పరుచూరి బ్రదర్స్ తో జనరంజని

Taai-PBrothers-2017
ప్రతీ ఏటా ఇంటింటా జరిగే పండగలు ఎన్నో. మన అదృష్టం పండి పరభాషా సంస్కృతితో సహవాసం చేస్తున్నాం గనుక రెండు రకాల పండుగలు చేసుకోవడానికి అవకాశం వుంది.

అయితే తెలుగువారందరూ ఎదురుచూసేది, జనరంజకంగా కలిసి జరుపుకునేది ‘జనరంజని’. పాతికేళ్ళుగా ప్రతీ ఏటా దసరా దీపావళి సందర్భంగా జరుపుకునే ఈ ఉత్సవం ఈ సంవత్సరం నవంబరు 5వ తేదీన బర్వుడ్ లోని బీసెన్ సెంటర్ లో ఆస్ట్రేలియా తెలుగు సంఘం నిర్వహిస్తోంది.

ప్రతీ సంవత్సరం జరిగే ఈ కార్యక్రమంలో 200కు పైగా కళాకారులు పాల్గొని వైవిధ్యమైన రసరమ్యమైన అంశాలను రంగస్థలంపై ప్రదర్శిస్తారు. ఇందులో మూడేళ్ళ వయసు చిన్నారులనుండి 60 ఏళ్ళు పైబడిన వారు కూడా పాల్గొని ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ఫాన్సీ డ్రెస్సుల దగ్గరనుండి సినీ గీతాల నృత్యాలు, శాస్త్రీయ నృత్యాలు, చెక్కభజనలు మొదలైనవి వుంటాయి.

అయితే ఈ సంవత్సరం సరిక్రొత్త తరహాలో “నవయుగం” ఇతివృత్తంగా ఆది నుండి అంతం వరకూ ఒకే శైలిలో కార్యక్రమం నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రతీ అంశంలో నవతరానికి ఒక సందేశాత్మకమైన సన్నివేశాలతో కూడిన అంశాలు సమకూరుస్తున్నట్లు అధ్యక్షులు శ్రీని కట్ట గారు చెప్పారు. కార్యక్రమ నిర్వహణలో భాగంగా వాచస్పతులను ఎంపిక చేయడంలో కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు శ్రీని గారు చెప్పారు.

అన్ని వయసులవారికి అన్ని అభిరుచుల వారికి నవరసాలను కలబోసి శ్రావ్యమైన సంగీత నృత్య విభావరులు, పౌరాణిక నాటికలు, యువతరానికి ఉర్రూతలూగించే సినీ గీతాలు ఈ కార్యక్రమంలో ఉంటాయి. గత రెండు నెలలుగా ఈ “నవతరం” తో కూడిన జనరంజని కార్యక్రమం మీ ముందుకు తీసుకురావడానికి కార్యవర్గ సభ్యులే కాకుండా ఎంతోమంది కళాకారులు స్వచ్చంద సేవా ధీరులు అహో రాత్రులు కష్టపడుతున్నారు.

ప్రముఖ కధ మరియు సంభాషణల రచయితలు పరుచూరి బ్రదర్స్ గా పేరుగాంచిన శ్రీ పరుచూరి గోపాలకృష్ణ మరియు శ్రీ పరుచూరి వెంకటేశ్వర రావు గార్లు ఈ ప్రత్యేక జనరంజనికి వస్తున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా తెలుగు సంఘం కార్యవర్గం అందరినీ కోరుతుంది. టిక్కెట్ల కోసం తాయి వెబ్సైటుని చూడగలరు.

Send a Comment

Your email address will not be published.