ప్రేంచంద్ ప్రముఖ బెంగాలీ రచయిత. ఆయనను కలుసుకుని తమకున్న సందేహాలు నివృత్తి చేసుకోవడానికి ఎవరో ఒకరు ఎప్పుడూ ఆయన వద్దకు వస్తూ ఉండేవారు. అందుకే ఆయన రాత్రిపూట ఎక్కువ సేపు మేల్కొని తాను రాయదలచుకున్నవి రాసుకునే వారు. దాంతో ఒకరోజు ఆయన శ్రీమతి “ఇలా రాత్రుళ్ళు ఇంతింత సేపు మేల్కొని ఉండటం ఆరోగ్యానికి మంచిది కాదండీ. మిమ్మల్ని కలవడానికి వచ్చే వాళ్ళ విషయం పగటి పూటే ఫలానా టైం అంటూ ఏర్పాటు చేసుకోవచ్చుగా” అని అన్నారొకసారి.
అప్పుడు ప్రేంచంద్ “అది నా వల్ల కుదరదు” అని కచ్చితంగా చెప్పేశారు.
తనను కలవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. వాళ్ళు ఎంతో శ్రమకోర్చి వచ్చినప్పుడు ఇప్పుడు టైం లేదు వెళ్ళిపొండి అని ఎలా చెప్పను చెప్పు అని అనే వారు ప్రేంచంద్ . తానలా పంపేస్తే వాళ్ళు బాధ పడరూ అని ఎదురు ప్రశ్నించే వారు. అలాంటివన్నీ డబ్బున్న వాళ్ళు చేసే పనే….వాళ్లకు టైం వగైరా వర్తిస్తాయి. మనలాంటి వారికి కాదే అని అన్నారు. తన దగ్గరకు వచ్చే వాళ్ళు చుక్కాని లేని నావ లాంటి వారే. తమకున్న సందేహాలను చెప్పి వాటికి సమాధానం ఆశిస్తారు….వాళ్లకు నాకు తెలిసినంత వరకు చెప్పడం నా కనీస ధర్మమే…ఆ బాద్యత నుంచి నన్ను ఎలా తప్పుకోమంటావు చెప్పు అని అనే వారు ఆయన. పైగా కొన్ని రోజుల తర్వాత వాళ్లేనే సాహిత్యం సృష్టించేది తెలుసుకో అంటూ వాళ్లకు సన్మార్గం చూపడం కనీస బాధ్యతే. ఆ బాధ్యత నుంచి తాను తప్పుకుంటే అది పాపమే అని అనుకునే వారు ప్రేంచంద్.
ఎవరైనాసరే తమ దగ్గరున్న ప్రతిభను నలుగురికీ పంచాలి అనే వారు. అది తమ సంస్కారానికి గుర్తు. అంతేతప్ప అతనితోనే దాచుకుంటే అది తప్పవుతుంది అని ఎప్పుడూ అనే వారు.
రాత్రిని తగ్గించమని, పగటి సమయాన్ని మరింత పెంచమని ఆయన దేవుడికి ప్రార్ధిస్తూ ఉండే వారు.
—————–
– లాస్యా హరి
——————-