తెలుగు జాతి స్వీయగౌరవం

తెలుగు జాతి స్వీయగౌరవం

తెలుగు జాతి స్వీయగౌరవానికి ప్రతీక నవరస నటసార్వభౌమ నంద‌మూరి తార‌క రామారావు

తెలుగు జాతి స్వీయ గౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన లెజెండ్ నందమూరి తారకరామారావు. పౌరాణికం.. జానపదం.. సాంఘికం… పాత్ర ఏదైనా, సంభాషణలు ఎలాంటివైనా అద్భుత నటనతో రక్తి కట్టించడంలో నందమూరి తారక రామారావును మించిన వారు లేరు. అందుకే ఆయన విశ్వ విఖ్యాత నటసార్వభౌముడయ్యారు. తెలుగు పరిశ్రమలో అగ్రకథానాయకుడిగా నీరాజనాలందుకున్నారు. కేవలం కళారంగంలోనే కాకుండా రాజకీయ రంగంలోనూ అడుగిడి ప్రజలకు తనవంతు సేవచేసి తెలుగు ప్రజల మదిలో ఆరాధ్య దైవమయ్యారు నందమూరి తారక రామారావు.

కృష్ణా జిల్లా నిమ్మకూరులో 1923 మే 28న నందమూరి తారక రామారావు జన్మించారు. ఆయన తల్లిదండ్రులు లక్ష్మయ్య చౌదరి, వెంకట రామమ్మ. ఎన్‌టిఆర్‌ పాఠశాల విద్య విజయవాడ మున్సిపల్‌ హై స్కూల్‌లో పూర్తి చేసి ఎస్ ఆర్‌ ఆర్‌ కాలేజీలో చేరాడు. కళాశాల విద్య కొనసాగుతుండగానే మేనమామ కూతురు బసవ తారకంను వివాహమాడి గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్‌ కాలేజీలో బిఎ చేశారు. ఎన్‌టిఆర్‌కు మొదటి నుంచి నాటక రంగంపై మక్కువ ఎక్కువ. విజయవాడ ఎస్‌ ఆర్‌ ఆర్‌ కాలేజీలో చదువుతున్నప్పడు నాగమ్మ పాత్ర వేశారు. నూనూగు మీసాలు తీసేందుకు ససేమిరా అనడంతో ఆ పాత్రకు మీసాల నాగమ్మ అని పేరు తగిలించారు. గుంటూరు క్రిస్టియన్‌ కళాశాలలో చదువుతున్నప్పడు నేషనల్‌ ఆర్ట్‌ థియేటర్‌ను ఏర్పాటు చేసి జగ్గయ్య, ముక్కామల, నాగభూషణం తదితరులతో “చేసిన పాపం” వంటి నాటకాలు ఆడారు.

సినిమా రంగంపై మక్కువతో మంగళగిరిలో సబ్‌ రిజిస్ట్రార్‌గా ఉద్యోగం చేస్తోన్న ఎన్‌టిఆర్‌ చెన్నై ట్రేన్‌ ఎక్కేశారు. ప్రముఖ దర్శకుడు ఎల్వీప్రసాద్‌ తీస్తున్న ‘పల్లెటూరి పిల్ల’ సినిమాలో కథానాయకుడిగా ఎన్టీఆర్‌కు అవకాశం వచ్చింది. కానీ దాని నిర్మాణం వెంటనే మొదలవలేదు. ఆ తర్వాత ‘మనదేశం’లో అవకాశం వచ్చింది. అలా ఆయన తొలిసారి కెమేరా ముందు నటించిన సినిమా ‘మనదేశం’ అయింది. దీని తర్వాత ఎల్వీప్రసాద్‌తో ‘షావుకారు’ చేశారు. అది మంచి పేరు తెచ్చింది. ఇక 1951లో కె.వి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘పాతాళభైరవి’, 1952లో బి.ఎన్‌.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘మల్లీశ్వరి’ ఎన్టీఆర్‌కు ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టాయి. 1956లో వచ్చిన ‘మాయాబజార్‌’తో ఎన్టీఆర్‌ అగ్రకథానాయకుడిగా తన స్థాయిని పెంచుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద సంచలనం సృష్టించిందా చిత్రం. అక్కడి నుంచి ‘భూకైలాస్‌’, ‘శ్రీ వెంకటేశ్వర మహాత్య్మం’, ‘లవకుశ’ వంటి అద్భుత చిత్రాలతో తెలుగు పరిశ్రమలో దిగ్గజ నటుడిగా ఎదిగారు. ఈ క్రమంలో ఏడాదికి 10 సినిమాల చొప్పున నటిస్తూ.. ఎవరికీ అందనంత ఎత్తుకు చేరుకున్నారు. ఎన్టీఆర్‌ దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం 1961లో వచ్చిన ‘సీతారామ కళ్యాణం’. ఆ తర్వాత 1977లో ‘దాన వీర శూర కర్ణ’లో ఎన్టీఆర్‌ మూడు పాత్రల్లో నటిస్తూ.. స్వయంగా దర్శకత్వం వహించారు. అది బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్నందుకుంది. వీటితో పాటు ‘శ్రీరామ పట్టాభిషేకం’, ‘అడవి రాముడు’, ‘యమగోల’, ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’, ‘సర్దార్‌ పాపారాయుడు’ తదితర సినిమాలు ఎన్టీఆర్‌కు మంచి పేరు తెచ్చాయి. ఎన్టీఆర్‌ చివరగా నటించిన చిత్రం ‘మేజర్‌ చంద్రకాంత్‌’. ఆ సినిమాలో నందమూరి నటన ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.

షావుకారు చిత్రం తరువాత నివాసాన్ని చెన్నైలోని థౌజండ్‌ లైట్స్‌ ప్రాంతానికి మార్చుకున్నారు. విజయావారి బ్యానర్‌పై వచ్చిన పాతళబైరవి, మల్లీశ్వరి, పెళ్లిచేసి చూడు, చంద్రహారం చిత్రాలు ఎన్‌టిఆర్‌ను తిరుగులేని నటుడిగా నిరూపించాయి. మాయాబజార్‌, లవకుశ, శ్రీకృష్ణార్జున యుద్దం, భీష్మ, భూకైలాష్‌, నర్తనశాల, పాండవ వనవాసం, శ్రీ వెంకటేశ్వరస్వామి మహత్యం, మహామంత్రి తిమ్మరుసు, దానవీరశూరకర్ణ చిత్రాలు విశ్వ విఖ్యాత ఎన్‌టిరామారావును మకుటం లేని మహారాజుగా నిలబెట్టాయి. కన్యాశుల్కం, గుండమ్మకథ, అడవిరాముడు, వేటగాడు, గజదొంగ, డ్రైవర్‌ రాముడు, సర్ధార్‌ పాపారాయుడు, కొండవీటి సింహం, జస్టిస్‌ చౌదరి, బొబ్బిలిపులి చిత్రాల్లో ఆయన విలక్షణ నటనను ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోరు. ఎన్‌టిఆర్‌ నటించిన చివరి చిత్రం మేజర్‌ చంద్రకాంత్‌. తన కెరీర్లో ఆయన దాదాపు 320కి పైగా చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్‌ తన 44 ఏళ్ల సినిమా జీవితంలో 186 సాంఘికాలు, 13 చారిత్రకాలు, 55 జానపద, 44 పౌరాణిక సినిమాలు చేశారు.

ఎన్టీఆర్‌కు తొలుత వాళ్లమ్మ కృష్ణ అని పేరు పెట్టాలనుకున్నప్పటికీ, మేనమామ తారక రాముడయితే బాగుంటుందని సూచించడంతో అదే పేరు పెట్టారు. తర్వాత అది కాస్తా తారక రామారావుగా మారింది. 1942లో 20ఏళ్ల వయసులో ఎన్టీఆర్‌ తన మేనమామ కూతురు బసవతారకాన్ని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఎనిమిది మంది కుమారులు, నలుగురు కుమార్తెలున్నారు. 1985లో బసవ రామ తారకం మరణించాక, ఎన్టీఆర్‌ 1993లో లక్ష్మీపార్వతిని రెండవ వివాహం చేసుకున్నారు.

రాజకీయ ప్రస్థానం:
చిత్ర సీమలో నెంబర్‌ వన్‌గా నిలిపిన అభిమానులకు, ప్రజలకు సేవ చేయాలని తలిచిన ఎన్‌టిఆర్‌ తెలుగుదేశం అనే రాజకీయపార్టీని 1982 మార్చి 29న స్థాపించారు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల కాలంలోనే వటవృక్షం లాంటి కాంగ్రెస్‌ పార్టీని మట్టికరిపించి ఆంధ్రప్రదేశ్‌లో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తెలుగువాడి ఆత్మగౌరవం పేరుతో ప్రచార రథంపై సుడిగాలి పర్యటన చేశారు. అంతర్గత కుమ్ములాటలో కొట్టుమిట్టాడే కాంగ్రెస్‌ నాయకులు ఢిల్లీ అధిష్టానం చేతిలో కీలుబొమ్మలుగా మారడాన్ని ప్రచారాస్త్రాలుగా చేసుకుని ఆయన చేసిన ప్రసంగాలు తెలుగువారి గుండెల్లో పౌరుషాగ్నిని నిలిపాయి. పేదవాడి కడుపు నింపే రెండు రూపాయలకు కిలోబియ్యం, సగం ధరకే చేనేత వస్త్రాలు, రైతన్నకు సబ్సిడీపై విద్యుత్‌ తదితర ప్రజాకర్షక, ప్రజాసంక్షేమ పథకాలు తిరుగులేని విజయాన్ని అందించాయి. ఆడిన మాట తప్పని “అన్న”గా ఎన్‌టిఆర్‌ అధికారంలో కొనసాగినంత కాలం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు. నాదేండ్ల బాస్కర రావు నుంచి వెన్నుపోటు ఎదుర్కొన్న ఎన్‌టిఆర్‌ మరోసారి ప్రజా తీర్పు కోరి తిరుగులేని మెజార్టీ సాధించి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. 1985 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆయన 1989 ఎన్నికల్లో ఓటమి చెందారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు చుక్కలు చూపించిన ఎన్‌టిఆర్‌ దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలను ఐక్యపథంలో నడిపించి నేషనల్‌ ప్రంట్‌ ఏర్పాటు చేశారు. కేంద్రంలో తొలి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు చేయించారు. తిరిగి 1994లో రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాల్లో విజయ దుందుబి మోగించి అఖండ మెజార్టీతో అధికారం చేపట్టారు. తెలుగు దేశం పార్టీలో అంతర్గత పరిస్థితుల కారణంగా ఎన్‌టిఆర్‌ నుంచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పీఠాన్ని హస్తగతం చేసుకున్నారు. 1996 జనవరి 18న 73 సంవత్సరాల వయసులో ఎన్‌టిఆర్‌ గుండెపోటుతో మరణించారు. భౌతికంగా ఆయన దూరమైనా ప్రజలు, అభిమానుల గుండెల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.

Send a Comment

Your email address will not be published.