రెండు దశాబ్దాల అలుపెరుగని ప్రయాణం. దిశానిర్దేశాలు వ్రాసుకొని మహర్దశతో ముందుకెళుతున్న వైనం. ఇరవై వసంతాల చరిత్రలో ఒక నారీమణికి పట్టం. సభ్యులందరిలోనూ నూతనోత్సాహం. విలంబి ఉగాదికి విలసిల్లిన భాషితం. వికసించిన వనితలకు విలువైన సత్కారం. షడ్రుచుల పచ్చడితో జీవన సమన్వయం. మలుపు మలుపుకీ గెలుపే ఒక సందేశం.
రెండు దశాబ్దాల చిరు ప్రాయం
దేశం చిన్నదైనా వన్నె గలది. వాసికెక్కినది. న్యూ జిలాండ్ కి పాతికేళ్ళ క్రితం అరకొరగా వున్న తెలుగువారు ఇప్పుడు ‘ఇంతింతై వటుడింతయై’ అన్నట్లు షుమారు పదివేలకు పైగా వున్నారు. దేశానికంతటికీ తలమానికమైన ఆక్లాండ్ నగరంలో ఇరవై ఏళ్ల క్రితం 1998లో తొలి తెలుగు సంఘం ఏర్పడి ఇప్పటికి 20 సంవత్సరాలైంది. ఈ ప్రయాణంలో ఎన్నెన్ని మార్పులు! నూతన సరాగాలతో కాలంతో పాటు అనుకూల సమయంలో పరుగులిడి ప్రతికూల సమయంలో కాలాన్నే ఎదొర్కొని సంయమనంతో తన ఉనికిని కాపాడుకుంటూ సుస్థిరమైన స్థానాన్ని పదిలపరచుకుంది.
ఇప్పటికి ఇరవై ఉగాదుల పచ్చడి చవి చూసిన న్యూ జిలాండ్ తెలుగు సంఘం షడ్రుచుల లాగానే పోరాట పటిమ అలవరచుకొని జీవనసారాన్ని రసామృతంగా సభ్యులందరికీ పంచి ఇచ్చింది. గెలుపు ఓటములు నాణేనికి రెండు వైపులా వున్న బొమ్మ బొరుసులని ఒక గుణపాఠం నేర్పింది. ‘బహుధాన్య’ ఉగాదికి మొదలైన తెలుగు సంఘం ‘విళంబి’కి ఒక వైవిధ్యమైన రీతిలో పరిణితి చెంది ప్రజా బాహుళ్యాన్ని కూడగట్టుకొని ఉరకలు వేస్తూ త్రోవనబోయే తెలుగువారందరికీ వయ్యారంగా పలకరిస్తుంది. తన పలకరింపుతో పులకరింపజేస్తుంది. పరవసింపజేస్తుంది.
విళంబి ఉగాది
తెలుగు వారైయుండి ఉగాది పండగ చేయకపోవడమన్నది నమ్మలేని నిజం. ఉగాది పండగ చేయనివారు తెలుగువారు కాకపొతే నమ్మదగ్గ నిజం. అవకాశం లేక ఏదైనా పండగ చేయలేకపోయినా, ఉగాది మాత్రం న్యూ జిలాండ్ తెలుగు సంఘం సర్వ సాంప్రదాయాలు పాటించి తనకున్న వనరులను సర్వదా ఉపయోగించుకొని తూ.చ. తప్పకుండా అక్కడి తెలుగువారందరూ కలిసి చేసుకోవడం ఆనవాయితీ. ‘ముదితల్ నేర్వగలేని విద్య గలదే’ అన్న సందాన ఈ సంవత్సరం నూతన అధ్యక్షులు శ్రీమతి అరుణ భూంపల్లి గారి అధ్వర్యంలో క్రొత్త ఆశయాలతో వరవళ్ళు దిద్దుతూ పరవళ్ళు త్రొక్కుతూ మరింత ముందుకెళ్ళాలని ఉవ్విళ్ళూరుతున్నారు.
ఈ పంథాలోనే తెలుగు సంఘంలోని కొంతమంది వనితలు వారి వారి వృత్తి నైపుణ్యాలలో నిష్ణాతులైన వారిని సన్మానించడం జరిగింది. వారిలో ముఖ్యంగా షుమారు 200 మంది విద్యార్ధులకు కర్ణాటక సంగీతం నేర్పించి సంగీతంలో డాక్టరేట్ పట్టా పొందిన శ్రీమతి పద్మా గోవర్ధన్ గారు, న్యూ జిలాండ్ తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి అరుణ జ్యోతి ముద్దం గారు మరియు నీలిమ వెంకట్ గారు ఉన్నారు.
మూడు నెలల్లో మూడు పండగలు
శ్రీమతి అరుణ భూంపల్లి గారు ఎన్నికైన మూడు నెలల్లోనే వరుసగా మూడు పండగలు (సంక్రాంతి, హోలీ మరియు ఉగాది) జరుపుకోవడం గొప్ప విశేషం. ఇదే తరహాలో వచ్చే తొమ్మిది నెలలకీ పండగల పట్టీ తాయారు చేసి మంచి కార్యక్రమాలను చేపట్టాలని అనుకుంటున్నారు.
ముఖ్య అతిధి
గౌరవనీయులైన భారతీయ కన్సుల్ శ్రీ భావ్ ధిల్లాన్ మరియు వారి శ్రీమతి రుబీ దిల్లాన్ ముఖ్య అతిధులుగా విచ్చేసారు. ఇంతటి గొప్ప కార్యక్రమం నిర్వహించినందులకు తెలుగు సంఘం స్పూర్తిదాయకమని శ్రీ ధిల్లాన్ కొనియాడారు. వీరితోపాటుగా భారతీయ సమాజ్ నుండి శ్రీ జీత్ సచదేవ మరియు భారతీయ మందిర్ నుండి జ్యోతి పరాశర్ కూడా వచ్చారు.
పసందైన విందు
800 కు పైగా విచ్చేసిన ఈ కార్యక్రమం విందు భోజనం మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో ఉగాది ఉత్సవాలు ఘనంగా ముగిశాయి.