చిన్నప్పుడు కనులారా చూడలేదు. వేల మైళ్ళ దూరంలో జరుగుతున్న ఒక వేడుక గురించి వినే అవకాశం లేదు. యాదృచ్చికంగా జరిగిన ఒక ప్రయాణపు బాటలో పరవశంతో కూడిన అనుభూతికి ప్రతిరూపం. 28 వసంతాలుగా తెలుగుదనానికి నెలవై సంక్రాంతి పండగకు కొలువై పరదేశంలో పరవశంగా జరుపుకుంటున్న ఒక దివ్యమైన కార్యక్రమం.
‘మనది’ అన్న బంధం మతం కన్నా ఒక పండగలో ఉందన్న పరిశీలనాత్మక దృక్పధం. తెలుగువారి పండగ తరతరాల బంధానికి, తరగని మమకారానికి సమున్నతమైన పీఠం. భాషా సంస్కృతుల సమతుల్యానికి ఉత్కృష్టమైన ఉపమానం. పిల్లలు పెద్దలు కలిసి జరుపుకునే మకర సంక్రమణం.
28 వసంతాలు నిర్విఘ్నంగా సంకు రేతిరి సంబరాలు మెల్బోర్న్ లో శ్రీమతి భారతి సుసర్ల గారి అధ్వర్యంలో జరుగుతున్నాయి. మొట్టమొదటిగా 2016 లో జరిగిన సంక్రాంతి గురించి తెలుగుమల్లిలో వ్రాసిన వ్యాసం ఈ క్రింది లంకెలో ఉంది.
https://www.telugumalli.com/news/మెల్బోర్న్-లో-సంక్రాంతి/
ప్రతీ ఏటా జరుపుకునే సంక్రాంతి ఈ ఏడు క్రొత్త శోభను తెచ్చుకుంది. పిల్లలందరినీ కార్యోన్ముఖులను చేసి వారిచేత బొమ్మల కొలువుకి కావలసిన స్టాండు, బొమ్మలు, రంగవల్లులు దిద్దించారు. గానా భాజనాకు వాయిద్య సహకారం కూడా అందించారు.
పిల్లలు భాష నేర్చుకోవడం ఒక ఎత్తైతే సంస్కృతి తెలుసుకోవడం, ఆచరించడం మరో ఎత్తు. పండగ గురించి తెలుసుకోవడం అవసరమైన వస్తువులు సమకూర్చడం, ప్రత్యక్షంగా పాలు పంచుకోవడం అనేది పెద్దవాళ్ళు వారికి కల్పించే ఒక సదవకాశం. మనం చేసే ప్రతీ పనిలో ముఖ్యంగా భాషా సంస్కృతుల పరంగా జరిగే కార్యక్రమాలలో పిల్లలను ఎప్పుడూ విస్మరించకుండా వుంటే మన సంస్కృతిని మనం నిలబెట్టి భావితరాలకు బాట వేసిన వారమౌతాం.
అయితే ఈ కార్యక్రమం ఎంతోమంది స్వచ్చందంగా ముందుకు వచ్చి ఒక్కొక్క పని క్రమబద్ధంగా గత నాలుగు నెలలు అహోరాత్రులు కష్టపడి కార్యరూపం దాల్చడానికి చేయూతనిచ్చారని భారతి గారు చెప్పారు. అందరికీ అణువణువునా ‘మనది’ అన్న భావం కల్పించడంలో తాను నిమగ్నమై దిశా నిర్దేశాలు చూపించడమే తన పని అని, షుమారు 200 మంది వచ్చి ఈ వేడుకను విజయవంతం చేయడం ద్వారా మన సంఘంలో ఉన్న ఇక్యతా సంఘీ భావాన్ని తెలుపుతుందని భారతి గారు చెప్పారు. అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.
లైటింగ్, సౌండ్ సిస్టం, హాలు, భోజనాలు, సంగీత విభావరి – ఒకటేమిటి అన్ని పనులు పిల్లలను దృష్టిలో పెట్టుకొని వారిచేతే మక్కువగా చేయించి పండగ వాతావరణాన్ని పదహారణాలు తీర్చిదిద్దారంటే అతిశయోక్తి కాదు.