నాన్నకే రుణపడి ఉన్నాను

నాన్నకే రుణపడి ఉన్నాను

దక్షిణాది చలన చిత్ర రంగంలో పోలీస్ ఆఫీసర్ గానూ, క్యారక్టర్ నటుడిగానూ తనకంటూ ఒక ప్రత్యేకస్థానాన్ని సంతరించుకున్న నాజర్ గురించి కొన్ని విషయాలు చూద్దాం….

కమల్ హాసన్ తాజాగా రూపొందిస్తున్న ఉత్తమ విలన్ చిత్రం షూటింగ్ ఒక భారీ సెట్స్ పై సాగుతున్నప్పుడు జరిగిన సంఘటన ఇది. ఆ నాటి షూటింగులో నాజర్ నటిస్తుండగా ఆయన ఒక దుర్వార్త వినవలసి వచ్చింది. ఆయన పెద్ద కొడుకు ఫైజల్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినట్టు నాజర్ చెవిన పడింది. అంతే ఆ క్షణమే నాజర్ కుప్పకూలారు. దానితో  మరుక్షణమే కమల్ హాసన్ ఆనాటి షూటింగ్ ఆపించి సెట్స్ తొలగించి  నాజర్ మళ్ళీ కెమెరా ముందుకొచ్చి నిలబడినప్పుడు ఈ షూటింగ్ కొనసాగిద్దామని చెప్పి నాజర్ ను  ఓదార్చడమే కాకుండా తామందరం మీ వెంటే ఉన్నామని ధైర్యం చెప్పి అండగా నిలిచారు. అందుకు నాజర్ కమల్ హాసన్ కు, సన్నిహితులకు  కృతజ్ఞతలు చెప్పుకున్నారు.

నాజర్ నటుడు కాకపూర్వం అర్ధాకలితో పస్తులున్న రోజులున్నాయి. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ తనలాగే ఎందరో రెండు పూటలా అన్నం లేక అవస్థ పడిన ఉన్నారని అన్నారు. అటువంటి కష్టం ఎవరికీ రాకూడదని నాజర్ అంటూ ఉంటారు.

మతపరంగా ఒక్కొక్కసారి కొన్ని ఇబ్బందులు పడిన నాజర్ ను ఒక హైందవ మిత్రుడు తనతో ఇంటికి తీసుకువెళ్లి తమ పూజ గదిలో నిద్రపోనిచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయినా నిద్రకోసం పడిన కష్టాల మాట పక్కన పెడితే అప్పట్లో తన దృష్టి అంతా ఎంతసేపూ నటుడిగా రాణించాలి అన్న దానిపైనే ఉండేదని నాజర్ అంటూ ఉంటారు.

నాజర్ నటుడు కావడానికి ముఖ్యకారణం ఆయన తండ్రే అని చెప్పుకోవాలి. నాజర్ తండ్రి పేరు మెహబూబ్ బాషా. ఆయన ఆలోచనలు చాలా విచిత్రమని నాజర్ చెప్పుకునే వారు. ఆయన ముస్లిం మతస్తుడిగా ఎంతో చాందసవాది. కానీ ఆయన తమ కుమారుడు నాజర్ మాత్రం నటుడిగా ఎదగాలని పదే పదే చెప్తూ ఆ వైపే అడుగులు సారించడానికి దృష్టి పెట్టేవారు. స్థానికంగా కొన్ని నాటక సంస్థలకు ఆయన డబ్బులు ఇచ్చి నాజర్ కు వేషాలు ఇప్పించడం కోసం కృషి చేసారు.

మరోవైపు నాజర్ దృష్టంతా ఎక్కడైనా ఉద్యోగం చేసుకుని బతుకుదామని అనుకునేవారు. ఆయనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఎయిర్ మన్ గా ఉద్యోగం వచ్చింది కూడా. కానీ తండ్రి పట్టుబట్టి నాజర్ ను నటనకు అంకితం అయ్యేలా చేసారు. అయితే నటుడు కావడానికి నాజర్ పడ్డ కష్టాలు అన్నీ ఇనీ కావు.

ఆయనకు దర్శకుడు కె బాలచందర్ మొదటిసారిగా కళ్యాణ అగదిగల్ అనే తమిళ చిత్రంలో అవకాశం ఇచ్చారు. కానీ ఆ సినిమా హిట్టవ లేదు. అయినప్పటికీ  నాజర్ నటుడిగా నిలబడటానికి అహర్నిశలూ శ్రమించారు. ఆయనకు తొలి బ్రేక్ ఇచ్చిన చిత్రం నాయగన్. ఈ చిత్రానికి దర్శకుడు మణిరత్నం. ఆ తర్వాత ఆయన వెనుతిరిగి చూడలేదు. రెండు దశాబ్దాలపాటు ఆయన దక్షిణాది భాషా చిత్రాల్లో ఎన్నింటిలోనో నటించారు. ఇప్పటికి ఆయన సినీ జీవితంలో 29 ఏళ్ళు సాగింది. ఇప్పుడు యువతరంతో కూడా కలిసి నటిస్తున్న నాజర్ వారి నుంచి కూడా నటనాపరంగా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నానని అన్నారు.

ఏది ఏమైనా తానూ నటుడిగా ఒక స్థానం సంపాదించడానికి ముఖ్య కారణం తన తండ్రేనని, ఆయనకు జీవితాంతం రుణ పడి ఉంటానని నాజర్ అన్నారు.

– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.