ఉత్తరాంధ్ర జానపద కళారూపం తూర్పు భాగవతం
జనం పనిపాటల నుంచి పుట్టినవే . శ్రమజీవులను ఆటపాటతో సేదదీర్చి, వారికి వినోదాన్ని అందించే ఉత్ప్రేరకాలు. గ్రామీణ ప్రజల విశ్వాసాల చుట్టూ అల్లుకున్న కథలే కళారూపాలుగా మారాయి. తెలుగునాట ప్రసిద్ధి పొందిన జానపద కళారూపం వీధి భాగవతం. ఇదే ఉత్తరాంధ్రకు వచ్చేసరికి తూర్పు భాగవతంగా మారిపోయింది. కూచిపూడి భాగవతం ఒకప్పుడు కొన్ని సామాజిక వర్గాలకు మాత్రమే పరిమితమై ఉండేది. దీని నుంచి రూపొందిన వీధి భాగవతం ఒక సామాజిక కళారూపంగా రూపుదిద్దుకుంది. ఆయా ప్రాంతాల్లోని అన్నిరకాల కులాల్లోని ఔత్సాహిక కళాకారులు ఇందులో భాగమయ్యారు.
తూర్పు భాగవతానికి ఒక చారిత్రక ప్రాధాన్యత ఉంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు, ఒడిశాలోని గంజాం, కోరాపుట్ తదితర జిల్లాల్లో తూర్పు భాగవతం ఉనికిలో ఉంది. ఇది సామాన్య ప్రజానీకాన్నే కాక, పండితుల్నీ, విద్వాంసుల్నీ, కవుల్నీ, గాయకుల్నీ ఆకర్షించింది. ఇది ఒక విశిష్ట నర్తన రీతిగానూ, సంగీత సాంప్రదాయంగానూ, మృదంగ బాణీగానూ ఈ కళారూపం సంస్థానాధీశుల ఆదరణకు నోచుకుంది. ఆయా ప్రాంతాల్లో తిరునాళ్ళలోనూ, అమ్మవారి జాతర్లలోనూ, ఈ భాగవతాలు ప్రదర్శనలు జరిపి కళాకారులు ఎంతో ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. హరికథా పితామహుడు అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు, విజయనగర సంస్థానాధిపతి ఆనందగజపతి మహారాజు లాంటి కళా పోషకుల ఆదరాభిమానాల్ని ఈ కళారూపం సంపాదించుకుంది. వారు ఎందరో ఉత్తమ భాగవత కళాకారులకు సింహతలాటాలనూ, ఘంటా కంకణాలనూ ‘కలియుగ సత్యభామ, పండిత సత్యభామ, అభినయ సత్యభామ, గాన కోకిల, వసంత గానకోకిల వంటి బిరుదుల్నీ అందించారు.
కథ పాతదే.. శైలే ప్రత్యేకం
తూర్పు భాగవత ప్రదర్శనల్లోని కథ పాతదే. సాధారణంగా భాగవతం అంటే కృష్ణుని కథలను గానం చేయడమే! ఈ తూర్పు భాగవతంలోని కథావస్తువు కృష్ణుడు, సత్యభామల మధ్య ఏర్పడిన ప్రణయ కలహమే. దీనికే పారిజాతాపహరణమనీ, భామా కలాపమనీ తెలుగు రాష్ట్రాల్లో వ్యవహరిస్తారు. మొదట్లో సిద్ధేంద్ర యోగి భాగవత సంబంధమైన ఈ భామా కలాప రచన చేసి, ప్రచారం చేశారు. కానీ దీనిని కూచిపూడి వీధి భాగవతులు మాత్రమే అధిక ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే సిద్ధేంద్రుడు రాసిన పారిజాతాపహరణానికి, తూర్పు ప్రాంతంవారు ప్రదర్శించే భాగవతానికి చాలా తేడా ఉంది. కూచిపూడి భామాకలాపంలో కనిపించే దరువులు వీరి భాగవతాల్లో తక్కువగా ఉంటాయి.
సందర్భం చుట్టూ అల్లుకున్న కథ
తూర్పు భాగవత కలాపంలో కథా వస్తువు ఒక ముచ్చటైన సందర్భం మాత్రమే! దాని చుట్టూ కథ అల్లుకుని ఉంది. తన మందిరం నుంచి అలిగి వెళ్ళిపోయిన కృష్ణుని, సత్యభామ రాయబారం పంపించి, మళ్ళీ తన ఇంటికి రప్పించుకున్న సందర్భమే ఈ కథా వస్తువు. కథ చిన్నదే అయినా ఇందులో అష్టవిధ నాయికల వర్ణనలూ, అవస్థలూ, విప్రలంభ శృంగారంతో నిండి, ఇది ఒక పెద్ద ప్రబంధమై పోయింది. ఒకప్పుడు ఈ భాగవతాన్ని వరుసగా తొమ్మిది రోజులు ప్రదర్శించేవారు. ఆ తర్వాత కాలానుగుణంగా మూడు రాత్రులకు కుదించారు. ప్రస్తుతం ఒక్క రాత్రే పూర్తిచేస్తున్నారు.
అనేక మార్పులకులోనై …
తూర్పు భాగవతంలోని కథని మొదట రూపొందించినది విజయనగరం ప్రాంతానికి చెందిన వంకాయల బలరామ భుక్త. ఇందులోని కథ కూచిపూడి భాగవతం కథా ఒకటే అయినా పాటలకు సంబంధించిన బాణీ, దరువులూ, నడిపే విధానం, మృదంగ వాయిద్య రీతుల్లోనూ, వారి బాణీకి, తూర్పు భాగవత బాణీకీ చాలా తేడా ఉంది. బలరామ భుక్త తరువాత ఈ జిల్లాకు చెందిన నరసింగబల్లి వారు, కేశవపురి వారు, బొబ్బిలి వారు, దువ్వవారు, నెల్లిమర్ల వారు వంటి ఎందరో ప్రసిద్ధ నాట్య శాస్త్రవేత్తలు, ఈ తూర్పు భాగవత బాణీకీ కావాల్సిన కలాప రచనలను చేశారు. అయితే ఈనాటికీ వంకాయల బలరామ భుక్త రచనే ప్రచారంలో ఉందని కళాకారులు చెపుతారు.
దేశీ సంగీత రచనలతో …
తూర్పు భాగవత ప్రదర్శనలో దరువులూ, ద్విపదలూ, కంద పద్యాలూ, వత్తాలూ, అర్ధచంద్రికలూ, ఏల పదాలూ, చూర్ణీకలూ తదితర దేశీ సంగీత రచనలు ఉపయోగిస్తుంటారు. ఈ దరువులు, ఈ ఆటల్లో చాలా ప్రాముఖ్యం వహిస్తూ ఉంటాయి. భరతుడు నాట్యశాస్త్రంలో ఉదహరించిన ప్రాచీన ధవాగానం అనే విధానాన్ని ఈ నాటికీ తూర్పు భాగవతులు ప్రదర్శిస్తున్నారు. రాగాలూ, తాళాలూ, నేటి కర్ణాటక సాంప్రదాయానికి చెందిన వైనా, రాగ సంచారం, తాళ ప్రసారం మొదలైన విధానాలు ప్రాచీన సంప్రదాయ పద్ధతిని అనుసరించే ఉంటాయి.
మృదంగమే కీలకం
తూర్పు భాగవత ప్రదర్శనలో మృదంగమే అత్యంత కీలకమైన వాయిద్యం. ఇది కళాకారుల్ని ఉధృత తాండవ విన్యాసాలను చేయిస్తుంది. ప్రేక్షకులను ఉత్తేజం, ఉద్వేగాలతో అలరిస్తుంది. మృదంగ కళాకారులు తమ వాయిద్యంలో సముద్రం ఘోషలనూ, పిడుగుల మేఘ గర్జనల్నీ, ఉరుముల ధ్వనుల్నీ, నగారాల భేరీనాదాన్ని విన్పిస్తారు. ఆ దరువులను బట్టే నృత్యం కూడా అంత ఉద్వేగంగానూ ఉంటుంది. వారి మృదంగ వాయిద్యంలో ఎంత గంభీరమైన నాదాలుంటాయో, అంతటి సున్నితమైన, మృదుమధురమైన కోకిల స్వరాలూ, చిలుక పలుకులూ వంటి వాటినీ అలవోకగా పలికిస్తూ, ప్రేక్షకులను ఆనంద డోలికల్లో ముంచేస్తారు. ఈ మృదంగ వాదనలో విశేషమేమిటంటే… ఇతర కళారూపాల్లో వాయిద్యకారులు కూర్చుని మృదంగం వాయిస్తారు. కానీ, తూర్పు భాగవతం ప్రదర్శనలో రెండు మృదంగాల్ని ఒకే కళాకారుడు ముందు, వెనుక నడుముకు కట్టుకుని గంటల తరబడి ప్రదర్శన జరిగినంత సమయమూ నిలబడి వాయించటం చెప్పుకోతగిన విషయం. ఇది చాలా కష్టసాధ్యమైనది. దీనిని సంపూర్ణ ద్విపద రీతి అంటారు. తూర్పు భాగవతం కోసమే బొబ్బిలి ఆస్థానంలో నంది భరతం అనే మృదంగ జతుల గ్రంథాన్ని రూపొందించారు. ఒకే తాళంలో, సప్త తాళాలు ఇమిడి ఉండే రీతిలో, శబ్దాలను కూర్చి, పలికించడం ఈ కళాకారుల ప్రతిభను వెల్లడిస్తోంది. ఈ విశిష్ట వాయిద్యంలో పాత తరం విద్వాంసులు బుగత రామయ్య, ఆయన కుమారుడు గోపన్న. ఆ తరం తరువాత కింతాడ అప్పన్న, ముట్నూరి సంగమేశ్వర శాస్త్రి, ధూపం సూర్యలింగం, గోవిందరావు లాంటి వారు ప్రముఖులుగా ప్రసిద్ధి పొందారు.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో చాలా గ్రామాల్లో జరిగే అమ్మవారి జాతర్లలో ఈ తూర్పు భాగవతాన్ని ప్రదర్శించటం ఇప్పటికీ సంప్రదాయంగా ఉంది. కళాకారుల్లో అన్ని కులాలకూ, వర్గాలకూ చెందిన వారున్నారు. ఈ భాగవతాల్లో పాత్రలు ధరించే వారందరూ పురుషులే. అయినా వందేళ్ల క్రితం, ఒకే ఒక స్త్రీ, భామ వేషం ధరించి, ఆనాటి ప్రజానీకాన్ని ఆశ్చర్యపర్చిందట! ఆమె తెర్లాం గ్రామానికి చెందిన కాలిగుంటి వెంకటస్వామి అనే భాగవత కళాకారుని కుమార్తె అని చెబుతారు. కొత్త తరం వారెవరూ ఈ కళని నేర్చుకోవడానికీ, ప్రదర్శించడానికీ ఆసక్తి చూపించడం లేదు.
ఆదరణ లేక …
శతాబ్దాల తరబడి ప్రజలను అలరించిన ఈ జానపద కళారూపం నేడు అంతరించే దశలో ఉంది. ఒకప్పుడు విజయనగరం, బొబ్బిలి, మాడుగుల, కళింకోట, మందసా, చోడవరం, చీకటికోట, ధారాకోట, సాలూరు, పార్వతీపురం తదితర సంస్థానాలూ, జమీందారులూ, ప్రజలూ ఈ కళను ఎంతగానో ఆదరించి, పోషించారు. విద్వాంసులైన భామ వేషధారులూ, మార్దంగికులు కొద్దిమంది మాత్రమే జీవించి ఉన్నారు. ఇలాగే కొంతకాలం జాగు చేస్తే ఈ కళారూపం నామమాత్రంగా కూడి లేకుండా పోతుంది. అక్కడక్కడ మిగిలి ఉన్న విద్వాంసుల బాణీని రికార్డు చేయాలి. డాక్యుమెంటరీలు తీయాలి. వేష, భూషణ అలంకారాలను భద్రపరచాల్సిన అవసరం ఉంది.