బిగ్ బెన్

బిగ్ బెన్

బిగ్ బెన్ …..
ఈ పేరు చెప్పడంతోనే లండన్ లోని వెస్ట్‌మినిస్టర్ రాజభవనం గుర్తుకు వస్తుంది. ఇది ఉత్తర దిశలో ఉన్న గడియారపు పెద్ద గంటకు మరోపేరు. అక్కడి గడియారాన్ని లేదా ఆ గడియార స్తంభాన్నీ బిగ్ బెన్ అనే పిలుస్తారు. ప్రపంచంలోని అతిపెద్ద నాలుగు ముఖాల గంటలు కొట్టే గడియారాలలో ఇది ఒకటి కావడం గమనార్హం. ఇది ఏ ఆధారం లేకుండా నిలబడి ఉన్న అతి పొడవైన గడియార స్తంభాలలో ఒకటైన ఈ బిగ్ బెన్ 2009 వ సంవత్సరంలో 150 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ క్లాక్ టవర్ 96.3 మీటర్లు ఎత్తులో ఉంది ఇక్కడ లిఫ్ట్ సౌకర్యం లేదు. కనుక స్తంభము పైకి వెళ్ళడం కోసం 334 సున్నపురాయి మెట్లు ఎక్కక తప్పదు. ఈ బిగ్ బెన్ గడియారంలో గంటల ముల్లు పొడవు 2.7 మీటర్లు. నిమిషాల ముల్లు పొడవు 4.3 మీటర్లు.
లండన్ లో 1834 అక్టోబర్ 16వ తేదీ రాత్రి వెస్ట్ మినిస్టర్ భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. అప్పుడు అక్కడ ఉన్న క్లాక్ టవర్ ఉన్న భారీ గంట ధ్వంసమైంది. దానితో ఆ స్థానంలో భారీ క్లాక్ టవర్, కొత్తగా ఓ భారీ గంట ఏర్పాటు చేయాలని బ్రిటీష్ పార్లమెంట్ తీర్మానించింది. అనేక సంవత్సరాలు శ్రమించి కొత్త క్లాక్ టవర్, గడియారం రూపొందించారు. దానికి ఏం పేరు పెట్టాలి అని బ్రిటీష్ పార్లమెంట్ లో సభ్యులు చర్చించారు. గంటల రాణీ అని కొందరు చెప్పగా మరికొందరు విక్టోరియా అనే పేరు పెడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అప్పుడు పబ్లిక్ వర్క్స్ కమీషనర్ గా ఉన్న సర్ బెంజమిన్ హాల్ ఒక పేరు చెప్పారు. హాల్ బాగా లావుగా ఉండే వారు. అందుకని అందరూ ముద్దుగా బిగ్ బెన్ అని పిలిచేవారు. చర్చలు సుదీర్ఘంగా సాగి ఎంతసేపటికీ ఒక నిర్ణయానికి రాకపోవడంతో సభ్యులు అలసిపోయి “మరేదీ ఆలోచించకుండా బిగ్ బెన్ అనే పేరు ఖాయం చేసేద్దాం ” అని చెప్పారు. ఆ మాటకు అందరూ పెద్దగా నవ్వారు. చివరికి ఆ పేరే ఖాయం చేసారు. ఆలాగు ఆ టవర్ కి బిగ్ బెన్ అనే పేరు వచ్చింది.
అయితే కొందరు దీనికి బాక్సింగ్ లో ఇంగ్లీష్ హెవీవెయిట్ చాంపియన్ అయిన బెంజమిన్ కుంట్ అనే పేరు వచ్చేటట్టు పెట్టారు అని అంటారు. ఏది ఎలా ఉన్నా ప్రపంచంలో చూడదగ్గ వాటిలో ఇదొకటి కావడం విశేషం.

– నీరజ చౌటపల్లి

Send a Comment

Your email address will not be published.