తెలుగువారి కల సాకారం

తెలుగువారి కల సాకారం

ఆరేళ్ళ కృషి ఫలితం – తెలుగుతల్లికి నీరాజనం

గత ఆరేళ్ళుగా ఎంతోమంది నిర్విరామ కృషికి ఫలితం.  భావితరాల భవితకు సుగమమైన మార్గం. బహుళ సంస్కృతీ సాంప్రదాయాలకు పట్టం గట్టే ఆస్ట్రేలియా దేశంలో నివసించాలన్న తెలుగువారి ఆశావాదానికి పర్వదినం.      ఎంతోమంది విద్యార్ధుల కలల సాకారానికి అవకాశం.   ఆస్ట్రేలియాలో తెలుగుతల్లికి నీరాజనం.

ఆస్ట్రేలియా తెలుగు సమాఖ్య (FTAA – Federation of Telugu Associations in Australia) 2014 లో తెలుగు కమ్యూనిటీ భాషగా గుర్తించాలని FTAA సంస్థాపక అధ్యక్షులు శ్రీ కృష్ణ నడింపల్లి (OAM – కాన్బెర్రా) గారు స్థానిక తెలుగు సంఘాల ప్రతినిధులతో కలిసి కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు పత్రాన్ని సమర్పించడం జరిగింది. అయితే అప్పుడు ప్రభుత్వ గణాంకాల లెక్కల ప్రకారం తెలుగు వారు 7,400  జనాభా కంటె తక్కువగా ఉండడం వలన ఆ విజ్ఞాపనను తిరస్కరించడం జరిగింది.

అయితే దీనిని ఒక సవాలుగా తీసుకొని 2016లో నిర్వహించిన Census లో తెలుగు మాట్లడేవారందరూ తమ మాతృ భాషగా తెలుగును నమోదు చేయాలని ఉధృతమైన ప్రచారం చేయడం మూలంగా ఆ సంఖ్య గణనీయంగా పెరిగి సుమారు 36,000 మందికి చేరుకుంది. ఆ సందేశం అందరికీ తగిన సమయంలో చేరలేకపోవడం మూలంగా  ఈ సంఖ్య  వాస్తవానికి దగ్గరగా లేదు.  అనధికార లెక్కల ప్రకారం తెలుగు మాట్లాడే వారు ఆస్ట్రేలియాలో 80,000 కి పైగా ఉంటారని అంచనా.  వచ్చే సంవత్సరం జరగనున్న సార్వత్రిక గణాంకాల (Census)లో అందరూ అవకాశాన్ని అందిపుచ్చుకొని “తెలుగు” మాతృ భాషగా నమోదు చేసుకోవాలని మరోసారి తెలుగుమల్లి మనవి చేసుకుంటుంది.

గత రెండేళ్లుగా NAATI (National Accreditation Authority for Translators and Interpreters) తో FTAA సభ్యులు సంప్రదింపులు జరిపి ఈ ప్రక్రియలో భాగస్తులై విజయం సాధించారు.  ఇందులో కృషి చేసిన వారిలో డా. కృష్ణ నడింపల్లి,  శ్రీ ఆదిరెడ్డి యారా (అడిలైడ్), శ్రీ గోపాల్ తంగిరాల(మెల్బోర్న్), శ్రీ శ్యాం అంబటి (పెర్త్) ,  శ్రీ శివ శంకర్ పెద్దిభొట్ల (సిడ్నీ), శ్రీమతి వాణి మోటమర్రి(సిడ్నీ) గారున్నారు.  ఈ రోజు NAATI వారి ప్రకటన సమగ్రంగా క్రింద పొందుపరచడమైనది.

In response to requests, NAATI would like to announce that Telugu has been added in the Credentialed Community Language (CCL) Testing.

Candidates can submit CCL applications from 22nd July 2020 for testing due in late August 2020.

Test spots will be opened on 30th July 2020.

ఇప్పటి వరకూ మన తెలుగు విద్యార్ధులు “తెలుగు”  CCL పట్టికలో లేకపోవడం వలన హిందీ మరియు ఇతర భాషల్లో పరీక్షలు వ్రాస్తున్నారు.  ఇప్పుడు ఆ కొరత తీరింది.  అందరూ ఈ అందివచ్చిన అవకాశం ఉపయోగించుకోవాలని తెలుగుమల్లి కోరుతుంది. ఆస్ట్రేలియలోనున్న తెలుగువారందరికీ ఈరోజు ఒక పర్వ దినం.

Send a Comment

Your email address will not be published.