ట్రెండ్ సెట్టర్ నటకిరీటి

ట్రెండ్ సెట్టర్ నటకిరీటి

తెలుగు సినిమాకు ట్రెండ్ సెట్టర్ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్
జూలై 19 ఆయన పుట్టినరోజు

Rajendra_Prasad_at_QGM_audio_launch

ఒకప్పుడు తెలుగు సినిమాల్లో హీరోలు వేరు… కమెడియన్లు వేరు! కానీ రాజేంద్ర ప్రసాద్ రాకతో వీరిద్దరూ ఒక్కరే అయిపోయారు. హీరోనే కామెడీ పండించడం ఓ ఎత్తు అయితే సినిమా అంతా వినోదమే పరుచుకోవడం మరో ఎత్తు అయ్యింది. అలా తెలుగు సినిమాల్లో కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసి నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఓ సామాన్య కుటుంబంలోనే పుట్టాడు. అయితే అతని బాల్యం, యవ్వనం అంతా నిమ్మకూరులోని మహానటుడు ఎన్టీయార్ ఇంటి ఆవరణలో జరగడమే ఓ విశొషం.

రాజేంద్రప్రసాద్ క్రిష్ణా జిల్లా గుడివాడకు దగ్గర్లోని దొండపాడు గ్రామంలో జూలై 19న ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు గద్దె వెంకట నారాయణ, మాణిక్యాంబ. చిన్నప్పటి నుంచే అతనిపై ఎన్. టి. ఆర్ ప్రభావం పడింది. సినీ పరిశ్రమలో ప్రవేశించక మునుపు సిరామిక్ ఇంజనీరింగ్ లో డిప్లోమా పూర్తి చేశాడు

ఎన్టీఆర్ ప్రేరణతో
appu chesi pappukooduఎన్టీఆర్ తో చిన్నప్పటి నుంచి ఉన్న పరిచయంతో నటనపై రాజేంద్రప్రసాద్ ఆసక్తిని గమనించి ఆయనే చెన్నైలోని ఓ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లో చేర్పించాడు. ఎన్టీయార్ సలహాతోనే 1977లో సినిమాల్లో ప్రవేశించాడు. నటుడిగా రాజేంద్రప్రసాద్ తొలిచిత్రం బాపు దర్శకత్వంలో స్నేహం అనే సినిమా 1977 సెప్టెంబరు 5 న విడుదలైంది. ఆ తర్వాత మంచుపల్లకి, ఈ చరిత్ర ఏ సిరాతో, పెళ్ళి చూపులు, రామరాజ్యంలో భీమరాజు వంటి సినిమాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. రాజేంద్రప్రసాద్ హాస్యాన్నే ప్రధానంశంగా తీసుకుని సినిమాలు చేసి, విజయం సాధించి, కథానాయకుడిగా ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. నటుడిగా వివిధ భాషలలో రెండు వందల పైచిలుకు చిత్రాల్లో నటించాడు. నందమూరి తారకరామారావు స్ఫూర్తితో సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన రాజేంద్రప్రసాద్ ప్రేమించు పెళ్లాడు సినిమాతో హీరోగా మారాడు. కారెక్టర్ నటులు మాత్రమే కామెడీని పండిస్తున్న రోజుల్లో హీరో కూడా నవ్వుల్ని వండివార్చగలడు అని నిరూపించాడు రాజేంద్రప్రసాద్. జంధ్యాల, రేలంగి నరసింహారావు, ఈవీవీ సత్యనారాయణ, బాపు లాంటి వారి దర్శకత్వంలో నటించిన ఘనత రాజేంద్రప్రసాదుది.

లేడీస్ టైలర్ తో బ్రేక్
సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో దర్శకుడు వంశీ ద్వారా ‘లేడీస్ టైలర్’ రూపంలో అదృష్టం తలుపు తట్టింది. ఆ తర్వాత అదే కాంబినేషన్ లో వచ్చిన ‘ప్రేమించి చూడు…’, ‘ఏప్రిల్ ఒకటి విడుదల’ చిత్రాలతో ఇక నవ్వుల తుఫాన్ కు తెరతీసినట్టు అయ్యింది.  తెలుగు చిత్రసీమలో ఎనిమిదో దశకం వరకూ హీరోలు నడిచిన తీరు వేరు. కానీ రాజేంద్ర ప్రసాద్ ఆ ట్రాక్ లోకి వచ్చాక, దాని రూట్ ను మార్చాడు. కామెడీ హీరో అనే కొత్త ట్రాక్ లోకి హీరోయిజాన్ని నడిపించాడు. అంతకు ముందు ఒకరిద్దరు కమెడియన్లు ఈ దారిలో ప్రయాణం చేసినా… సెంటిమెంట్ తో సక్సెస్ సాధించారు తప్పితే… కామెడీతో కాదు! కానీ రాజేంద్ర ప్రసాద్ కామెడీ హీరోల రేంజ్ పెంచేశాడు. వంశీ, జంధ్యాల, రేలంగి నరసింహరావు, విజయ బాపినీడు, ఇవీవీ, ఎస్వీ కృష్ణారెడ్డి వంటి దర్శకుల సహకారంతో కామెడీ హీరో నుండి స్టార్ కామెడీ హీరో స్థాయికి చేరుకున్నాడు. ఒకానొక సమయంలో అతనితో పాటు సమానంగా కామెడీని పండించకపోతే…. హీరోగా నిలబడలేమేమోననే భయాన్నీ తోటి హీరోలలో కలిగించాడు… కొందరైతే అదే బాటలో ప్రయాణమూ మొదలెట్టారు. దటీజ్ రాజేంద్ర ప్రసాద్!! దశాబ్దాల పాటు కామెడీని పండించి ‘హాస్యరాష్ట్రపతి’ అని పించుకున్న రాజేంద్ర ప్రసాద్… నటకిరీటిగానూ పేరు తెచ్చుకున్నాడు. స్టార్ కమెడియన్ గా రాణిస్తున్న సమయంలోనే ‘ఎర్రమందారం’ చిత్రంలో అద్భుత నటన ప్రదర్శించి… ఉత్తమ నటుడిగా నంది అవార్డును అందుకున్నారు. అయితే… ఆ తర్వాత తన వయసుకు తగ్గ పాత్రలను పోషించాలనే తలంపుతో కామెడీనే కాకుండా సెంటిమెంట్ నూ పండించే ప్రయత్నం చేశారు. ‘ఆ నలుగురు’, ‘మీ శ్రేయోభిలాషి’ వంటి చిత్రాలు చూసినప్పుడు రాజేంద్ర ప్రసాద్ ను తప్పితే మరొకరిని ఈ పాత్రల్లో ఊహించుకోలేం. సోలో ప్రొడ్యూసర్ గా ‘రాంబంటు’, ‘మేడమ్’ వంటి చిత్రాలను ప్రొడ్యూస్ చేసిన రాజేంద్ర ప్రసాద్ నిర్మాతగానూ తన అభిరుచిని చాటుకున్నారు! సహజంగా ఒక వయసు వచ్చిన తర్వాత నటీనటులు విశ్రాంతిని కోరుకుంటారు. కానీ రాజేంద్ర ప్రసాద్ మాత్రం అందుకు భిన్నంగా తాను నిత్య శ్రామికుడినని చాటుతున్నారు.

హాలీవుడ్లో కూడా
తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా క్విక్ గన్ మురుగన్ అనే సినిమాతో హాలీవుడ్లో కూడా నటించాడు. నటుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకునిగా సత్తా చాటాడు. మేడమ్ సినిమాలో ప్రయోగాత్మకంగా మహిళ పాత్ర పోషించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు.

వైవిధ్యమైన పాత్రల్లో
Rajendra Prasad moviestrip

రాజేంద్రప్రసాద్ నటించినన్ని వైవిధ్యమైన పాత్రలు ఇంతవరకూ ఎవరూ నటించలేదనే రికార్డుని ఆయన సొంతం చేసుకున్నారు. ట్యాప్ ర్యాంకర్స్’, ‘టామి’, ‘నూతిలో కప్పలు’, ‘దాగుడుమూతల దండాకోర్’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ కౌసల్యా కృష్ణమూర్తి, తదితర చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు రాజేంద్ర ప్రసాద్.

మరికొన్ని విశేషాలు ఆయన మాటల్లోనే…
కామెడీవైపు వెళ్లాలనే ఆలోచన..
నన్ను కామెడీ పాత్రల వైపు నడిపించింది ఎన్టీఆర్‌గారే. నన్ను మద్రాస్‌లో ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేర్పించింది ఆయనే. 0నాకు గోల్డ్‌ మెడల్‌ వచ్చింది. ఆ విషయాన్ని చెప్పడానికి ఎన్టీఆర్‌గారి దగ్గరికి వెళ్లా. ‘సంతోషం… ’ అంటూనే ‘సినిమా పరిశ్రమలో ఒకరిలాగైతే మరొకరు అక్కర్లేదు… పౌరాణికం అంటే మేమే గుర్తుకొస్తాం, సోషల్‌ పాత్రలకి అక్కినేని నాగేశ్వరరావుగారు ఉన్నారు. డిష్యుం డిష్యుం చేయాలంటే కృష్ణగారు, రొమాంటిక్‌ కథలంటే శోభన్‌బాబు ఉన్నారు. మరి ఈ సమయంలో వచ్చిన నువ్వెందుకు పనికొస్తావు? అన్నారు. ఆ మాట నన్ను ఆలోచించేలా చేసింది. ఒక రోజు మా ఇన్‌స్టిట్యూట్‌ విద్యార్థులంతా కలిసి అమెరికన్‌ కాన్సులేట్‌లో చార్లీ చాప్లిన్‌ సినిమా ఫెస్టివల్‌కి వెళ్లాం. ఆ సినిమాలు చూశాక ‘అసలు కామెడీ… హీరో ఎందుకు కాకూడదు? కామెడీ కమెడియన్‌గానే ఎందుకుండాలి? చార్లీ చాప్లిన్‌ కంటే గొప్ప హీరో, నటుడు మరొకరు ఉన్నారా?’ ఇలా ఆలోచనలు వస్తూనే నాలో కసిని పెంచాయి. చార్లీ చాప్లినే నాకు కామెడీ దారి చూపించారు. ఆయన వల్లే నేను ఇలా అయ్యానా అంటే కాలేదు. వంశీ, జంధ్యాల, రేలంగి నరసింహారావు, సింగీతం శ్రీనివాసరావు, ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి, కోదండరామిరెడ్డి, కోడి రామకృష్ణ… ఇలా ఎంతోమంది దర్శకులు నా ఆలోచనలకి తగ్గ పాత్రల్ని సృష్టించారు.

కామెడీని హీరోయిజం చేశాను
కామెడీని హీరోయిజం చేసిన ట్రెండ్‌ సెట్టర్‌ని నేను. అందుకే 42 ఏళ్లకే ఆంధ్ర విశ్వ విద్యాలయం నుంచి డాక్టరేట్‌ తీసుకొన్నా. సామాన్యుడి నుంచి ప్రధాన మంత్రి వరకు నాకు అభిమానులున్నారు. మానసికంగా కుంగిపోయిన పిల్లల నుంచి, సమయం ఎలా గడపాలో తెలియక సతమతమవుతున్న వృద్ధుల వరకు నా సినిమాల్ని చూసి హాయిగా నవ్వుకొంటారంటే అంతకంటే సంతృప్తినిచ్చే విషయం మరొకటి ఉందా? అప్పటి ప్రధాన మంత్రి పి.వి.నరసింహారావుగారు నా ఒత్తిడిని దూరం చేసే సాధనం రాజేంద్రప్రసాద్‌ సినిమా అని చెప్పేవారు.

నటుడు అప్‌డేట్‌ అవుతూ ఉండాలి
మొదటి ఫ్రేమ్‌ నుంచి చివరి ఫ్రేమ్‌ వరకు కామెడీని పండించడమనేది ఓ గొప్ప విషయం అంటూ ఇదే అంశాన్ని గుర్తు చేశాడు ఆమీర్‌ఖాన్‌. నటుడు అప్‌డేట్‌ అవుతూ ఉండాలి. అదే నా విజయ రహస్యం. సమాజంలోంచి వచ్చే పాత్రల్ని చేస్తేనే ఫలితాలు సాధ్యమవుతాయి. అప్పుల అప్పారావు, పేకాట పాపారావు హీరోలా? లేడీస్‌ టైలర్‌కి పెద్ద బద్ధకం, వాడు అసలు పనిచేయడు, అలాంటోడు హీరోనా? ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం’లో ఓ పిసినిగొట్టు. వాడు హీరోనా? కానీ సామాన్యుడికి ఆ పాత్రలు బాగా నచ్చాయి. ఎక్కడో ఒక చోట అలాంటివాడు తారసపడుతుంటాడు కాబట్టే వాటికి ప్రేక్షకాదరణ దక్కింది.

డా సినారె ఇచ్చిన బిరుదు నటకిరీటి

మనకన్నా మనకొచ్చిన అవకాశం గొప్పదనుకొనే నటుడిని నేను. అందుకే ఒక పక్క ‘ఏప్రిల్‌ 1 విడుదల’ షూటింగ్‌ చేస్తూ, మరో పక్క ‘ఎర్రమందారం’లో నటించా. ‘లేడీస్‌ టైలర్‌’లో నటిస్తూనే ‘కాష్మోరా’ చేశా. ‘పుణ్యస్త్రీ’, ‘ముత్యమంత ముగ్గు’, ‘ఎర్రమందారం’, ‘ఆ నలుగురు’… ఇలా నా శైలికి భిన్నంగా అనిపించిన పాత్రల్నీ భుజానికెత్తుకొన్నా. ఒక కంట కన్నీరు, ఒక కంట పన్నీరు ఒలికించా. ‘తెలుగు సినిమాలో నీకున్న ప్రత్యేకత ఎవరికీ లేదు. కిరీటి అంటే అర్జునుడు. రెండు చేతులా బాణాలు వేయగల దిట్ట. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతావు కాబట్టి నిన్ను ‘నట కిరీటి’ అంటున్నాం’ అని డా.సి.నారాయణరెడ్డి ఆ బిరుదుని ఇచ్చారు. 1991లో ఎర్రమందారం సినిమాలో ఉత్తమ నటుడిగా నంది పురస్కారం, 1994లో మేడమ్ సినిమాలో నటనకు గాను నంది స్పెషల్ జ్యూరీ అవార్డు – 2004లో ఆ నలుగురు సినిమాకు ఉత్తమ నటుడిగా నంది అవార్డు లభించాయి.

Send a Comment

Your email address will not be published.