రథసప్తమి

Ratha-Saptami
మాఘ శుద్ధ సప్తమినే రథ సప్తమిగా పాటిస్తారు. దీనినే సౌరసప్తమి, భాస్కరసప్తమి, మహాసప్తమి అని అంటారు.

ఈశ్వరుడు మాఘ శుద్ధ సప్తమి రోజున సూర్యుడిని సృష్టించాడు. కనుక ఈ రోజును సూర్యజయంతి అని కూడా అంటారు.

సూర్యుడు అదితి, కశ్యపుల పుత్రుడు. సూర్యుడి రథసారథి అనూరుడు. సూర్యుడి భార్య సంజ్ఞ.

ఓసారి యుధిష్టరుడు శ్రీకృష్ణుడిని రథసప్తమి ఎలా చేయాలి అడిగాడు.

అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు….

అది కాంభోజదేశం. దాని రాజు యశోవర్తముడు. అతనికి లేకలేక వృద్ధాప్యంలో ఓ కొడుకు పుడతాడు. అతనెప్పుడూ అనారోగ్యంతో బాధపడుతుంటాడు. దాంతో తండ్రి పెద్దలను పిలిచి తన కొడుకు రోగవిముక్తుడవడానికి ఏం చేయాలి అని అడుగుతాడు. అంతట వారు అతని గురించి చెప్తారు…

యశోవర్తముడు కొడుకు గత జన్మలో ఓ వైశ్యుడు. ఎనలేని సంపద ఉండీ అతను ఎవరికీ దానధర్మాలు చేసే వాడు కాదు. అయితే అవసానదశలో ఎవరో చేసిన రథసప్తమి వ్రతాన్ని అతను చూస్తాడు. అ వ్రత దర్శన ఫలితంగా మీకు అతను కొడుకుగా పుట్టాడు. కానీ ఎలాటి దానధర్మాలు చేయని కారణంగా అతనీ జన్మలో అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. అతను ఈ బాధ నుంచి విముక్తుడవడానికి ఏం చేయాలి అని రాజు అడుగుతాడు. అతనితో రథసప్తమీ వ్రతం చేయిస్తే రోగవిముక్తుడవుతాడు అని పెద్దలు సూచిస్తారు.

మాఘ శుద్ధ షష్టి రోజున శుచిగా స్నానం చేసి నదిలోగానీ చెరువులోగానీ నూతి వద్ద గానీ సాన్నం చేయాలి. ఆ తర్వాత సూర్య ఆలయానికి వెళ్ళి పూజ చేయాలి. మరుసటి రోజు సూర్యోదయాన్నే శిరస్సు మీద లోహపు ప్రమిదలో దీపం పెట్టకుని స్నానం చేయాలి. బంగారంతోగానీ వెండితోగానీ రథం చెయ్యాలి. దానికి ఏడు గుర్రాలు, సూతుని అమర్చాలి. అందులో సూర్యప్రతిమ ఉంచాలి. నదీతీరంలోనో సరోవరతీరాన్నో కొత్త వస్త్రం పరచి దాని మీద ఆ రథం ఉంచాలి. సాయంకాలం వరకు పూజ చేసి రకరకాల పళ్ళు నివేదించాలి. అవన్నీ తీసుకుని ఇంటికి రావాలి. ఆ రాత్రి జాగారం చేయాలి. మరుసటి రోజు మళ్ళీ పూజ చేసి దానధర్మాలు చేయాలి. రథాన్ని సూర్య ప్రతిమను కూడా దానం చేసెయ్యాలి. ఇలా చేసిన వారికి సర్వరోగవిముక్తి, పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుందంటారు. అలాగే రాజు తన కొడుకుతో రథసప్తమీ వ్రతం చేయిస్తాడు. కొడుకు రోగవిముక్తుడవుతాడు. ఇది రథసప్తమి వ్రత ప్రభావం.

ఇలా ఉండగా ఈ రోజుల్లో రథసప్తమి రోజున తల మీద ఏడు జిల్లేడు ఆకులు లేదా ఏడు రేకు ఆకులు గానీ లేదా రెండు రకాల ఆకులూ పెట్టుకుని స్నానం చేయాలి. స్నానం తర్వాత సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఆ తర్వాత సూర్యప్రార్థన చేయాలి. పాలతో పాయసం చేసి చిక్కుడు ఆకులో ఉంచి సూర్యుడికి నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి.

ఒకవేళ రోహిణీ నక్షత్రంతో కూడిన రథసప్తమి తిథి వచ్చినట్లయితే దానికి మరింత మహత్తు ఉంటుంది.

మన ఆంధ్ర దేశంలోని అరసవిల్లిలో ఉన్న సూర్యాలయంలో పూజలు భారీ ఎత్తున చేస్తారు. ఈరోజున సూర్యకిరణాలు సూటిగా వచ్చి స్వామివారి పాదాలను తాకుతాయి.

మాఘమాసంలో బాలనిత్యవ్రతం, ధనపాలవ్రతం, నిత్యదానవ్రతం వంటివి కూడా సూర్యుడిని ఉద్దేశించి చేసేవే.

ఇలా ఉండగా, మాఘ శుద్ధ సప్తమి మొదలుకుని ఏకాదశి వరకు గల అయిదు రోజులను భీష్మపంచకం అంటారు. అంపశయ్యపై ఉన్న భీష్ముడు అయిదో రోజు ప్రాణం వీడాడు.

– నీరజ చౌటపల్లి

Send a Comment

Your email address will not be published.