అది అర్ధరాత్రి.
సముద్రజలాలపై ఓ పడవ వెళ్తోంది. ఆ పడవలో ముగ్గురు ప్రయాణం చేస్తున్నారు. ఉన్నట్టుండి ఒక రాక్షసి పడవలోకి దూకింది. ముగ్గురూ భయంతో వణికిపోయారు.
ఆ రాక్షసి భీకరమైన తన కోరలను చూపించి వికటాట్టహాసం చేసింది.
“మీ ముగ్గురినీ మింగబోతున్నాను…” అని భీకరంగా నవ్వింది రాక్షసి. ముగ్గురూ తమను తినవద్దని, ప్రాణాలతో విడిచిపెట్టమని రాక్షసిని బతిమాలారు.
అప్పుడు రాక్షసి ఒక షరతు పెట్టింది.
“మీ ముగ్గురిలో ఒక్కరైనా తెలివైన వారైతే మీకు ప్రాణ భిక్ష పెడతాను. మీ తెలివితేటలు నిరూపించుకోవాలి. నేను మీకు ఒక పరీక్ష పెడతాను. మీరు ముగ్గురూ ఒక్కొక్కరుగా సముద్రంలోకి ఏదైనా ఒకటి విసిరేయాలి. మీరు విసిరేసే దానిని నేను తీసుకొచ్చి మీకు ఇస్తే మీరు ఓడిపోయినట్టు. అప్పుడు నేను మిమ్మల్ని తినేసి నా ఆకలి తీర్చుకుంటాను. …” అని రాక్షసి చెప్పింది.
ముగ్గురు మిత్రులూ సరేనన్నారు. ఆలోచించారు.
మొదటి మిత్రుడు తన వేలికున్న ఉంగరం తీసి సముద్రంలో విసిరాడు. వెంటనే రాక్షసి సముద్రంలోకి దూకి ఆ ఉంగరాన్ని తీసుకొచ్చి అతనికి ఇచ్చింది.
ఇక రెండవ వాడు తన మెడలో ఉన్న బంగారు గొలుసుని సముద్రంలోకి విసిరాడు. రాక్షసి వెంటనే సముద్రంలోకి దూకి ఆ గొలుసుని వెతికి తీసుకొచ్చి అతనికి ఇచ్చింది. రాక్షసి చేతిలో మొదటి ఇద్దరూ ఓడిపోయారు.
ఇక మూడవ మిత్రుడు మిగిలాడు.
“నువ్వేం విసరబోతున్నావు” అని అతని వంక చూసి రాక్షసి హేళనగా నవ్వింది.
వెంటనే మూడవ వాడు “తనదగ్గరున్న వాటర్ బాటిల్లో ఉన్న నీటిని సముద్రంలోకి పారబోశాడు. తాను పారబోసిన నీటిని తీసుకురమ్మని చెప్పాడు. అతని మాటకు రాక్షసి ఖంగుతింది. మరో మాట మాట్లాడక అక్కడినుంచి పారిపోయింది రాక్షసి.
నీతి – రాక్షసికి సైతం చుక్కలు చూపించే వారు ఈ లోకంలో ఇంకా ఉన్నారు అని.
– నీరజ చౌటపల్లి, కైకలూరు