మీరా "కృష్ణ"

మీరా   "కృష్ణ"

మీరాబాయి…..మధురభక్తిని ఆలంబనగా చేసుకుని తన గాన పాండిత్యాన్ని శ్రీకృష్ణుడికి అర్పించుకున్న గొప్ప భక్తురాలు.  రాజస్థాన్ లోని జోద్ పూర్ ను పాలించిన రత్నసింగ్ కుమార్తె అయిన మీరా బాయి మొదటి పేరు మిహిరాబాయి.  బాల్యం నుంచీ కృష్ణుడిపై భక్తిని పెంచుకున్న మీరాబాయి రాను రాను అతనినే భర్తగా కూడా భావించి ఎన్నో గీతాలు రాసింది. ఆలపించింది.

పెద్దలు ఆమెకు చిత్తూరు పాలకుడైన భోజుడితో పెళ్లి చేయిస్తారు. అయితే ఆమె అత్తగారింట్లో ఎంతసేపూ కృష్ణుడినే ఆరాధిస్తూ సాంసారిక జీవితం పట్ల ఆసక్తి చూపలేదు. అయితే ఆమె చేసుకున్న అదృష్టం భర్త ఆమె భక్తిభావనను అర్ధం చేసుకుని ఆమెకోసం ఓ ప్రత్యేకమైన ధ్యాన మందిరం కట్టించడమే. అంతేకాదు ఆమె ఆరాధనకోసం సకల ఏర్పాట్లూ చేస్తాడు. కానీ కొంత కాలానికే ఆయన మరణిస్తాడు. ఆ తర్వాత అతని తమ్ముడు పాలకుడవుతాడు. మీరాబాయి ఎందరినో ఇంటికి తీసుకుని వచ్చి భజనలు చేయడం అతనికి గానీ కుటుంబసభ్యులకు గానీ నచ్చలేదు. అయినా ఆమె భక్తి భావం, గాన మాధుర్యం తెలిసిన వారెందరో తండోపతండాలుగా వచ్చి ఆమెను దర్శించుకుంటారు. ఆమెతో కలిసి కృష్ణుడి ఆరాధనలో పాలుపంచుకుంటారు. ఆ భక్తకోటిలో మొఘల్ చక్రవర్తి అక్బర్ కూడా ఉండటం విశేషం. అక్బర్ ఆమెకు ఓ ముత్యాల హారాన్ని కానుకగా ఇస్తాడు. దానిని స్వీకరించిన మీరాబాయి కృష్ణుడి మేడలో వేసింది. ఆమె బృందావనంలో కొంత కాలం ఉండి చివరికి ద్వారకలో తుది శ్వాస విడిచింది. ఆమె జయదేవుడు గీత గోవిందానికి తాత్పర్యం కూడా రాసింది.
– యామిజాల

Send a Comment

Your email address will not be published.