తెలుగు అక్షరాల దేవాలయము

Vijayawada6
Vijayawada2
శ్రీ విజయ రాజరాజేశ్వరి అమ్మవారు
భాషా పరంగా ప్రపంచంలో ఎక్కడా లేని దేవాలయం
పులిపాక – విజయవాడలో తెలుగు అక్షరాల అధిదేవతల విగ్రహాలతో అమ్మవారి గుడి

ప్రపంచంలో ఎక్కడా లేని దేవాలయం. భాషా ప్రాతిపదికన నిర్మించబడ్డ అక్షర రూపంలో అమ్మవారు. తెలుగు భాషలో వున్న 56 అక్షరాలలో ఒక్కొక్క అక్షరానికి ఒక అధి దేవత వుందని ప్రతీ దేవతకి ఒక స్వరూపం వుందని ఈ విషయాలు “రూప జ్ఞాన రత్నాకరము” అన్న గ్రంధంలో ఉన్నాయని శ్రీ వాసుదేవానంద స్వామి వారు చెప్పారు. స్వామి వారు ఈ ఆలయానికి కర్త, కర్మ, క్రియ. ఈ ఆలయం గత ఐదేళ్ళలోనే పూర్తయి ఇప్పుడే ప్రజాదరణకి నోచుకొని నలుగురి నోటా చెప్పుకునే స్థాయికి చేరుకుంది.

ఈ ఆలయం యొక్క స్థల పురాణం వింటే ఒకింత వింతగా వున్నా ఆశ్చర్యం కలుగక మానదు.

Vijayawada3

Vijayawada5

పాతికేళ్ళ సుదీర్ఘ ప్రయాణం. 1992లో ఇక్కడ జనావాసం అతి స్వల్పం. కొద్ది దూరంలో ఒక శివాలయం. కొంత మంది భక్తులు వారం వారం భజన కార్యక్రమాలు నిర్వహిస్తూ వుండేవారు. శ్రీమతి సుజాత గారు ఈ స్థలంలో చండీ యాగం చేసి ప్రసంగానికి రమ్మంటే శ్రీ వాసుదేవానంద స్వామి వారు వచ్చి లలితా సహస్రనామం పారాయణం చేయడం యాదృచ్చికంగా జరిగింది. అయితే ఈ ప్రక్రియ అందరినీ ఆకట్టుకొని వారితో ఆధ్యాత్మిక కార్యక్రమం కొనసాగిస్తే బాగుంటుందని అలోచించి వారికి అక్కడే ఉండమని అందరికీ లలితా సహస్రనామ పారాయణం నేర్పించాలని అడిగితే వారి అభ్యర్ధన కాదనలేక వారిలో ఒకరిగా అమ్మవారి సేవలో తరించే అవకాశం దొరికిందని శ్రీ స్వామి వారు అక్కడే ఉండిపోయారు. అలా మొదలైన శ్రీ వాసుదేవానంద స్వామి వారి ప్రయాణం ఈ రోజు సుమారు 20 కోట్ల ఖర్చుతో ప్రపంచంలోనే ఒక ప్రత్యేక తరహా అమ్మవారి ఆలయంగా రూపు దిద్దుకుంది.

20180804_084111

20180804_075624అయితే ఈ ప్రయాణం అంత సాఫీగా జరగలేదు. ఎన్నో అడ్డంకులు. ఎన్నెన్నో అవమానాలు. ఎంతో మంది వ్యక్తులు. ఎన్నో ఆశలు. మరెన్నో నిరాశలు. నిబద్ధతగా పని చేస్తే అమ్మవారే మలుపులన్నీ గెలుపులుగా మార్చుకొంటారన్న నమ్మకంతో పలువురు భక్తుల్ని తనతో ముందుకు నడిపిస్తూ అమ్మవారి గుడి కట్టడమే లక్ష్యంగా పాతికేళ్ళ అలుపెరుగని ప్రయాణంలో కాలానికి ఎదురీదారు. అనుకున్న లక్ష్యం సాధించారు.

ఒకరు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. ఇంకొకరు మీతోపాటు మేమున్నామని భుజానికి భజం కలిపారు. కొంతమంది మాకున్న గంజిలో మీకు కూడా కొంత పెడతామన్నారు. చేతిలో గవ్వలేకపోయినా సంకల్ప బలంతో సాధించిన విజయం ఇది.

అసలు కధలోకి వెళితే తొలిరోజుల్లో భజనలు, పూజలుతో మొదలై అమ్మవారికి ఆలయ ఆలోచన చాలా దూరంలో వుండేది. ఒక వాస్తు గురువు ఈ భక్తులందరి ఆసక్తి చూసి ఇక్కడ వాస్తు దోషం ఉంది కనుక మీరు ఒక గోడ కట్టాలి అని సూచిస్తూ ప్రక్కనున్న స్థలంలో ఒక అడుగు కలిపి మరీ కట్టాలి అని సలహా ఇచ్చి మాయమైపోయాడు. అయితే ఇందులో కొంత మర్మం లేకపోలేదు. వివాదం జరిగితేనే ఆ స్థలం మీకు వస్తుంది అని వాస్తు గురువు చెప్పడం కూడా జరిగిందట. ఆ సూచన తు.చ. తప్పకుండా గోడ కట్టడం వివాదానికి దారి తీసి ప్రక్క స్థలం అధిపతి రెండున్నర ఎకరాలు అమ్మజూపడం జరిగింది. “మ్రింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగె నూనె” అన్నట్లు అవకాశం బాగున్నా పన్నెండున్నర లక్షలు ఎక్కడి నుండి తేవాలి? ఈ మీమాంసతో పలువురు భక్తులతో సంప్రదింపులు జరిపి రెండు లక్షలు బయానా ఇవ్వడం జరిగింది. కాగల కార్యం గంధర్వులే తీర్చేదరని మరో రెండు నెలల్లో మిగిలిన పది లక్షలు మరికొంతమంది భక్తులు ఇవ్వగా భూమి స్వాధీనం అయ్యింది. అలా భూమి స్వంతం అయిన తరువాత గుడి కూడా చాలామంది చందాల ద్వారా జమకూర్చిన డబ్బుతో కట్టడం జరిగిందని శ్రీ స్వామి వారు తెలిపారు.

20180804_083935

అయితే మన తెలుగు అక్షరాలకు అదిదేవతలుంటారన్న సంగతి తెలుసుకొని “రూప జ్ఞాన రత్నాకరము” గ్రంధంలో వున్న విషయసేకరణ చేసి వాటి విగ్రహాలను రాజస్తాన్ లో చేయించి గుడి ప్రాకారపు గోడలపై అధి దేవత విగ్రహాలు ప్రతిష్ఠించడం జరిగిందని శ్రీ స్వామి వారు తెలిపారు.

ఈ ఆలయ ప్రాంగణంలో శివాలయము, శ్రీ విజయరాజరాజేశ్వరీ విద్యాపీఠం ట్రస్ట్ వారి అధ్వర్యంలో సామవేద గురుకుల పాఠశాల గోశాల నిర్మాణ నిర్వహణ జరుగుతున్నది. సామవేద పాఠశాలలో ప్రస్తుతం 12 మంది పిల్లలు వేదాలను నేర్చుకుంటున్నారు. అయితే ఈ పాఠశాలలో వేదాలను నేర్చుకోవాలన్న దృక్పధం వున్నవారు ఎవరైనా చేరవచ్చు. కులమత ప్రాతిపదిక ఏదీ లేదు.

Send a Comment

Your email address will not be published.