పశ్చిమ బెంగాల్ కేంద్రంగా ఉన్న పలు పారిశ్రామిక సంస్థలు తెలంగాణాలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. కోల్కతాలో సి.ఐ.ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఐ.టి శాఖ మంత్రి కె. తారక రామారావు ఈ సంగతి చెప్పారు. సదస్సు సందర్బంగా ఆయన పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపారు. సుప్రసిద్ధ పారిశ్రామిక సంస్థ ఆర్.పి. గోయెంకా గ్రూప్ తెలంగాణాలో రూ. 200 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. సిద్ధిపేట జిల్లా తూప్రాన్ వద్ద ఇరవై ఎకరాల స్థలంలో దీన్ని ఏర్పాటు చేయడానికి అంగీకారం కుదిరింది. వచ్చే ఆరేడేళ్ల కాలంలో తమ పెట్టుబడులను పది వేల కోట్ల వరకు పెంచే అవకాశం ఉందని ఈ సంస్థ అధిపతి సంజీవ్ గోయెంకా ప్రకటించారు. తారక రామారావు ను కలిసిన పలువురు పారిశ్రామికవేత్తలు సిమెంట్, బయో ఇంధనం తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టబోతున్నాయి.