రాము తాతయ్య ...

రాము తాతయ్య ...
రాము వాళ్ళ తాతయ్య
కాస్తంత ఈడిస్తూ నడుస్తున్నా
ఆయన మోము
ఎప్పుడూ నవ్వుతూనే పలకరించేది
ఆయన మాట తీరు
ఏదో ఒక జీవిత సత్యాన్ని చెప్తున్నట్లే ఉండేది
ఎవరి వద్దా ఏదీ ఆశించకుండా
నా రోజులు అయిపోతాయి అనే
ప్రగాడ నమ్మకమున్న తాతయ్య ఆయన
ఈ మాటను గంభీరంగానే చెప్పుకునేవారు
అందులో తడబాటూ తత్తరపాటూ
కనిపించనివ్వడు  ఆయన
పేదరికం
జీవితాన్ని నడిపించి
చదివించినప్పుడు సైతం
తన ఆత్మవిశ్వాసంలో ఒక్క చిల్లూ
పడనివ్వక జాగర్త పడుతూ వచ్చారు
ఆయన
అలాంటి తాతయ్య
చనిపోయారన్న కబురు
నా వరకు వచ్చినప్పుడు
నా మనస్సు చలించింది
మరణం మరి కొన్ని రోజుల్లోనే
అని తెలిసినప్పుడు
ఆయనంతట ఆయనే
మిత్రుడు రాముని తోడు తీసుకుపోయారట
శ్మశానం చూసి రావడానికి
తనను కౌగిలించే మట్టిని
ముందుగా చూసుకుని
తెగ ఆనందపడ్డారట
తనను ఫలానా చోట పడుకోపెట్టాలని చెప్పి
అక్కడ పడుకున్నారట
మల్లె ఇంట్ల దగ్గరనుంచి
నలుగురు మోసుకుపోయే శ్రమ
ఎవరికైనా ఎందుకనుకున్నారో ఏమిటో
ఆయన పడుకున్న చోటే తుది శ్వాస విడిచేసారట
మిత్రుడు రాము
ఈ సంగతి చెప్తుంటే నమ్మలేకపోయాను
మనస్సు ఒక్క క్షణం ఆగిపోయింది
రాము
తాతయ్య చివరి క్షణాలను
ప్రత్యక్షంగా చూసిన వాడవడంతో
మళ్ళీ మనిషి కావడానికి
చాలా కాలమే పట్టింది…
కానీ
ఆయన చెప్పక నేరుగా చూపించిన
జీవిత నడకను
అనుసరించడంలో
మునిగిపోయాడు మిత్రుడు రాము
– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.