్తం శ్రీ మిట్టపల్లి సురేందర్ ది. ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, రచయితలతో పని చేసి సాహిత్య పరమైన మంచి పాటలు వ్రాసి తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటిచెప్పిన సురేందర్ భావితరాలకు స్పూర్తిదాయకంగా నిలుస్తారని ఆశిద్దాం.