టెక్నీషియన్ అవుదాని హీరోనయ్యా

టెక్నీషియన్ అవుదాని హీరోనయ్యా

ఘనంగా “కాటమరాయుడు” సినిమా ప్రీ రిలీజ్ వేడుకలు
——————————————–

టెక్నీషియన్ అవుదామనుకుని హీరో అయ్యానని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. అయినా తనకు ఏ పని ఇచ్చినాసరే తోట పనైనా వీధులు ఊడ్చే పనైనా సరే ఏ మొహమాటం లేకుండా చేస్తానని చెప్పారు. సినిమాలు సైతం ఆ భగవంతుడు ఇచ్చిన పనే అని, అందుకే ఇన్ని సంవత్సరాలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేశానని తెలిపారు.

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కాటమరాయుడు సినిమా ప్రీ రిలీజ్ వేడుకలు హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఘనంగా జరిగాయి. అభిమానులతో కిక్కిరిసిపోయిన ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు …

భవిష్యత్తులో తనకు ఎలాంటి భాద్యతలు వచ్చినా తాను ఆ దేవుడిచ్చిన పనిగానే భావిస్తానని పవన్ చెప్పారు. గోకులంలో సీత చిత్రంలో అసిస్టెంట్ రైటర్ గా త్రివిక్రమ్ పని చేసినప్పటి నుంచి ఆయనతో పరిచయం ఉందన్నారు. సినిమా, తన జీవితానికీ మధ్య చాలా పోలికలున్నాయని చెప్తూ వయసులో ఉన్నప్పుడు ప్రేమనే ఆలోచన ఉంటుందని, ఆ సమయంలో “తొలిప్రేమ” స్క్రిప్ట్ తన దగ్గరకు వచ్చినట్టు చెప్పారు. తన మనసులోని భావాలకు తగినట్లుగా తనకు సినిమాలు రావడం తన భాగ్యమన్నారు.

దేవుడి ముందు ఎప్పుడు చేయి చాచి నువ్వు ఏది ఇస్తే అది తీసుకుంటాననేలా ఉన్నానని, తనకు గెలుపోటములను సమానంగా చూసేలా ఉండగలుగుతున్నానని తెలిపారు. తన దృష్టిలో అన్నయ్య చిరంజీవియే హీరో అని చెప్పారు. తాను ప్రతి సినిమాకు ఎంతో కష్టపడి పని చేసినట్టు చెప్పారు.ఇప్పుడు కాటమరాయుడు చిత్రంలో నటించిన తమ్ముళ్ళు తన ప్రాణమని, స్టంట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి తదితరులందరికీ ధన్యవాదాలని పవన్ చెప్పారు.

ఈ కార్యక్రమంలో బండ్ల గణేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్, టీవీ9 రవి ప్రకాష్ తదితరులు ప్రసంగించారు.
వేదికపై ఆడియో సీడీని త్రివిక్రమ్ విడుదల చేసి తొలి సీడీని పవన్ కళ్యాణ్ కి ఇచ్చారు.

Send a Comment

Your email address will not be published.