ఎద సవ్వడి లయలో నా
మది పలికిన నాల్గు మాటలని
ఒక సిరాసముద్రంలో వదిలిపెట్టాను
కలం చివర్న అవి వరుసకట్టి
ఒకటి అటు జరిగి ఒకటి ఇటు తిరిగి
ఒకటి ముందుకొచ్చి మరొకటి వెనకకొరిగి
చివరికొక జట్టుగా ఏకమైనాయి
ఒక్కొక్కటిగా ఈ కాగితంపై అడుగు పెట్టాయి
పసిబిడ్డ పసిడి నవ్వులైనాయి
పున్నమి రేయి వెన్నెల జల్లులైనాయి
అమ్మ చూపుల ప్రేమ వరదలైనాయి
సందె చీకట్లలో మిణుగురు వెలుగులైనాయి
కొండవాగుల గలగల పాటలైనాయి
వేయికన్నుల నెమలి ఆటలైనాయి
సఖియ సిగ్గుల తేనెల ఊటలైనాయి
గారాల ప్రియురాలి సొగసు తోటలైనాయి
కనుపాప ఊసులైనాయి, కంటి చెమ్మలైనాయి
కలలు కన్నాయి, అవి కలత చెందాయి
కేకలేశాయి, అవి కవితలైనాయి
నా ప్రేయసికి కాన్కలైనాయి….!
–రమాకాంత్ రెడ్డి మెల్బోర్న్