ప్రియా....ప్రియా....ప్రియా....

కళ్ళు అనే ఇద్దరు కిరాయి వ్యక్తులను నీ దగ్గరుంచుకుని నా హృదయాన్ని ఎప్పటికప్పుడు బెదిరించే నీకు నేను రాస్తున్న ఉత్తరమిది …పూర్తిగా చదువు….నీ నిర్ణయం చెప్పు….

నీ దగ్గర మాత్రం దుష్టుడిలా ప్రవర్తించే నా పది వేళ్ళూ కుశలమే…

అలాగే నా దగ్గర మాత్రమే సిగ్గుపడుతూ ముద్దులతో పరిచయాన్ని పెంపొందించే నీ పెదవులు కుశలమేగా….?

చంకన బిడ్డనేసుకున్నట్లు నేను నిన్ను మనసులో ఉంచుకుని పడుతున్న అవస్థలను అల్లంత దూరాన నిల్చుని ఆస్వాదిస్తున్న నువ్వు కుశలమేగా?

అయినా ప్రేమలో అవస్థలు ఎంత అవసరమో అనేది నువ్వు త్వరలోనే తెలుసుకుంటావు….

నా కళ్ళను యాచించేలా చేసిన నీ అందాన్ని ఏం చెయ్యాలా అని ఆలోచనలో పడిన నా అవస్థను నువ్వు నాతో విచిత్ర నాటకమాడిస్తున్నావు కదూ……కానివ్వు…నేనొక ప్రేక్షకుడిలా చూడక తప్పదు…నువ్వు నువ్వుగా నా దగ్గరకొచ్చే వరకు…

అయినా ప్రేమలో ఆరాటాలు … పోరాటాలు ఎంతో తీయగా ఉంటాయి. ఆ విషయం నీకు కూడా త్వరలోనే తెలుస్తుందిలే…

నువ్వు లోపలికి పీల్చే గాలి నా ఊపిరితిత్తులను నింపి నీ దగ్గరకు వస్తున్న విషయాన్ని నువ్వు గమనించినా గమనించకపోయినా నీ మనసుకి ఆ వాస్తవం తెలియక కాదు… ప్రకృతి సహజత్వానికి అతీతంగా ఉండే ఈ చర్యకు ప్రేమ తప్ప మరో కారణం ఏదీ ఉండబోదు…నేనీ మాట చెప్తే నీకు నవ్వొస్తోంది కదూ…రానివ్వు…నీకు అది నిజమని త్వరలోనే తెలుస్తుంది….

ప్రేమతో వచ్చే సమస్యలు ఎంత ప్రధానమైన అంశమో నీకు తెలిసేలా చేస్తాను ఏదో క్షణాన ….

నీటిని విడిచిన చేప ఒడ్డుకి వచ్చినా నిన్ను విడిచి నేను తీరం చేరినా ప్రమాదం అనే నా ప్రేమ శాస్త్రానికి ఏం పేరు పెట్టాలో తెలియడం లేదు…..నీకేదో పేరు పెట్టాలని తపిస్తున్నాను…కానీ నువ్వు ఎందుకో నిర్లక్ష్యం చేసావు…?

వద్దనుకున్న సంతోషాలు ఈ ప్రేమ ఘర్షణలో జీవం పోసుకోవడాన్ని నువ్వు గ్రహించకపోవు…

నాకు తెలిసి నాలో గూడుకట్టిన ప్రేమకు గట్టి పునాది నీ వల్ల పడాలి అన్నది నా కోరిక… ఆ ఆశ మన మధ్య ఓ వంతెన కావాలి….

పాపం నువ్వూ నాలాగానే ప్రేమ పర్వంలో ఉన్నావని నాకు తెలుసు….నీకూ ఆ వాస్తవం తెలుసు…కానీ తెలిస్తే ఏమవుతుందని నీ ఆలోచన…

పుణ్యం కోసం దేవుడి రధాన్ని లాగే భాక్తుడిలా కాకుండా ఎద్దు లాగే బండిలా నా ప్రేమను లాగి నీ కొంగుకి ముడి వేసావు….

అద్దంలో నేను ముఖం చూసేటప్పుడు నా ముఖానికి బదులు నీ ముఖం తెలిస్తే ఎంత బాగుంటుందో…

పూచే ఒక్కో పువ్వూ నీ ముఖంలా పూస్తే ఇంకా ఎంత బాగుంటుందో…

నేను నిన్ను అనుకునేటప్పుడల్లా నువ్వు నా ఎదుట ప్రత్యక్షమయ్యే వరం లభిస్తే నాకు ఎంత ఆనందంగా ఉంటుందో వేరేగా చెప్పక్కర్లేదు…

కానీ నీ నీడే ఎంతో అదృష్టం చేసుకుంది…అది ఎప్పుడూ నీతోనే ఉంటోంది…

నీకివ్వడానికి నా పెదవులు దాచుకున్న ఏడు కోట్ల నలభై అయిదు లక్షల ఎనిమిది వేల ఏడు వందల అరవై ఎనిమిది ముద్దుల నుంచి ఒక్క ముద్దు మాత్రం ఈ ఉత్తరంలో ఇదిగో ఈ “…..” చోట ఇచ్చాను….స్వీకరించు….

ఇలా ఉత్తరంలో పంపిన ముద్దుని ప్రత్యక్షంగా ఇవ్వడానికి పరితపిస్తున్న నీ ప్రేమదాసుడను

యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.