ప్రవాసభారతీయుడు హంతకుడికి 50 ఏళ్ళ జైలు

Srinivas_Sunayana Kuchibhotla

అమెరికాలోని కాన్సన్‌ నగరంలో గత ఏడాది ఫిబ్రవరి 22న ప్రవాస భారతీయుడు తెలుగు రాష్ట్రానికి చెందిన శ్రీనివాస్‌ కూచిభొట్లను కాల్చిచంపిన కేసులో నిందితుడు ఆడం పురింటన్‌ బుధవారం నాడు కోర్టులో తన నేరాన్ని అంగీకరించాడు. అతనికి మే 4న శిక్ష ఖరారు కానుంది. పథకం ప్రకారం చేసిన ఈ హత్యకు  అతనికి పెరోల్‌ లేకుండా 50 ఏళ్ల వరకు యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశముంది.

డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడైన తర్వాత ఆ దేశమంతటా విదేశీయులపై విద్వేషం వ్యక్తమైన నేపథ్యంలో కాన్సస్‌ నగరంలో శ్రీనివాస్‌ కూచిభొట్ల, అతని స్నేహితుడు అలోక్‌ మాదసానిపై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. విద్యార్థి వీసా మీద అమెరికాకు వెళ్లిన శ్రీనివాస్‌, అలోక్‌ అనంతరం అక్కడి జీపీఎస్‌ తయారీ కంపెనీ గార్మిన్‌లో ఇంజినీర్లుగా పనిచేసేవారు. ఈ క్రమంలో గత ఏడాది ఫిబ్రవరి 22న ఉద్యోగాన్ని ముగించుకొని స్నేహితులిద్దరు కాన్సస్‌లోని ఆస్టిన్స్‌ బార్‌ అండ్‌ గ్రిల్‌లోకి మద్యం సేవించేందుకు వెళ్లారు. అక్కడ వారిని చూసిన నిందితుడు పూరింటన్‌ జాతివిద్వేషంతో దూషణలకు దిగాడు. ‘నా దేశం నుంచి వెళ్లిపోండి’ అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో అతన్ని బార్‌ నుంచి వెళ్లిపోవాల్సిందిగా సిబ్బంది చెప్పారు. ఇలా బయటకు వెళ్లిన పూరింటన్‌ అనంతరం తుపాకీ తీసుకొని వచ్చి శ్రీనివాస్‌ కూచిభొట్ల, అలోక్‌పై కాల్పులు జరిపాడు. ఈ సమయంలో జోక్యం చేసుకొని.. వారిని కాపాడేందుకు ప్రయత్నించిన సాటి శ్వేతజాతీయుడు ఇయాన్‌ గ్రిలాట్‌పై  కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో శ్రీనివాస్‌ కూచిభొట్ల ప్రాణాలు విడువగా అలోక్‌, ఇయాన్‌ గాయాలపాలయ్యారు. ఈ ఘటన నేపథ్యంలో అమెరికాలోని ప్రవాస భారతీయుల భద్రతపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ కేసులో తాజాగా నిందితుడు నేరాన్ని అంగీకరించిన నేపథ్యంలో శ్రీనివాస్‌ కూచిభొట్ల భార్య సునయన దుమల స్పందించారు. ఈ కేసులో నిందితుడు నేరాన్ని ఒప్పుకున్న నేపథ్యంలో విద్వేషం ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదనే బలమైన సందేశాన్ని అందించాలని, మనమంతా పరస్పరం ప్రేమించుకోవాలిగానీ ద్వేషించుకోకూడదని ఆమె  ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Send a Comment

Your email address will not be published.