‘పుష్ప’లో అలరించనున్న జానపదం

సుకుమార్, అల్లు అర్జున్, దేవీశ్రీ ప్రసాద్‌.. ప్రేక్షకుల్లో ఈ ముగ్గురు కలయికకు మంచి క్రేజ్‌ ఉంది. ‘ఆర్య’తో మొదలైన వీళ్ల ప్రయాణం ‘ఆర్య 2’తో మరోసారి ఆకట్టుకుంది. ఇప్పుడు ‘పుష్ప’తో హ్యాట్రిక్‌ సిద్ధమైంది. ఈ కాంబినేషన్‌ అంటే ముందుగా గుర్తొచ్చేది హుషారెత్తించే పాటలు. సుకుమార్‌- బన్నీ చిత్రానికి దేవీ సంగీతమంటే ప్రత్యేక గీతం ఉండాల్సిందే. ఈ సినిమాలోనూ ఓ ఐటెమ్‌ సాంగ్‌ ఉందని, అందులో బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటానీ నటిస్తుందని ఇటీవలే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అదేంటంటే.. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథ ఇది. చిత్తూరు ప్రాంతానికి సంబంధించి, అధిక భాగం అడవుల్లోనే చిత్రీకరణ జరుపుకోనుందీ సినిమా. అక్కడి పరిస్థితుల్ని, ప్రజల జీవన విధానాన్ని చూపించబోతున్నారని తెలుస్తోంది. దానికి తగ్గట్లు జానపదాల్ని వినిపించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోందని సమాచారం . కథలో భాగంగా గిరిజనుల జానపదల గీతాన్ని తెరపై చూపించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని వినికిడి. మరి ఫోక్‌ సాంగ్స్‌తో ఎలా అలరిస్తారో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Send a Comment

Your email address will not be published.