నాలో కృష్ణుడు ఉన్నాడు

నాలో కృష్ణుడు ఉన్నాడు

కృష్ణుడు నాతో ఉన్నాడని దర్శకుడు చంద్ర మోహన్ తెలిపారు.

ఆయన తండ్రి గొప్ప కృష్ణ భక్తుడు. ఆయన ఎప్పుడూ భగవద్గీత చదువుతుండేవారు. నిజం చెప్పాలంటే తానూ ఎప్పుడూ ప్రార్ధన చేయకపోయినప్పటికీ తనపై కృష్ణుడి ప్రభావం ఉందని చంద్ర మోహన్ తెలిపారు. ఇప్పుడు తనలో కృష్ణుడు స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నాడని అన్నారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ తననెంతో ఆకట్టుకుందని చెప్తూ రాధ చిత్రంలో శర్వానంద్ పాత్రలో కృష్ణుడి పాత్ర ఉందని తెలిపారు. ఆయుధంతో కాకుండా కేవలం మాటలతో తానూ అనుకున్నది చేయడంలో కృష్ణుడి తర్వాతే ఎవరైనా అని చెప్పారు. ఆ విధంగానే శర్వానంద్ పాత్ర నడిపించినట్టు తెలిపారు. కృష్ణుడు పోలీస్ ఆఫీసర్ గా ఉంటే ఏం చేసే వాడు అనే కోణంలో కథ నడిపించినట్టు ఆయన అన్నారు.

2001 లో చలన చిత్ర రంగంలోకి వచ్చిన చంద్ర మోహన్ తొలిసారిగా రాధ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆయన అకాడెమిక్ చదువులపై పెద్దగా ఆసక్తి చూపలేదు. స్కూల్ బుక్స్ ను అంతగా ఇష్టపడేవారు కాదు. ఈ చదువు లెందుకో తనను అంతగా ఆకట్టుకోలేదన్నారు. ఎప్పుడూ ఏదో స్క్రిప్ట్ తయారు చేయడానికే ఆసక్తి చూపే వారు. స్క్రిప్ట్ మీద కాకుండా ఆ శ్రద్ధ అంతా చదువులపై చూపిస్తే ఎంతో బాగుండేది అని వాళ్ళ అమ్మ జోక్ చేసే వారట. అయితే కుటుంబ సభ్యులు, మిత్రులు, ముఖ్యంగా భార్య స్వాతి తనకెంతో సహకరించడం వల్లే ఇప్పుడు ఇలా ఉన్నానని అన్నారు చంద్ర మోహన్.

తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఆయన చాలా గ్యాప్ తీసుకున్నారు. గురు అనే చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన చంద్రమోహన్ తానూ దర్శకుడు కావాలనుకున్న కోరికను రాధ చిత్రంతో తీర్చుకున్నారు.

Send a Comment

Your email address will not be published.