'బాక్సర్' గా వరుణ్‌ తేజ్‌

boxerవరుణ్‌ తేజ్‌ 10వ చిత్రం చాలా రోజుల క్రితమే లాంఛనంగా ప్రారంభమైంది. కారణమేమిటో తెలియదు కానీ ఈ చిత్రం ఇప్పటి వరకూ సెట్స్‌పైకి వెళ్లలేదు. బాక్సింగ్‌ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమా చిత్రీకరణను తాజాగా ప్రారంభించారు. కిరణ్‌ కొర్రపాటి దర్శకుడిగా ఈ చిత్రంతో పరిచయం అవుతున్నాడు. సిద్ధు మద్దాని, అల్లు వెంకటేశ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని నిర్ణయించేశారు. ఈ ఏడాది జులై 20 ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్ణయించారు. ఈ తేదీన వాస్తవంగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం విడుదల కావాల్సి ఉంది. కానీ ఆ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు నిర్మాతలు ఇటీవల ప్రకటించారు. అందువల్ల ఆ తేదీన వరుణ్‌ తేజ్‌ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఇందులో వరుణ్‌ బాక్సర్‌గా కనిపించబోతున్నాడు. ఆ పాత్రకు తగ్గట్టు బరువు తగ్గడం, సులువుగా క్యారెక్టర్‌లో నిమగమయ్యేలా సిద్ధమయ్యాడు. దాని కోసం అమెరికాలో శిక్షణ కూడా తీసుకున్నాడు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో కథానాయిక ఎవరు? అన్నది ఇప్పటి వరకూ ప్రకటించలేదు. కానీ సాయీ ముఖర్జీ కుమార్తెని హీరోయిన్‌గా నటింపజేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది.

Send a Comment

Your email address will not be published.